డైలీ సీరియల్

యమహాపురి 57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒకప్పుడు టామీ కూడా ఊళ్ళో మనిషే. పాపం చేసింది. జంతువై శిక్ష అనుభవిస్తోంది. శిక్ష అయిపోగానే మళ్లీ మనిషౌతుంది’’.
‘‘అక్కడికి- ఈ ఊళ్ళో మనుషులకీ, జంతువులకీ పెద్ద తేడా ఉన్నట్లు’’ అనుకున్నాడు రాజా.
మళ్లీ మాత తనే, ‘‘రాజా! నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మావారు ఈ ఊరికి రానున్న అరిష్టం తప్పించడానికి నిన్నిక్కడికి పంపారు. తను లేకున్నా ఈ పని నీవల్ల ఔతుందని ఆయన పూర్తిగా నమ్మారు. ఆయన మా అందరికీ దేవుడు. ఆయన నమ్మకం మాకు శిలాశాసనం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకు ముందుగా ఆయన పద్ధతి గురించి వివరంగా చెప్పాను. ఆచరణలో అదెలా ఉంటుందో కొంత ఇక్కడ నువ్వు చూశావు. ఈ రోజుకి విశ్రాంతి తీసుకో. రేపట్నించి ఊరంతా తిరిగి ఆచరణలో ఆయన వ్యవస్థ ఎలా వున్నదీ గమనించు. మా గ్రామ పౌరుల మనోభావాల్ని అర్థం చేసుకో. వాళ్లలో అసంతృప్తి కనుక ఉంటే- అది తొలగించడానికి ఏం చెయ్యాలో నిర్ణయించుకో. నువ్వేం చేసినా దానికి ఈ మాత మద్దతు ఉంటుంది’’ అంది.
రాజా ఇది ఊహించలేదు. ‘‘మాతా!’’ అన్నాడు నమ్మలేనట్లు.
‘‘ఔను. మావారు కావాలనే నిన్నిక్కడికి పంపేరని నా అనుమానం. ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో- ఓ స్వామి దీవెన పొందిన మరో వ్యక్తి- తన స్థానం స్వీకరిస్తే ఏం జరుగుతుందో చూడాలని ఆయన ఆకాంక్ష కావచ్చు. ఆయన ఆలోచనలు లోతైనవి. ఏం చెబుతారో ఎందుకు చెబుతారో- అర్థాంగినైన నాకే చాలాసార్లు ఊహకందదు’’.
రాజాకి మనసులో కొంత ఉత్సాహం పుట్టింది. తనీ ఊళ్ళో అడుగుపెట్టి ఇంకా కొన్ని గంటలు కాలేదు. అప్పుడే ఇంతటి అమానుష ప్రతికూల వాతావరణంలో సానుకూల సూచనలు కానవస్తున్నాయి.
‘‘రేపటిదాకా ఎందుకు? ఈరోజే ఊళ్ళోకి వెడతాను’’ అన్నాడు.
‘‘అలా తొందరపడకు. ఈ రోజంతా అన్ని వైపుల్నించీ బాగా ఆలోచించుకో. ఏ విషయంలోనూ ఈ వ్యవస్థ గురించి ముందే ఒక నిర్ణయానికి రాకు. ఎందుకంటే- ఒక్క మనిషి ఆయన. మొత్తం ఊరందర్నీ శాసిస్తున్నారు. తన శాసనం ఈ దేశపు న్యాయవ్యవస్థకి భిన్నంగా ఉన్నా- తనవైపు ఎవరూ కనె్నత్తకుండా చేసుకున్నారు. ఆయన్ని ఎదిరించేవారు కానీ, ఏవగించుకునేవారు కానీ లేరు. ఆ వ్యవస్థకి ఎదురు తిరిగి ఏదో చెయ్యబోయి పప్పులో కాలేశావనుకో. ఆయన తిరిగొచ్చేక నిన్నాయన పప్పులో వేసి వండుకు తింటారు. అందుకే బాగా ఆలోచించుకోమన్నాను’’ అని లేచి నిలబడింది మాత.
