రాష్ట్రీయం

వైసీపీ-టీడీపీ మధ్య మాటల తూటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 17: శాసనసభ సాక్షిగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం సభలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరాలకు అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా స్పందించారు. దీంతో వాడి.. వేడిగా చర్చ సాగింది. వైసీపీ సభ్యులు రోజా, అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి, మంత్రులు రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, జోగి రమేష్‌కు సభలో టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు, కరణం బలరాం మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గవర్నర్ ప్రసంగానికి తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సమావేశానికి హాజరైన సభ్యులంతా గవర్నర్ ప్రసంగానికి ప్రగాఢ కృతజ్ఞతాబద్ధులై ఉన్నారని ప్రతిపాదించారు. దీన్ని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు బలపరిచారు. అనంతరం చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారం అనుమతిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని నవరత్నాలు అజెండాతో అన్నివర్గాల ప్రయోజనాలతో పాటు దేశంలోనే రోల్‌మోడల్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని ఇందుకు గవర్నర్ ప్రసంగం దర్పణం పడుతోందని తెలిపారు. టీడీపీ నేతలు విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీలు చేయటం ఘోరంగావక్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనిఖీల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చట్టానికి అతీతులు కారన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వారినే తనిఖీలు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏమైనా దైవాంశ సంభూతులా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి పెచ్చరిల్లిందని, ప్రకృతి సంపదను ధ్వంసం చేశారని ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో అవినీతి భారీ స్థాయిలో జరిగిందని నీరు-చెట్టు, ధర్మపోరాట దీక్ష, ప్రాజెక్ట్‌లు, పోలవరం నిర్మాణంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తక్కువ ఖర్చుతో పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో చంద్రబాబు అవగాహనా రాహిత్యం వల్ల.. అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. దీనిపై
అచ్చెన్నాయుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ల గురించి చంద్రబాబుకే నీతులు చెప్తున్నారు.. మీ అదృష్టం బాగుండి మంత్రులయ్యారని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి అనిల్‌కుమార్ స్పందిస్తూ తాను మంగళగిరి పేరును మందలగిరిగా చదివేవాడిని కాదని, దొడ్డిదారిన మంత్రి పదవులు పొందలేదని పరోక్షంగా లోకేష్‌ను విమర్శించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి మేం ‘పప్పు’లం కాదన్నారు. మీకు చింత చచ్చినా పులుపు చావలేదనే చందంగా అహంకారం తగ్గలేదని చురకలంటించారు. అందుకే 23 మంది మాత్రమే గెలిచారన్నారు. వీరందరినీ ఆలీబాబు..23 దొంగలని సంబోధించారు. అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు లేవనెత్తి మంత్రి అనిల్‌కుమార్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. శాసనసభకు ఎన్నికైన 23 మంది దొంగలైతే అంతా దొంగలే అని ప్రతిస్పందించారు. చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో కూర్చున్నా అచ్చెన్నాయుడులో మార్పు వస్తుందని అనుకున్నా ఇంకా మారలేదన్నారు. ఐదేళ్లలో సమర్థవంతమైన పాలన అందించామని చెప్తున్న అచ్చెన్నాయుడు అవినీతి గురించి స్పందించాలని డిమాండ్ చేశారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు పట్టుకోవటానికి కోట్లాది రూపాయలు వెచ్చించారని ఆరోపించారు. ఒక్కో ఎలుకకు రూ 10 లక్షలు ఖర్చుపెట్టిన ఘనత టీడీపీదే అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో గ్రామ సర్పంచ్‌లను కాదని జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించారని విమర్శించారు. గత ఐదేళ్లలో 1.5 లక్షల కోట్ల అప్పు మిగిల్చారని పట్టిసీమలో 400 కోట్ల మేర అవినీతి జరిగిందన్నారు. పట్టిసీమ బదులు పోలవరం పనులు వేగవంతం చేస్తే ఈ వరకే పూర్తయ్యేదన్నారు. టీడీపీ ఉపనేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పోలవరం టెండర్లు తగ్గిస్తామని అధికార పార్టీ చెబుతోందని ఎలా చేస్తారో చూద్దామన్నారు. గవర్నర్ ప్రసంగం చూస్తే బాధ కలుగుతోందన్నారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మించుకున్నామని మన రాష్ట్రం నుంచి పాలన జరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపట్టారన్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో రాజధాని శాశ్వత భవనాలు ఎంతకాలంలో నిర్మిస్తారో ప్రస్తావించక పోవటం దురదృష్టకరమన్నారు. పరిశ్రమలు, పట్టణాల్లో వౌలిక సదుపాయాలు, యువత గురించిన ప్రస్తావనలేదని, తెలంగాణ నుంచి రావాల్సిన 8 వేల కోట్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో ఆస్తుల బదలాయింపు జరక్కుండా హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై ఆర్ధికమంత్రి రాజేంద్రనాధ్‌రెడ్డి వివరణ ఇస్తూ గవర్నర్ ప్రసంగానికి క్లుప్తంగా ఏది అవసరమో దానే్న ప్రస్తావించారని, గతంలో టీడీపీ 58 పేజీలతో గవర్నర్‌ను మంచినీళ్లు తాగించిందని చమత్కరించారు. పసుపు-కుంకుమ, రుణమాఫీ అంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటై 10 రోజులే అయిందని ఎన్డీఏతో నాలుగేళ్ల అనబంధం కలిగిన టీడీపీ షెడ్యూల్ ఆస్తులపై ఎందుకు ఒత్తిడి తేలేదని నిలదీశారు. ఓటుకు నోటు కేసుతో పరారై వచ్చి బస్సులో దాక్కుని తాత్కాలిక భవనాలు నిర్మించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌కు బస్సులలో సందర్శకులను చేరవేసేందుకు 400 కోట్లు ఖర్చుపెట్టారని, విద్యుత్‌ను యూనిట్ ఆరు రూపాయలకు కొనుగోలుచేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం విలువలు, విశ్వసనీయత, సుపరిపాలన అందించే లక్ష్యంతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం రూ 150 కోట్లు ఖర్చుపెట్టి పులిచింతల పూర్తిచేయలేకపోయిందని నామమాత్రపు ప్రయోజనాల కోసం పట్టిసీమ నిర్మించిందని విమర్శించారు. పోలవరంపై చెప్పేవన్నీ సత్యదూరాలే అన్నారు. రాజధాని అమరావతి కాదని అదో భ్రమరావతని అభివర్ణించారు. తాము డోర్లు తెరిస్తే చంద్రబాబుతో సహా వైసీపీ శిబిరంలోకి వస్తారని సెటైర్లు వేశారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తొలిఫైల్‌పై సంతకంచేసిన బెల్ట్‌షాపులను ఐదేళ్ల వరకు నియంత్రించ లేకపోయారని తమ ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామని చెప్పిన చంద్రబాబు కనుమరుగయ్యారని విమర్శించారు. అసమర్థులు అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసమర్థులుగా మిగిలారన్నారు. అవాస్తవాలు మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కేవలం 13, 3 సీట్లకు పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని రాంబాబు గతంలో ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపొంది మూడుసార్లు పరాజయం పొందారని గుర్తుచేశారు. తమ పార్టీ ఓడినంత మాత్రాన వెకిలిగా మాట్లాడటం, ఎగతాళి చేయటం, తిట్టిపోయటం తగదన్నారు. సీఎం జగన్‌ను చూస్తే చంద్రబాబుకు నిద్రపట్టటంలేదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగం ఓ దృఢచిత్తం.. నమ్మకమన్నారు. అన్నివర్గాల శ్రేయస్సే లక్ష్యంగా సాగిందన్నారు. చంద్రబాబు తనకు తాను ఎక్కువగా ఊహించుకునే మెగలోమేనియా అనే వ్యాధితో బాధపడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదున్నర లక్షల మందికి ఉపాధి కల్పనతో పాటు ఆశా వర్కర్ల వేతనాలను పెంచిందని గుర్తుచేశారు. చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీలు చేయటం, సెక్యూరిటీని ఉపసంహరించటం వంటి కక్షసాధింపు చర్యలు పనికిరావని టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్ స్పష్టంచేశారు. దీనిపై మంత్రి బుగ్గన వివరణ ఇస్తూ విమానాశ్రయంలో అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. నిబంధనలు అందరికీ వర్తిస్తాయని బదులిచ్చారు.

చిత్రాలు.. టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు *మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి