సబ్ ఫీచర్

అవగాహనతోనే పరీక్షల్లో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరికొద్దిరోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. సాధారణంగా పరీక్షల సమయంలో ఎంత బాగా చదివిన విద్యార్థులైనా తమకు తెలియకుండానే కొంత ఒత్తిడికి గురవుతుంటారు. కొందరు విద్యార్థుల్లో ఈ ఒత్తిడి కారణంగా చదివినది మరచిపోవడం, పరీక్షల పట్ల భయం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే ఈ తరహా ఒత్తిళ్లను అధిగమించవచ్చునని విద్యావేత్తలు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అంశాలు..
* ఇప్పుడు రాసే పరీక్షలు కూడా ఇప్పటివరకు మీరు సాధన చేసి రాసిన పరీక్షల వంటివే.. ఇంకా చెప్పాలంటే వాటికంటే సులభమైన పరీక్షలుగా భావించండి.
* సమయాన్ని టైం టేబులు వేసుకుని, దాన్ని సబ్జెక్టుల వారీగా పంచుకుని చదువుకోవాలి. ఈ సమయంలో కొత్తవి చదివే బదులు ఎంతగా రివిజన్ చేసుకుంటే అంత మంచిది.
* పరీక్షల పేరుతో పగలు, రాత్రీ లేకుండా చదువుతూ కూర్చోకుండా వేళకు తిని, వేళకు నిద్రపోవాలి. కావాలంటే ఉదయానే్న ఒక గంట అదనంగా చదువుకోవచ్చు.
* రోజంతా ఒకే సబ్జెక్టు చదవుతూ కూర్చోకుండా నిర్ణీత సమయంలో నిర్ణీత అంశాలను చదవటం పూర్తిచేయాలి. రోజూ అన్ని సబ్జెక్టుల రివిజన్‌కు ఎంతో కొంత సమయం కేటాయించాలి.
* ఒక అంశాన్ని అరగంట చదివిన తర్వాత దాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ గుర్తుకు రాకపోతే మరోసారి చదివి మననం చేసుకుంటే సరి. కష్టమైన అంశాలను మననం చేసుకోవటమేకాక ఒకసారి చిత్తుగా రాసి చూసుకోవాలి.
* మొత్తం సిలబస్‌ను కవర్ చేయటం కుదరదు కనుక ప్రాధాన్యతా క్రమంలో చదువుకోవాలి. పాత పరీక్షా పత్రాలను చూసి ఈ ప్రాధాన్యతలను గుర్తించాలి. ఎప్పుడూ ఒకేచోట కూర్చొని కాకుండా అప్పుడప్పుడూ లేచి ఇంట్లో, ఆరుబయట ఐదు నిముషాలు అటూ ఇటూ తిరిగి, తాజా గాలి పీల్చుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
* గణిత సూత్రాలు, బొమ్మల సాధన, మ్యాప్స్, పట్టికలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
* ప్రతిరోజూ లేవగానే పది నిముషాల పాటు యోగా, ప్రాణాయామం సాధన చేస్తే మానసిక ఒత్తిడి దూరం కావడమే కాక జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
* ఫలానా ప్రశ్న తప్పక వస్తుంది అనే ఊహలను మనసు నుంచి తుడిచేసి రివిజన్‌పైనే దృష్టి పెట్టాలి.
* పరీక్షల సమయంలో సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది కనుక వాటికి తప్పక విరామం ఇవ్వాలి.
* ఈ సమయంలో తగినంత నీరు, మజ్జిగ, జావతో పాటు ఓట్స్, తృణధాన్యాలు, బాదం పప్పు, పండ్లు, పెరుగు వంటివాటిని తీసుకోవాలి.
* పరీక్ష ముందురోజు హాల్ టికెట్ మొదలుకొని అవసరమైన సరంజామాను ఒకచోట పెట్టుకోవడం, పరీక్షా కేంద్ర వివరాలు ముందే తెలుసుకోవటం, పరీక్షా కేంద్రానికి కాస్త ముందుగా చేరుకోవడం వల్ల చివరి నిముషంలో కంగారు పడాల్సిన ఇబ్బంది తలెత్తదు.
* చివరగా పరీక్షలు, సదరు అంశంపై విద్యార్థుల అవగాహనను పరీక్షించే కొలమానాలే తప్ప ఆ ఫలితాలే విద్యార్థి ప్రతిభకు గీటురాళ్ళు కావు. కనుక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల కోసం అటు తల్లిదండ్రులు, ఇటు గురువులు కూడా విద్యార్థులను ఒత్తిడి పెట్టకుండా పరీక్ష విషయంలో వారికి తగిన స్వేచ్ఛనివ్వాలి.