ఆంధ్రప్రదేశ్‌

ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 31: ప్రతి గ్రామంలో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుల నుంచి ఏపీ సీడ్స్ నేరుగా విత్తనాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అన్ని పంటలకూ ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ చేయాలని, మరో 2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు భూసార పరీక్షా పరికరాలను ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి, ప్రతి గ్రామంలోనూ రైతులకు అందుబాటులో ఈ కేంద్రాలు ఉండేలా చూడాలన్నారు. గ్రామ సచివాలయాల పక్కనే రైతుల కోసం పెడుతున్న వర్కుషాపులను మరింత బలోపేతం చేయాలన్నారు. వర్కుషాపు దగ్గర ఏర్పాటు చేసే ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో నాణ్యమైన ఉత్పత్తులనే అమ్మాలన్నారు. పంటలకు సంబంధించిన వివిధ సమస్యలను చెప్పుకునేందుకు గ్రామ పరిధిలోనే ఒక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్‌తో పాటు గ్రామ సచివాలయంలో ఈ సమస్యలకు పరిష్కారం లభించాలన్నారు. నాణ్యతను పరీక్షించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అక్కడ లభించాలని, వర్కుషాపులో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు ఉంచుతున్నామంటే, తమపై బాధ్యత ఉందన్నారు. విత్తనాల కంపెనీలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం, గోదాముల్లో నిల్వ, అక్కడ నుంచి గ్రామాలకు తరలింపు, చివరకు రైతులకు అందించడం వంటి ప్రతి అంశంలోనూ పారదర్శకత ఉండాలన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వంటి వారు అదే పనిగా వేలెత్తి చూపించేందుకు ప్రయత్నిస్తారని గుర్తు చేశారు. ఏదైనా మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేరన్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా, అంతా అవినీతి, అన్యాయం
జరిగిపోయిందంటూ విషప్రచారం చేస్తారని అధికారులను హెచ్చరించారు. అందువల్ల నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. నాణ్యతకు ప్రభుత్వం తరపున గ్యారంటీ ఇస్తున్నామని గుర్తుంచుకోవాలన్నారు. నాణ్యత విషయంలో చెడ్డ పేరు రాకూడదన్నారు. గ్రామ సచివాలయాల్లో బోర్డులు పెట్టి రైతులకు సూచనలు అందచేస్తామని అధికారులు తెలిపారు. గ్రామాల్లోని వర్కుషాపులకు రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెడతామని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, వ్యవసాయంలో ఉత్తమ విధానాలను రైతులకు చెప్పాలన్నారు. రైతులకు సాగుకు సంబంధించి ఏ సమస్య వచ్చినా పరిష్కారం, సలహా ఇచ్చే వ్యక్తి భరోసా కేంద్రంలో ఉండాలన్నారు. వర్కుషాపులోనే వ్యవసాయ అసిస్టెంట్ ఉండాలన్నారు. రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలను ధరల స్థిరీకరణ నిధికి, ప్రకృతి వైపరీత్యాల నిధికి అనుసంధానం చేయాలన్నారు. అరటి చెట్టు పడిపోతే రైతుకు బీమా రావడం లేదని, ప్రకృతి వైపరీత్యాల నిధితో ఇటువంటి సమయంలో అండగా ఉండాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు మంచి ధర లభించేలా చూడాలన్నారు. వాల్‌మార్టు, ఐటీసీ వంటి సంస్థలతో కలిసి ముందుకు సాగేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు, తదితర విక్రయాల్లో ఈ-కామర్స్ తీసుకురావాలన్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి అగ్రి ల్యాబ్స్ నిర్మాణంలో తుపాన్లు, గాలులను తట్టుకునేలా భవనాల డిజైన్లు రూపొందించాలన్నారు. చిరుధాన్యాలు సాగు చేస్తున్న వారికి ప్రోత్సహకాలను ఇవ్వాలన్నారు. చిరుధాన్యాల సాగుకు కూడా రుణం ఇవ్వాలని నిర్ణంచామన్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధర వచ్చేలా చూడాలన్నారు. రైతులకు అవగాహన, సాగులో మెళకువల కోసం వైఎస్సార్ పొలంబడి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇకపై వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు కచ్చితంగా రైతులకు బీమా అందాలన్నారు. ఇందుకు ఇస్రో నుంచి సాంకేతిక సలహాలను తీసుకోవాలన్నారు. వ్యవసాయం, రెవెన్యూ శాఖలు కలిపి పని చేయాలన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. పంటల బీమా కోసం గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. 2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో సాధారణం కన్నా 1.4 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రబీలో 25.84 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని అంచనా వేస్తున్నామని, 5.5 లక్షల హెక్టార్లలో శనగలు సాగు చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు నిండుగా ఉన్నందున వరి విస్తీర్ణం రబీలో పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకూ 1.12లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి