Others

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: పింగళి నాగేంద్రరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
కళ: తోట
కెమెరా: రాజ్‌గోపాల్
ఎడిటింగ్: ఎంఎస్ మణి
నృత్యం: ఎకె చోప్రా
స్క్రీన్‌ప్లే: డి చౌదరి
నిర్మాత:
దగ్గుబాటి లక్ష్మీనారాయణచౌదరి
ప్రొడక్షన్ డిజైన్, దర్శకత్వం:
ఎకె శేఖర్

శాతవాహన చక్రవర్తుల తొలి ముఖ్య పట్టణం, కృష్ణా జిల్లా మచిలీపట్టణం దగ్గరలోని శ్రీకాకుళం. అక్కడ వెలసిన దైవం శ్రీ ఆంధ్ర మహావిష్ణువు. 18వ శతాబ్దానికి చెందిన కాసుల పురుషోత్తమ కవి ఆ మహావిష్ణువును కీర్తిస్తూ ‘చిత్ర చిత్ర, ప్రభావ దాక్షిణ్యభావ, హతవిమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా’ అన్న మకుటంతో నిందాస్తుతి శతకాన్ని రచించారు. ఆంధ్ర నాయకుడు, వల్లభదేవుడన్న పేర్లతో ప్రసిద్ధి చెందిన ఆ స్వామి చారిత్రక గాథను చలనచిత్రంగా శ్రీ శంభూ ఫిలిమ్స్ 1966లో రూపొందించింది. మే 6, 1966న ఈ చిత్రం విడుదలైంది.

ఈ చిత్రానికి దర్శకులు ఎకె శేఖర్. 1935లో పివి దాసు నిర్మించిన సీతాకల్యాణం ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. సౌండ్ అండ్ ఆర్ట్‌లో ప్రతిభగల ఎకె శేఖర్, వాహిని పిక్చర్స్‌లో ప్రముఖ పాత్ర వహించి సౌండ్ ఇంజనీర్‌గా, కళాదర్శకునిగా పనిచేశారు. వీరి ప్రతిభకు దర్పణం ‘మల్లీశ్వరి’. ఆపైన కొన్ని తమిళ చిత్రాలకు కళా దర్శకత్వం, ఒక తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. కళాదర్శకునిగా తెలుగులో పలు చిత్రాలలో తమ ప్రజ్ఞాపాటవం చూపారు. వీరి దర్శకత్వంలో తెలుగులో రూపొందిన చిత్రం ‘శ్రీ ఆంధ్ర మహావిష్ణుకథ’

శ్రీకాకుళ ప్రభువు సుచీంద్రుడు (దగ్గుబాటి రాఘవయ్యచౌదరి). తెలుగు ప్రభువులంతా ఒక్కటి కావాలన్న ఆకాంక్షతో తన రాజ్యాన్ని ఆంధ్ర మహావిష్ణువుకు సమర్పించుకుంటాడు. నిశుంభుడు (ఎస్‌వి రంగారావు) ఏకవీరుడనని అహంకారంతో తన మంత్రి మహేంద్రజిత్ (లింగమూర్తి) సలహాతో ఆటవికుల సాయంతో కొల్లలు చేయిస్తుంటాడు. సుచీంద్రుని కుమారుడు వల్లభదేవుడు (ఎన్టీ రామారావు), తండ్రి నిర్ణయాన్ని అభినందించి తెలుగు గ్రామాలన్నింటా స్వయం రక్షక దళాలు తయారు చేయిస్తాడు. మంత్రి అర్జునదేవుడు (మిక్కిలినేని) కుమారుడు బలదేవుడు (బాలయ్య), బలదేవుని మరదలు అరుణ (యల్ విజయలక్ష్మి)లు వల్లభదేవుడికి సహాయ సహకారాలు అందిస్తారు. బుద్ధిబలంతో నిశుంభుని దారికి తేవాలని అనుకుంటాడు వల్లభదేవుడు. అనుకోకుండా నిశుంభుని కుమార్తె సుజాత (జమున)ను మొసలి బారినుంచి కాపాడి ఆమె వలపు పొందుతాడు. నిశుంభుని వద్దకు వెళ్ళటానికి వారి అనుచరులను బాధించి పట్టుపడతాడు. తన ముందే సంకెళ్లను తెంపుకొన్న వల్లభదేవుని పరాక్రమం మెచ్చి అతన్ని తన అల్లుడిగా స్వీకరించాలని నిశుంభుడు అనుకుంటాడు. కానీ అతడు తమ శత్రువు కుమారుడని మహేంద్రజిత్ వల్ల తెలిసికొని బంధించబోగా, వల్లభదేవుడు తప్పించుకుంటాడు. మహేంద్రజిత్ తన సోదరుడు సర్వజిత్తు (రేలంగి)తో యువరాణికి వివాహం నిశ్చయింపచేస్తాడు. కానీ రాజ్యకాంక్షతో తానే ఆమెను వివాహం చేసుకోవాలని మాయోపాయంతో నిశుంభుని, మహారాణి (్ఛయాదేవి)ని, యువరాణిని బంధిస్తాడు. వల్లభదేవుడు జరిగిన విషయం తెలుసుకుని, కోటలో ప్రవేశించి మహేంద్రజిత్‌ను, అతని అనుచరులను సంహరించి నిశుంభుని విడిపిస్తాడు. నిశుంభుడు ఆనందంతో తన కుమార్తెను వల్లభదేవునికిచ్చి వివాహం జరిపి తన రాజ్యాన్ని శ్రీకాకుళ దేవుని సన్నిధిలో వారికి అప్పగించటంతో చిత్రం ముగుస్తుంది.
మహేంద్రజిత్ అనుచరులుగా జగ్గారావు, చదలవాడ, అరుణ తమ్ముడు కిరీటిగా పొట్టి ప్రసాద్, మకరికగా సూర్యకళ నటించారు. వల్లభదేవునిగా ఎన్టీఆర్ నిండుతనం, నిగ్రహంతో కూడిన నటనతో మెప్పించారు. ప్రియురాలికై విరహవేదన, ఆమెను కలిసిన క్షణాల్లో శృంగారం, వలపు చూపించటం, సందర్భానుసారంగా పరాక్రమం, సాహసం ప్రదర్శించటం, చక్కటి చిరునవ్వుతో, మురిపించే అభినయంతో అలరించారు.
నిశుంభునిగా ఎస్వీ రంగారావు పాత్రోచితంగా ధైర్యాన్ని, బలపరాక్రమాన్ని, నిశితబుద్ధిని, కూతురిపై మమకారం, సాటివీరుని ప్రతాపానికి ఆనందం, అతని ఆలోచనలు మెచ్చి శత్రువునైనా అల్లునిగా స్వీకరించే సంస్కారం, తన అల్లుడే అవతార పురుషుడని మెచ్చుకోవటం, సన్నివేశానికి తగ్గ ఔచిత్యాన్ని నటనలో ప్రదర్శించారు. కుటిల రాజనీతిజ్ఞుడిగా లింగమూర్తి రాణించే నటన ప్రదర్శించినా, పోరాట పటిమ చూపకపోవటం చిత్రంలో ఒక లోపంగా కన్పిస్తుంది.
యువరాణి సుజాతగా జమున చక్కని నటన, అభినయం, వల్లభదేవునిపై అనురాగాన్ని, తండ్రిపట్ల గౌరవాన్ని ఎంతో అలరించేలా రక్తికట్టించారు. బాలయ్య శౌర్యాన్ని, దుడుకుతనాన్ని, తెలివిని పాత్రోచితంగా మెరుపులా ప్రదర్శించగా, వానికి సరిజోడిగా అరుణగా యల్ విజయలక్ష్మి నృత్యాలతో, సన్నివేశాలతో, నటనతో ఆకట్టుకుంది.
దర్శకులు ఎకె శేఖర్ సన్నివేశాలను సరళంగా, అతి సున్నితంగా, ఆహ్లాద భరితంగా రూపొందించారు. సంకెళ్ళు తెంచుకున్నాకే పెళ్ళి మాటలు అని సర్వజిత్ (రేలంగి)తో నిశుంభుడు (ఎస్వీ రంగారావు) చెప్పడం, తరువాత అతడు తనను కలిశాక ‘ఇంకా మీరక్కడే వున్నారా?’ అని ఒకసారి, అతడిచ్చిన బంగారు నాణాలు ‘తమవేకదా’ అని ప్రశ్నించటంలాంటి సన్నివేశాలు దర్శకుడి చమత్కారానికి నిదర్శనం. తను విసిరిన గద అందుకుని సంకెళ్ళు త్రెంచుకున్న వల్లభదేవుడు.. అతనిముందున్న ఇనప గేట్లను బ్రద్దలుచేసిన సన్నివేశంలో, రాజ్యం వదిలి తనకై వచ్చిన యువరాణిని వెంటపెట్టుకు వచ్చి వల్లభదేవుని మెచ్చుకుని వదిలివేయటం, కోటలో మారువేషాల్లో నిశంభుడు, వల్లభదేవునికి పోరాటాలు, సింహంవంటి నిశుంభుడు మత్తుకి బందీగా మారటంలాంటి సన్నివేశాలు చిత్రానికి ఆయువుపట్టుగా తోస్తాయి. ఈ చిత్రంలో హీరో జగ్గారావుతోనే రెండు మూడుసార్లు జరిపిన ప్రధాన పోరాటాలు, ఎన్టీఆర్ పలుమార్లు కత్తితో, కర్రతో యుద్ధం చేయడం విపులంగా చిత్రీకరించారు.
కళాదర్శకులు కూడా అయిన ఎకె శేఖర్ ఈ చిత్ర గీతాలను చక్కని సెట్టింగ్స్‌తో ఆకట్టుకునేలా చిత్రీకరించారు. ‘ఓ సుమ బాలా/ ఓ పంచబాణా ఒక బాణమైన వేయాలోయ్’ పాటలో తోటలో చెలులు యువరాణిని ఉడికిస్తూ సాగే నృత్యగీతం ఆహ్లాదకరంగా సాగుతుంది. మన్మధుని చక్కని విగ్రహం, చేతిలో బాణం, చిలుకను చూపుతూ గిరిజ, జమున మిగిలిన వారిపై పాటను (గానం- సుశీల, వసంత, బృందం) చిత్రీకరించారు. మరో నృత్యనాటిక గీతంలో యల్ విజయలక్ష్మి ప్రవరునిగా, వరూధినిగాను మెప్పించింది. సభికుల్లో యువరాణి జమున, నిశుంభుడు మహేంద్రజిత్ కనిపిస్తారు. సుజాత పట్ట్భాషేకం రోజున యల్ విజయలక్ష్మి నృత్యం, అభినయంతో అలరించేలా సాగే గీతం -హా దైవమా పాదలేపం కరిగిపోయే (ఎస్ జానకి, బాలమురళీకృష్ణ). రేలంగిపై చిత్రీకరించిన పద్యం -కలువలు నీ కళ్ళు/ కమలమ్ము నీ మోము (మాధవపెద్ది). రేలంగి, గిరిజలపై చిత్రీకరించిన గీతం -మోహన రమణుడు ముద్దుగ వస్తిని తలుపుతీయవే భామ (వసంత, మాధవపెద్ది). యువరాణిని చెలులు ఆటపట్టిస్తూ వనవిహారంలో (గిరిజ, జమున చెలులపై చిత్రీకరణ) సాగే గీతం -ఓ హిరి/ సాహిరి/ పెళ్ళిచూపులకు చకచకరారే (ఎస్ జానకి, వసంత, స్వర్ణలత కోరస్). యల్ విజయలక్ష్మి చెంచు వేషంలో నిశుంభుని రాజ్యంలో వీధిలో చేసే నృత్య గీతం -ఓ నేరానంటినా మామయ్య ఒల్లినంత ఓలినిచ్చి (ఎస్ జానకి). నిశుంభుని ముందు రేలంగి పాడే పద్యం -నిన్నున్ మెచ్చగనే నె చాలుదును (మాధవపెద్ది). జమునపై చిత్రీకరించిన ప్రార్థన పద్యం -జన నాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (ఎస్ జానకి). చిత్ర ప్రారంభంలో శ్రీకాకుళేశ్వరుని ఆలయాన్ని చూపుతూ శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ ఎల్ విజయలక్ష్మి పాడే గీతం (బాలయ్య, మిక్కిలినేని, పొట్టిప్రసాద్, రాఘవయ్యచౌదరిలపై చిత్రీకరణ, గానం -పి లీల) చిత్రం చివర కూడా రిపీట్ అవుతుంది.
ఈ చిత్రంలో జమున, ఎన్టీఆర్‌లపై చిత్రీకరించిన గీతాలు ఎంతో ఆహ్లాదకరంగా తోస్తాయి. సుజాతను విజయేశ్వరిగా వల్లభదేవుడు పిలిచి, ఆమెను కొలనునుండి రక్షించి వెళ్ళిన తరువాత వారిరువురూ విడివిడిగా, ఒకరినొకరు తలచుకుంటూ (అతని చిత్రం ముందు సుజాత, వల్లభదేవుడు వనంలో ఏకాంతంలో) పాడే గీతాన్ని ఇరువురూ ప్రక్కప్రక్కనే ఉన్నట్టు చిత్రీకరించారు. కొలను చూపినపుడు ‘విజయేశ్వరిని తలతురా’ అన్న పదానికి జమున అభినయం వెరైటీగా చిత్రీకరించారు. ‘కుశలమా, కుశలమా, ఎటనుంటివో ప్రియతమా’ పాటలో కొద్ది భాగం ‘కొలనెటనైనా’ తిరిగి సుజాతను అంతఃపురంలో నిశుంభుడు బంధించగా రిపీట్ అవటం విశేషం (ఒకరినొకరు కుశలం చెప్పుకోవటం.. మనం మనం ఒకటి మళ్ళీ కలిసేవరకు ఉభయకుశలోపరి సిరి, సిరి అన్నది దర్శకుని ప్రతిభకు తార్కాణం. (గానం- ఎస్ జానకి, ఘంటసాల). ప్రియుని చిత్రం చూసి పరవశంలో అంతఃపురంలో సుజాత పాడే గీతం (వల్లభుడు అనగా భర్తఅని, హీరో పేరును తలచుకుంటూ ఆనందంతో ఆకసంలో చంద్రుని చూపుతూ సాగుతుంది) -వల్లభా! ప్రియవల్లభా! నాలోవలెనే నీలోను జిలిబిలి (జానకి). యువరాణి సుజాతను కలుసుకోవాలని వల్లభుడు, ప్రియుని చూడాలని యువరాణి వచ్చి ఉద్యానవనంలో చక్కని ప్రకృతిలో (జమున, ఎన్టీఆర్) పరవశించి పాడుకునే యుగళ గీతం -వసంతగాలికి వలపులు రేగ/ వరించుబాలిక మయూరి కాగా (జానకి, బాలమురళీకృష్ణ). మహేంద్ర దత్తు మరణించాక వల్లభదేవుడు నిశంభునితో చెప్పే పద్యం -స్వార్థకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసుల (ఘంటసాల). చివరి పద్యాలు -జనవాక్యము జయప్రదముగా (ఘంటసాల), నిశుంభునిపైన పద్యం -సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహసోదరలక్షణం (మాధవపెద్ది).
‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ’ చిత్రం మ్యూజికల్ హిట్‌గా చెప్పుకోవాలి. ఈ చిత్రం గుర్తుకురాగానే దీనిలోని ‘‘కుశలమా’’ గీతం పలకరింపు పరవశగీతంగా, బాలమురళీకృష్ణ గానంచేసిన వసంత గాలికి మరింత రంజింపచేసే అలరింపు గీతంగా నేటికి నిలవటం గమనార్హం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి