ఆంధ్రప్రదేశ్‌

‘ఆది’కి సీఎం రమేష్ మోకాలడ్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 18: కడప జిల్లాకు చెందిన మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిక వ్యవహారం రోజురోజుకు వాయిదా పడుతూ వస్తోంది. దీనికి కారణం అదే జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు అన్న ప్రచారం జరుగుతోంది. ఆది బీజేపీలో చేరకుండా రమేష్‌నాయుడు మోకాలడ్డుతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం ఓటమి అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దలను కలిసినా ఆయన ప్రయత్నాలు కొంత ఆలస్యమవుతూ వచ్చాయి. అంతకుముందే సీఎం రమేష్ నాయుడును బీజేపీ అక్కున చేర్చుకుంది. రాజ్యసభలో బలం పెంచుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ చేర్చుకుంది. సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో కీలకమయ్యారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీలో ఏ నాయకుడైనా చేరాలని భావిస్తే, ఈ నలుగురు తమ ప్రభావాన్ని చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌నాయుడు మధ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఆధిపత్యపోరు నడిచేది. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరకముందు సీఎం రమేష్‌నాయుడు ఒక్కడే జిల్లాలో చక్రం తిప్పేవాడు. నాయకులందరినీ తన చుట్టూ తిప్పుకునేవాడు. తనను వ్యతిరేకించే వరదరాజులురెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలకు టిక్కెట్ దక్కకుండా చేయడంలో తన పలుకుబడిని ఉపయోగించాడు. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మంత్రి పదవి దక్కించుకుని కీలకంగా మారారు. జిల్లాలో రమేష్‌నాయుడుపై ఏ ఒక్కనాయకునికి సదభిప్రాయం లేదు. ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరిన తర్వాత నాయకులందరికీ కేంద్రబిందువయ్యాడు. అప్పటినుంచే వీరిద్దరి నడుమ ఆధిపత్యపోరు నడిచేది. 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో కూడా సీఎం రమేష్‌నాయుడు, ఆదినారాయణరెడ్డికి మధ్య ప్రచ్ఛన్నపోరు నడిచింది.
తాజాగా ఇప్పుడు బీజేపీలోనూ అదే పోరు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరేందుకు తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధినాయకులను కలిసి వచ్చారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నడ్డాను కలిశారు. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆదినారాయణరెడ్డి చేరిక ఖాయమని ప్రచారం జరిగింది. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కడపకు వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. చివరిక్షణంలో ఆయన చేరిక జరగలేదు. దీని వెనుక సీఎం రమేష్‌నాయుడు హస్తం ఉందన్న బలమైన ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిణామాలతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది.