క్రైమ్/లీగల్

దోపిడీ దొంగల ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 3: జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్, హౌసింగ్‌బోర్డు ప్రాంతాల్లోని మూడు బంగారు దుకాణాల్లో ఆగంతకులు భారీ చోరీలకు పాల్పడిన సంఘటన జరిగి 48 గంటలు గడవకముందే దుండగులు మరోమారు తెగబడ్డారు. జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్ రోడ్డులో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిని హతమార్చి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లూటీ చేసుకుని పారిపోయారు. ముదిమి వయసులో ఉన్న వృద్ధ మహిళ అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె ముఖం, మెడ, గొంతు భాగాలను పదునైన కత్తులు, బ్లేడ్‌లతో ఎక్కడబడితే అక్కడ తెగ్గొసి మరీ చంపిన వైనాన్ని చూసి స్థానికులంతా భయకంపితులయ్యారు. వివరాలిలా ఉన్నాయి. న్యాల్‌కల్ రోడ్డులోని మున్నూరుకాపు సంఘం వెనుక భాగంలో నివాసం ఉండే సాయమ్మ (70)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలందరి పెళ్లిళ్లు అయిపోవడంతో పెద్ద కుమారుడు, కుమార్తె తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్‌లో కాపురాలు ఉంటుండగా, చిన్న కుమారుడు బతుకుదెరువు నిమిత్తం గల్ఫ్‌లోని ఒమన్ దేశానికి వలస వెళ్లాడు. దీంతో సాయమ్మ నిజామాబాద్‌లోని న్యాల్‌కల్ రోడ్డులో గల తన ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు, కూతురు వద్దకు వెళ్లి మంగళవారం రోజునే ఆమె నిజామాబాద్‌కు వచ్చింది. రాత్రి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి దాటిన అనంతరం గుర్తు తెలియని ఆగంతకులు తలుపులు ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించి, ఒక్కసారిగా సాయమ్మపై పదునైన కత్తులతో దాడికి తెగబడ్డారు. ఆమెను అరవకుండా గొంతు నులిమి ముఖంపై బ్లేడ్‌తో చర్మంపై లోతైన గాయాలు చేశారు. అనంతరం గొంతు కోసి దారుణంగా హతమార్చారు. మెడలో ఉన్న సుమారు నాలుగు తులాల పుస్తెల తాడుతో పాటు బీరువాలో దాచి ఉంచిన కొంతమొత్తం నగదును అపహరించుకుని పారిపోయారు. బుధవారం ఉదయం సాయవ్వ ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఆమె హత్యకు గురైనట్టు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు దారుణంగా ముఖంపై కత్తులతో దాడి చేయడంతో లోతైన గాయాలు యాసిడ్ దాడిని తలపించాయి. ఆగంతకులు యాసిడ్ దాడికి పాల్పడి ఉంటారని ముందుగా భావించినప్పటికీ, కత్తులతో దాడి చేసినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఐదవ టౌన్ ఎస్‌ఐ జాన్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు క్లూస్ టీంను రప్పించి ఆధారాల కోసం అనే్వషించారు. డాగ్ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దించినప్పటికీ దుండగుల ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేకపోయాయి.
అయితే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుండడాన్ని గమనించిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని, ఈ క్రమంలో సాయవ్వ వారిని గుర్తించడంతో ఆమెను దారుణంగా హతమార్చి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సంఘటనలతో నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది.

సాయవ్వ ( ఫైల్‌ఫొటో)