సబ్ ఫీచర్

ఆర్థిక సమానత్వం అసాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్కోడాగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న నాటినుంచీ ఆఫ్రికా ఖండంలోని నల్లజాతి వారిని భయపెట్టి కానీ, ప్రలోభపెట్టికానీ బానిసలుగా బంధించి పట్టుకునిపోవడం సామాన్యమైంది. మానవత్వమున్న వారెందరో ఈ విధానాన్ని వ్యతిరేకించి పోరాటం సాగించాక ఇంగ్లండు, అమెరికా వంటి దేశాలలో బానిస వ్యవస్థ రద్దు అయింది. అంతర్జాతీయ ఒప్పందాలవల్ల బానిసల ఎగుమతి, దిగుమతి వ్యాపారం నిషిద్ధమైంది. అయినప్పటికీ స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాలలోని వ్యాపారులు చట్టాలలోని లొసుగులను వాడుకుని బానిసల క్రయ విక్రయాలు చేస్తూనే వచ్చారు. అటువంటి వ్యాపారానికి వినియోగించిన నౌకలలో ముఖ్యమైనది అమిస్తాద్. ఆఫ్రికాలోని నల్లజాతివారిని బందీలుగా తీసుకెళ్లి క్యూబా వంటి దేశాలలో పంచదారకు మారకంగా అమ్మడం, పంచదారను ఐరోపాలో అమ్మి ధనమార్జించడం నౌక యజమానుల పద్ధతి. ఒకసారి నౌకలో తీసికెడుతున్న బానిసలలో జోసెఫ్ సింక్వే అనే అతడు సంకెలలను ఛేదించుకుని, ఇతర బానిసలను విడిపించి తిరుగుబాటుచేశాడు. నౌకను తమ దేశానికి తీసుకువెళ్ళమన్నాడు. వ్యాపారులు ప్రతిఘటించారు. చివరకు నౌక అమెరికా తీరాన్ని తాకింది. ఓడ కెప్టెనుని చంపిన బానిసలను శిక్షించాలా, నిషిద్ధ బానిస వ్యాపారం చేస్తున్న యజమానులను శిక్షించాలా అని కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. బానిసల తరఫున అమెరికా మాజీ అధ్యక్షులయిన జాన్ ఆడమ్స్ వాదించి వారిని విడిపించాడు. అమెరికా పౌరులు చందాలు వేసుకుని వారిని స్వదేశానికి పంపించారు.
ఇంతవరకూ బాగానే గడిచింది. వెనక్కి వెళ్లిన బానిసలలో కొందరు తామే వ్యాపారులకు బానిసలను సప్లై చేసేవారిగా మారారు (వారిలో సింక్వే కూడా ఉన్నాడని జనశ్రుతి). ప్రభుత్వాలూ, మానవత్వాన్ని మరిచిపోకూడదనేవారూ ఎంత ప్రయత్నించినా పంతొమ్మిదవ శతాబ్దం చివరవరకూ బానిస వ్యాపారం సాగడానికి ఇది ఒక కారణం కావచ్చును.
భారతదేశంలో బానిసత్వ విధానం లేదు కానీ తత్తుల్యమైన ‘అవర్ణ’ వ్యవస్థ ఉంది. నాలుగు వర్ణాలవారూ కాకుండా సమాజానికి దూరంగా ఉంటూ పనికి మాత్రమే వినియోగింపబడే వారిని అనేక పేర్లతో పిలిచేవారు. గాంధీజీ హరిజనులు అన్నవారినే ప్రస్తుతం దళితులు అని వ్యవహరిస్తున్నారు. అటువంటి వారిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యవస్థపై తిరుగుబాటు చేశారు. తాను ఉన్నత విద్యను అభ్యసించి, భారత రాజ్యాంగ నిర్మాత కాగలిగారు. తన తోటివారికై పోరాటం చేశారు. వారికి ఉద్యోగాలలో, చట్టసభలలో రిజర్వేషన్ కల్పించారు. ఆయన ఎంత ప్రయత్నించినా నేటికీ దళితులలో వెనుకబాటుతనం పోలేదెందుకు?
ఇదే ప్రశ్న స్ర్తిల విషయంలోనూ వెయ్యవచ్చు. కారణాలేమైనా మధ్య యుగం నాటి నుంచీ స్ర్తికి చదువుకునే అవకాశం లేదు. ఆహార, ఆరోగ్య విషయాలలో ఆమె వివక్షకు గురైంది. భర్త మరణించిన తరువాత స్ర్తి సహగమనం చెయ్యలి లేదా జీవచ్ఛవంలా బతకాలి. ఈ పరిస్థితులపై సావిత్రీబాయి ఫూలే వంటివారు ప్రాణాలకు ఒడ్డి పోరాటం చేశారు. రాజా రామ్మోహన్‌రాయ్, వీరేశలింగం పంతులు వంటివారెందరో స్ర్తి జాతి ఉద్ధరణకై కృషి చేశారు. నేడు కొందరు స్ర్తిలు విద్యా ఉద్యోగ రంగాలలో రాణిస్తున్న మాట వాస్తవమే కానీ స్ర్తి భ్రూణ హత్య, వరకట్నపు మరణాలు, అత్యాచారాలు నిర్విరామంగా సాగిపోతున్నాయి. స్ర్తిల ఆయుః ప్రమాణం తక్కువ, ఆరోగ్య, విద్యా సదుపాయాలూ తక్కువే. స్ర్తి జాతి మొత్తాన్ని గమనిస్తే స్ర్తిలు వెనుకబడి ఉన్నారని చెప్పక తప్పదు.
ఈ పరిస్థితిని వెనుకబడిన కులాలు, ప్రాంతాలు, మతాలు మొదలైన వాటి అన్నిటిలోనూ గమనించవచ్చు. ప్రభుత్వం రిజర్వేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ వంటి సదుపాయాలు ఎన్ని కల్పించినా వెనుకబడిన వర్గాలు ముందుకు రాలేకపోతున్నాయి. కారణం విముక్తులైన బానిసలే బానిసలను సప్లై చేసేవారిగా మారిన ఉదంతంలో ఉందా అన్న అనుమానం కలుగుతుంది. ఉదాహరణకు స్ర్తిల విషయమే తీసుకుంటే చదువుకున్న ప్రతి మహిళా ఒక్క నిరక్షరాస్య మహిళకు చదువు చెప్పడమో, లేక చెప్పించడమో చేస్తే మగువలు నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధించి ఉండేవారు కదా. విద్యా, ఉద్యోగ అవకాశాలున్న స్ర్తిలు తమ హక్కులకై పోరా టం సాగిస్తున్నారు తప్ప వెనుకబడి ఉన్న స్ర్తిల గురించి పట్టించుకోవడంలేదన్నది అక్షరసత్యం. ఇదే సూత్రం ప్రతి వెన
కుబడిన వర్గానికీ వర్తిస్తున్నది.
అసలు కులాల మధ్య ఇంతగా అంతరాలు ఏర్పడడానికి కారణమేమిటి? దైవికమైన కార్యాలలో, సామాజిక కట్టుబాట్లలో తేడాలుండవచ్చునేమో కానీ బ్రిటిషువారి రాకకు ముందు ఆర్థికమైన వెనుకబాటు ఏ వర్గంలోనూ లేదు. తను కులగోత్రాలను అందరూ సగర్వంగానే చెప్పుకునేవారు. నేటికీ అఖండ భారతంలో భాగమైన ఇండోనీషియా వంటి దేశాలలో తాము శూద్రులమనీ, బ్రాహ్మణులమనీ క్షత్రియులమనీ, వైశ్యులమనీ చెప్పుకుంటారు. అష్టాదశ వర్ణాలవారూ సుఖ సంతోషాలతో ఉన్నారో లేదో అన్నది రాజులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు (రాయవాచకం). బ్రిటిషువారి రాకతో పరిస్థితులు మారిపోయాయి. యంత్రాలతో నిర్మించిన వస్తువుల తయారీతోపాటు స్వదేశీ వృత్తులను సర్వనాశనం చెయ్యడమే వారి ప్రధాన లక్ష్యం. ఢక్కా మస్లిన్ చీరను నేసి చిన్నిపెట్టెలో బహూకరించిన చేనేత కార్మికుడి వేళ్ళను విక్టోరియా రాణి తెగగొట్టించిన వృత్తాంతం అందరికీ తెలిసిందే. స్వదేశీ వృత్తులు నశించడంతో అనేక వర్గాలవారు పేదవారయ్యారు. ఇంగ్లీషు నేర్చుకుని గుమాస్తాలుగా మారినవారూ, ఆనకట్టల నిర్మాణంవల్ల భూమి పట్టాదారులూ ఆర్థికంగా మరీ వెనుకబడిపోలేదు. ఆర్థికంగా ఏర్పడిన అసమానతలకు వర్ణవ్యవస్థ కారణమని బ్రిటీషువారు మన మనస్సులలోకి ఎక్కించారు. వారి రాజనీతి అంతా ‘విభజించి పాలించు’ సూత్రంమీద ఏర్పడినదే కదా. అంతరాలకి అసలు కారణం బ్రిటీషువారే అన్నది ఇంతవరకూ గ్రహించలేకపోడం విచారకరం.
బ్రిటీషు నుంచి రాజకీయ స్వాతంత్య్రం లభించినా భావ స్వాతంత్య్రం లభించకపోడమే అంతరాలు అంతరించిపోవడానికి కారణమా? అసలు అంతరాలే లేని ఆర్థిక సమానత్వం అసాధ్యం. ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా అంబానీలూ ఉంటారు, అడుక్కుతినేవారూ ఉంటారు. అందరికీ ఆహారం, వస్త్రం, వసతి, విద్య, ఆరోగ్యం వంటి కనీస వౌలిక అవసరాలకు లోటు లేకుండా చూడాలి. తమ వర్గం కోసం పోరాడుతున్న ఏ నాయకులైనా ఈ విషయం పట్టించుకున్నట్లు కనబడదు. రిజర్వేషన్ల విషయంలోనే పోరాటాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలలో, ఉన్నత విద్యలో, చట్టసభలలో సీట్లతో రిజర్వేషన్లు కావాలన్న ఉద్యమాలు జరుగుతున్నాయి. రిజర్వేషన్‌ని రైళ్ళలో రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లోని సీటుతో పోలిస్తే, ప్రతి నాయకుడూ రిజర్వేషన్ పెట్టెలోని సీట్లు తమకు కావాలంటున్నారే కానీ రైళ్ళ సంఖ్యనూ, రైళ్ళలోని భోగీల సంఖ్యనూ పెంచమని కానీ, కొత్త రైలు మార్గాలు వెయ్యమని కానీ అడగటంలేదు. జనరల్ అన్ రిజర్వ్‌డ్ బోగీలోని ప్రయాణీకుల కష్టాలు ఎవరికీ పట్టడంలేదు. యూనివర్సిటీలోని దళిత విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమించినట్లుగా ముక్కుకు మాస్క్ కూడా లేకుండా డ్రెయినేజి గొట్టాలను శుభ్రం చేసే వారి రక్షణకై పోరాటం లేదు. రిజర్వేషన్ అన్నది సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి కాదు. ఆ విషయం రాజకీయ నేతలకూ, వివిధ వర్గ నాయకులకూ తెలియనిది కాదు. బ్రిటీషువారి ‘విభజించు పాలించు’ రాజనీతిని వారు వదిలిపెట్టరు. ఈ విషయం సామాన్య ప్రజలకు తెలిసిననాడే అంతరాలు అంతరించిపోగలవు. 439 ఉద్యోగాలకు 5.64 లక్షల అభ్యర్థులుంటే ఏ వర్గానికైనా రిజర్వేషను ఎంత ప్రయోజనకారి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుంటే ప్రయోజనముంటుంది.

- పాలంకి సత్య