కడప

నగర ప్రజలకు ఆహ్లాదకర థీమ్ పార్కు:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,్ఫబ్రవరి 1: ఈనెల 8వ తేదీ నుంచి నగర ప్రజలకు పూర్తిస్థాయిలో థీమ్ పార్కు నగర వనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో ఆయన అధికారులతో నగరంలో ప్రారంభానికి నోచుకోబోతున్న థీమ్ పార్కుపై ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడప పట్టణంలోని పుట్లంపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన నగరవనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని వసతులతో కూడిన అహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నగర వనంలో థీమ్ పార్కు లాగా నక్షత్రవనం, రాశి వనం, బొటానికల్ గ్రామంలా వివిధ రకాల పచ్చిని మొక్కలు, పూలమొక్కలతో నగర జనానికి ఆహ్లాదకరం కలిగించేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు నగర వాసులు సందర్శించేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే క్యాంటిన్ వసతితోపాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఊయలు, జారుబండ, ఆట వస్తువులు, సైక్లిన్‌వంటి వసతులు ఇప్పటికే ఏర్పాటైనట్లు కలెక్టర్ తెలిపారు. ఈపార్కులోకి నగర వాసులు ఎవరైనా వెళ్లవచ్చని అయితే ఎంట్రీఫీజు చెల్లించి ఏదో ఒక గుర్తింపుకార్డును ఎంట్రీలో తనిఖీ అధికారులకు చూపించి లోపలికి వెల్లాలన్నారు. నగర వనంలో పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించేందుకు మూడు గంటల పాటు అనుమతి ఇస్తామన్నారు. జిల్లాలోని ప్రజలు మానసిక ప్రశాంతత కోసం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నగర వనాన్ని సందర్శించవచ్చునన్నారు. ప్రజల సౌకర్యార్థం ఆరునెలలు, ఏడాది పాటు ప్రతి ఒక్కరికీ మెంబర్ షిప్ సౌకర్యం కలిగించే విధానం జరుగుతుందన్నారు. సాయంత్రం వేళలో నగరవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని డిఎఫ్‌వోకు కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నగర అధ్యక్షుల సస్పెన్షన్
* అనివార్యంగా జిల్లా కమిటీల రద్దు

కడప,్ఫబ్రవరి 1: కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు బండి జక్కరయ్యలను పార్టీనుండి సస్పెండ్ చేస్తూ శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనివార్యంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కమిటీలు రద్దయ్యాయి. వీరు సస్పెండ్ అయిన సంఘటన పూర్వాపరాలకు వెళితే.. ఇటీవల జిల్లాకాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు బండి జక్కరయ్యల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంలో డీసీసీ అధ్యక్షుడు నియంతృత్వంగా వ్యవహరిస్తూ, పార్టీకార్యక్రమాలకు, నిరసనలకు జెండాలు తీసుకునేందుకు కూడా తన అనుమతి కావాలని చెప్పడంపై ఘర్షణకు దిగారు. డీసీసీ కార్యాలయం అనుబంధంగా ఉన్న షాపింగ్ గదుల అద్దెలను అక్రమంగా కాజేశారని ఆరోపించారు. అదేరోజు ఒకరిపై ఒకరు పీసీసీ అద్యక్షునికి ఫిర్యాదు చేసుకున్నారు. అదేరోజు వీరిద్దరికీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరి ఫిర్యాదులపై, జరిగిన అవకతవకలపై ఆ పార్టీ ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మెయప్పన్ కొద్దిరోజుల క్రితం విచారణ చేశారు. ఆ విచారణలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్‌పై పలువురు కార్యకర్తలు పలురకాలుగా మెయప్పన్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుని అవకతవకలపై ఒక కరపత్రం ప్రచురణ జరిగి కాంగ్రెస్‌పార్టీ పరువుపోయిందని, కార్యకర్తలు వాపోయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జిల్లా అధ్యక్షునికి, నగర అధ్యక్షునికి ఏమాత్రం పొసగక పోవడంతో ఇరువురి కార్యక్రమాలపై పొంతన లేకుండా, అవగాహన లేకుండా పనులు చేస్తూ కాంగ్రెస్‌పరువు బజారునపడిందని, మరికొందరు నగర అధ్యక్షుడు జక్కరయ్యపై, మెయప్పన్‌కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ సమీక్షించిని మెయప్పన్ సమీక్ష వివరాలు అధిష్ఠానానికి పంపడంతో రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్‌ను , నగర అధ్యక్షుడు జక్కరయ్యతో సహా కమిటీలను సస్పెండ్ చేశారు.

దేశ సమగ్ర వికాసమే మోదీ సర్కార్ లక్ష్యం
* బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి
కడప సిటీ,్ఫబ్రవరి 1: దేశవ్యాప్తంగా అన్నివర్గాల వారికి లబ్దిచేకూరేలా మోదీ సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం హర్షణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. దేశ సమగ్రాభివృద్ధే మోదీ సర్కార్ లక్షమన్నారు. దేశంలోని 12కోట్లమంది పేద రైతులకు ప్రయోజనం కలిగేలా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టడం సంతోషదాయమన్నారు. అలాగే నిర్లక్ష్యానికి గురౌతున్న అసంఘటిత రంగానికి చెందినవారు కేవలం రూ.100లు నెలకు చెల్లించడం ద్వారా 60ఏళ్లుదాటిన తర్వాత పీఎం శ్రమయోగి మాంధల్ ద్వారా నెలకు రూ.3వేలు పెన్షన్ అందించడం అభినందనీయమన్నారు. ఎప్పటినుండో అసంతృప్తిగా మిగిలిన ఆదాయపన్ను పరిమితిని రెండున్నర లక్షలరూపాయల నుంచి ఐదు లక్షలకు పెంచడం మద్యతరగతి వర్గాలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా మొత్తాన్ని ఒకటిన్నర లక్షల రూపాయల నుండి ఆరులక్షలకు పెంచడం, బడ్జెట్‌లో ముద్ర యోజనకోసం రూ.7.23లక్షలకోట్లు, ఉపాధిహామీ కోసం పెద్ద ఎత్తునరూ.60వేలకోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. రైల్వేల అభివృద్ధికి, గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి, గోసంమృద్దికోసం గోకుల్‌మిషన్ ఏర్పాటుతోపాటు ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం రూ.70వేల కోట్లు కేటాయించారన్నారు. ప్రజాయోగమైన బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దేశాభివృద్ధికోసం మోదీ పనిచేస్తున్నట్లు నిరూపితమైందన్నారు.

మైదుకూరులో ఉల్లికొనుగోలు కేంద్రం ప్రారంభం
* రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం
* మంత్రి ఆదినారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్
మైదుకూరు,్ఫబ్రవరి 1:కడప జిల్లా మైదుకూరు కేంద్రంగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రపంచ ఖ్యాతి గడించిన కేపీ ఉల్లిగడ్డల కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి నుంచే రైతుల నుంచి ఉల్లికొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మంత్రి స్థానిక నంద్యాల రోడ్డులోని మార్కెట్‌యార్డు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కేపీ ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని రైతుల హర్షద్వానాల మద్య టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్‌తో కలిసి మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేపీ ఉల్లి రైతులు వారిని గజమాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమానికి అహర్నిషలు కృషి చేస్తున్నారని ,వారికోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. ఉల్లికొనుగోలు వ్యవహారంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు తనవద్దకు రాకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. తూకాల్లో తేడాలు ఉండరాదని, రైతుల నుంచి ఒక గ్రాము కూడా అదనంగా తీసుకోరాదని ప్రభుత్వానికి నష్టం వచ్చినాఫర్వాలేదని రైతులకు నష్టం రాకూడదన్నారు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో ఉల్లికొనుగోలు చేస్తామన్నారు. 25ఎంఎం గడ్డలు క్వింటా రూ.2వేలకు కొనుగోలు చేస్తామని, పదిరోజుల తర్వాత కొనుగోలు రైతులకు డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో మైదుకూరు నుంచి పుట్టాసుధాకర్ యాదవే పోటీ చేయబోతున్నారని, ఇందులో ఎలాంటి అపోహలు లేవని మంత్రి స్పష్టం చేశారు. పలు రాజకీయ కారణాల సమీకరణలో భాగంగా కడప పార్లమెంట్‌కు తాను కానీ, లేదా రామసుబ్బారెడ్డి కానీ ఎన్నికల బరిలో ఉండబోతున్నామన్నారు. మాలో ఎవరు పోటీలో ఉన్నా పరస్పర సహకారంతో మనస్ఫూర్తిగా వారి గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. ఈప్రాంత రైతులు కేపీ ఉల్లిగడ్డలనే ఓట్లుగా భావించి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, యుగంధర్, ఎన్.మల్లికార్జునయాదవ్, దాసరిబాబు, గుడిపాటి బాబు, వెంకటసుబ్బారెడ్డి, కొండపల్లి ఉమాకాంత్ , అధికారులు, రైతులు పాల్గొన్నారు.

బంద్ ప్రశాంతం
* అధికార పార్టీ మద్దతు * విద్యాలయాలు మూత * టీడీపీ వర్గాల వాగ్వివాదం
ఆంధ్రభూమి బ్యూరో
కడప,్ఫబ్రవరి 1: ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన బంద్ జిల్లాలో పాక్షికం, ప్రశాతంగా నిర్వహింపబడింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చాలా ప్రాంతాల్లో బంద్ నిర్వాహకులు కేవలం నిరసన కార్యక్రమాలకే పరిమితమయ్యారు. బలవంతంగా వ్యాపార సంస్థలను మూయించడం వంటి సంఘటనల జోలికి పోలేదు. జిల్లాలోని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛంధంగా మూసివేశారు. తెలుగుదేశం పార్టీలోని రెండువర్గాల మధ్య వారిలో వారే కలహించుకుని వాగ్వివాదానికి దిగారు. శుక్రవారం తెల్లవారు జాముననే సీపీఐ నేతలు ఆర్టీసీ బస్టాండుకు చేరుకుని బస్సులను బయటకు వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. వారు అక్కడి నుండి వెళ్లిపోగానే పోలీసులు బందోబస్తుతో బస్సులను బయటకు పంపించారు. సీపీఎం, తెలుగుదేశం, రాయలసీమ కమ్యూనిస్టుపార్టీలు ఈ బంద్‌లో బైక్ ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. తెలుగుదేశంపార్టీ నేతలు ఎన్‌టీఆర్ సర్కిల్‌లో ఎన్‌టీఆర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైటాయించి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. సీపీఐ నేతలు కేంద్రప్రభుత్వ సంస్థలైన హెడ్‌పోస్ట్ఫాస్, లీడ్ బ్యాంకు, ఆకాశవాణి తదితర కార్యాలయాలవద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బంద్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, తెలుగుదేశం నగర అధ్యక్షుడు జిలానీ బాషా తదితరుల ఆధ్వర్యంలో ఆయా పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలుగుదేశం వర్గాల వాగ్వివాదం
ఎన్‌టీఆర్ సర్కిల్‌లో తెలుగుదేశంపార్టీ నగర అధ్యక్షుడు జిలానీబాషా పార్టీ కార్యకర్తలతో రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా, మార్కెట్‌యార్డు మాజీ ఉపాధ్యక్షుడు చెన్నంశెట్టి మురళితోపాటు మరికొందరు అక్కడకు చేరుకుని తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు. ఏనాడూ పార్టీ కార్యక్రమాలకు హాజరుకాని వారు పార్టీలో ఉన్నారో లేదో తమకు తెలియదని, అందుకే సమాచారం ఇవ్వలేదని జిలానీ బాషా సమాధానం ఇచ్చారు. ఈ రెండువర్గాల మద్య మాటామాటా పెరిగి తోపులాట వరకు వచ్చింది. ఈలోపు తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించి పంపించారు.

నేడు ‘పండుగ’లా పెన్షన్ల పంపిణీ
* మిఠాయి, కారాలతో నగదు అందజేత
* పసుపు కుంకుమతో డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేత
* గ్రామసభల్లో పంపిణీ
ఆంధ్రభూమి బ్యూరో
కడప,్ఫబ్రవరి 1: జిల్లాఅంతటా శనివారం నుంచి పండుగలా పెన్షన్ల పంపిణీకి జిల్లాయంత్రాంగం సన్నాహాలు పూర్తిచేసింది. ఊరు వాడలో వివిధ రకాల పెన్షన్ దారులకు, పెంచిన పెన్షన్ డబ్బులతోపాటు వారికి నోరు తీపి చేసేందుకు మిఠాయి, కారాలు అందజేయబోతున్నారు. ప్రతి గ్రామంలో షామియానాలు వేసి ఊరి మాజీ సర్పంచ్‌లు, గ్రామపెద్దలు,రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఈపెన్షన్లు అందజేయాలని రాష్ట్రప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో స్వయం సహాయక సంఘ సభ్యులు 3,41, 309మంది ఉన్నారు. ఇందులో 3,04,148 మంది వివిధ సామాజిక పెన్షన్లు పొందడానికి ప్రభుత్వం దగ్గర లెక్క వుంది. పెన్షన్లు కోసం రూ.92.70కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు ఇప్పటికే ఆయాగ్రామ కార్యదర్శుల వద్ద నగదు రూపేన ఉన్నాయి. వీరంతా శనివారం ఉదయానే్న పల్లెబాట పట్టి షామియానాలు ఏర్పాటుచేసుకుని, టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటుచేసి పండుగలా గ్రామసభ నిర్వహించి తీపిని అందించి, పెంచిన పెన్షన్ల నగదును అందించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే పసుపుకుంకుమ కింద రూ.341.30కోట్లు నిధులు మంజూరయ్యాయి. 35,647 సంఘాలు గ్రామీణప్రాంతాల్లో ఉన్నాయి. 3,41,309మంది సభ్యులకు పసుపుకుంకుమ కింద మొదటి దఫాలో రూ.85కోట్లు, శనివారం రోజున చెక్కురూపేనా అందించనున్నారు. అలాగే రెండవ దశలో రూ.119కోట్లు నిధులను ఈనెల 8వ తేదిన చెక్కులు అందజేయనున్నారు. అలాగే రూ.136కోట్ల నిధులతో 3వ దశలో ఏప్రిల్ 5వ తేదిన పసుపుకుంకుమ కింద మహిళలకు అందజేయున్నారు. జనవరి నెలలో పెంచిన పెన్షన్ల మొత్తాన్ని కలిపి ఏప్రిల్ 5వ తేదీన ఇవ్వడానికి చెక్కులు సిద్ధం చేశారు. గ్రామాల్లో కళకళలాడేలా ఓ పండుగ వాతావరణంలా ఇప్పటికే కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు షామియానాలు ఏర్పాటుచేసుకోవడంలో గ్రామసభలకు కావాల్సిన సౌకర్యాలు అమర్చుకోవడంలో లీనమయ్యారు. పెన్షన్ మొత్తం పదిరెట్లకు పెంపు అనే శీర్షిక కింద రూ.2వేల నోటుతో ముఖపత్రం ముద్రించి వుంది. దీన్ని జిల్లాకలెక్టర్ పేరుమీద విడుదల చేయనున్నారు. నూతన పుస్తకాలు కూడా శనివారం నుంచే పెంచిన పెన్షన్ల పుస్తకాలు అందజేయనుంది. పుస్తకం మీద ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్‌పథకం నెలకు రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500 అని ముద్రించివుంది. నా ఆశయం పేదరికం లేని సమాజమని పెన్షన్ల పుస్తకం మీద ముద్రించివుంది. సంతోషం, ఆరోగ్యం, సంతృప్తి, భద్రత , భరోసా అనే అంశాలు కూడా పుస్తకం మీద చంద్రబాబునాయుడు ఫోటోతో ముద్రించివుంది. ఈ పుస్తకాలను నేటి నుంచే పెన్షన్ దారులైన అభయహస్తం, డప్పుకళాకారులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, వికలాంగులు, డయాలసిస్ పేషెంట్లకు, వృద్ధులు వర్గాలవారికి కొత్త పుస్తకాలతోపాటు పెంచిన నగదును రూ.1000 నుంచి రూ.2వేలు, రూ.1500 నుంచి రూ.3వేలకు, రూ.3వేల నుంచి రూ.3,500 వరకు అందజేయనున్నారు. అలాగే కడప కార్పొరేషన్‌తోపాటు 8మున్సిపాల్టీలలో 1,13000 సంఘసభ్యులకు పసుపుకుంకుమ కింద చెక్కులను అందించడానికి మెప్మా అధికారులు సిద్ధం చేశారు. మండలస్థాయిలో మూడు గ్రామాలు కలిపి ఒక గ్రామసభగా ఏర్పాటుచేసి ఒక్కొక్క పెన్షన్ సభ్యురాలికి రూ.15లు చొప్పున అలాగే డ్వాక్రా సంఘ సభ్యులకు రూ.15లు చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరతో నాణ్యమైన మిఠాయిని, కారాలను శనివారం అందించాలని కలెక్టర్ ఆదేశాలు క్షేత్రస్థాయి అధికారులకు జారీ చేశారు. అలాగే నేరుగా రూ.6వేలు ఖర్చుపెట్టుకుని పంచాయతీ సెక్రటరీలు, కార్యదర్శులు సదుపాయాలు గ్రామాల్లో సమకూర్చి ప్రభుత్వం పెంచిన పెన్షన్ల విధానాన్ని లబ్ధిదారులకందరికీ వివరించి చెప్పాలని ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది.

రాజంపేటను చుట్టేస్తున్న బత్యాల
* రాజంపేట అభ్యర్థిగా ప్రచారం మొదలెత్తేసిన దేశం శ్రేణులు
రాజంపేట, ఫిబ్రవరి 1:తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశీస్సులు అందుకున్నట్టుగా భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయులు రాజంపేట నియోజకవర్గంలో వర్గ నేతలతో పాటు పార్టీ శ్రేణులను, ముఖ్యులతో భేటీ అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బత్యాల చంగల్రాయులును కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ దేశం శ్రేణులు ప్రకటించేస్తున్నాయి. గురువారం రాజంపేట దేశం ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గస్థాయి నేతలు సైతం బత్యాల చంగల్రాయులు తమ అభ్యర్థిగా రాబోతున్నట్టు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈకోవలోనే పార్టీ అధినేత చంద్రబాబు సైతం గత నెల 22వ తేదీన అమరావతిలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొనే బలమైన అభ్యర్థిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించడం వెనుక బలిజ సామాజికవర్గానికి చెందిన బత్యాల చంగల్రాయులు అభ్యర్థిత్వాన్ని దృష్టిలో ఉంచుకొనే అని పార్టీ శ్రేణులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ కోవలోనే బత్యాలకు చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ అందిన్నట్టు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గ వ్యాపితంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు బత్యాల చంగల్రాయులు అభ్యర్థిత్వంపై సుముఖంగా ఉండడం విశేషం. మంగళవారం నుండి నియోజకవర్గంలో పార్టీ ముఖ్యనేతలందరితో భేటీలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్న బత్యాల చంగల్రాయులు గురువారం ఆత్మీయ దేశం సమావేశంలో పార్టీ శ్రేణుల నుండి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేయించుకున్నారు. అలాగే శుక్రవారం ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి బత్యాల చంగల్రాయులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే అన్న క్యాంటీన్ వద్దకెళ్ళి తనిఖీలు నిర్వహించారు. అన్న క్యాంటీన్ పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారని, కనుక పరిశుభ్రతకు, భోజనం నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం పట్టణంలోని పెద్ద మశీదు (జామియా) వద్దకెళ్ళి ముస్లీం మతపెద్దలతో సమావేశమై వారి ఆశీస్సులు తీసుకున్నారు. మీ సమస్యలు నా సమస్యలుగా భావిస్తానని, మీకు ఎప్పుడు కష్టమొచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, అలాగే అభివృద్ధికి సంబంధించి కూడా తన దృష్టికి తీసుకొస్తే మీకు అండగా నిలబడతానని బత్యాల చంగల్రాయులు ముస్లీం మతపెద్దలకు హామీ ఇచ్చారు. అనంతరం తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నుండి కడప వరకు పొడిగిస్తుండడంతో రాజంపేట రైల్వేస్టేషన్ వద్దకెళ్ళి తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం పలికి రైలు సిబ్బందిని సత్కరించి, ప్రయాణీకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొత్తానికి రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి దాదాపుగా బత్యాల చంగల్రాయులును ఖరారు చేయడం వల్లే బత్యాల నియోజకవర్గంలో ముమ్మర ప్రచార కార్యక్రమం చేపడుతూ, పార్టీ కార్యకర్తలు, నేతలతో సమీక్షా సమావేశాలు ఎన్నికలకు సంబంధించి నిర్వహిస్తూ, మరో ప్రక్క వివిధ వర్గాల ప్రజలతో భేటీలవుతుండడం జరుగుతుందని తెదేపా శ్రేణులు వివరిస్తున్నాయి.