తన సమావేశం ముగిసిందని రాజాకి అర్థమైంది. ‘‘నేనిక్కడ ఏం చేసినా- యమ తిరిగొచ్చేక ఆయన్ని ఫేస్ చెయ్యాలి. మాత బాగానే గుర్తుచేసింది’’ అనుకున్నాడు.

11
కానిస్టేబుల్ సుందరం ఓ యువకుడితో కలిసి ఇన్స్‌పెక్టర్ శ్రీకర్ రూంలో అడుగెట్టాడు.
శ్రీకర్ ఆ యువకుణ్ణి పరిశీలనగా చూశాడు.
జీన్స్ పాంట్‌మీద ఎర్ర టీ షర్టు. చూడ్డానికి చౌకబారు మనిషిలా ఉన్నాడు.
శ్రీకర్ సీట్లోంచీ లేచి వాళ్ల దగ్గిరకొచ్చాడు.
‘‘నువ్వేనా తేజ? పేరు బాగుంది. నువ్వు బాగోలేవు’’ అన్నాడు ఆ యువకుడితో.
‘‘నేనే కాదు. నా పొజిషన్ కూడా బాగోలేదు సార్!’’ అన్నాడు తేజ దీనంగా.
‘‘ఎలా బాగుంటుంది? ఓ ఆడపిల్లని, అదీ మైనర్ని- కిడ్నాపు చేశావు మరి...’’ కటువుగా అన్నాడు శ్రీకర్.
‘‘సుందరంగారు మీకు అన్నీ చెప్పలేదా సార్!’’ అన్నాడు తేజ.
శ్రీకర్ సుందరం వైపు తిరిగి, ‘‘ఇతడి గురించి నువ్వు నాకేం చెప్పావో చెప్పు. మిగిలిందేమన్నా ఉంటే తను చెబుతాడు..’’ అన్నాడు.
సుందరం చెప్పడం మొదలెట్టాడు...
***
తులసి చాలా మంచి పిల్ల. హుషారైనది కావడవంల్ల కొంతమంది అపార్థం చేసుకుంటారు కానీ ఆమెకు అరమరికలు లేవు. ఆమె ఇచ్చిన చనువుని తేజ కూడా అపార్థం చేసుకున్నాడు. ఒకసారి అనుకోకుండా ఏకాంతం లభిస్తే చెయ్యి పట్టుకున్నాడు.
ఆమె తిట్టలేదు. గొడవ చెయ్యలేదు. మృదువుగా చెయ్యి విదిలించుకుని, ‘‘ఎందుకు నా చెయ్యి పట్టుకున్నావు?’’ అనడిగింది.
‘‘నీ చనువు చూసి నేనంటే నీకిష్టమనుకున్నాను’’ అన్నాడు తేజ.
‘‘నువ్వంటే నాకిష్టమే. కానీ చెయ్యి పట్టుకుందుక్కాదు. స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుందుకు’’ అంది తులసి.
‘‘ఒక ఆడ, మగ మధ్య స్నేహమంటే ఇదే అనుకున్నాను’’ అన్నాడు తేజ.
తులసి నవ్వి ‘‘నాకు నువ్వంటే ఇష్టం. కానీ నిన్ను పార్టీలకి పిలవలేను. నీతో కలిసి తిరగలేను. ఎందుకంటే నీ హోదా మాకంటే బాగా తక్కువ. నీతో స్నేహం మావాళ్లకి నచ్చదు. మాతో కలవడం నీకూ ఇబ్బందిగా ఉంటుంది. బస్సులో మనం కలిసినపుడు ఇలా సరదాగా మాట్లాడేననుకో- నాకు బాగుంటుంది. ఆ అమ్మాయి నా ఫ్రెండు అని నీ ఫ్రెండ్సుతో చెప్పుకుందుకు నీకు గొప్పగా ఉంటుంది. అంతే నా ఉద్దేశ్యం’’ అంది.
‘‘నువ్వూ మనిషివి. నేనూ మనిషివి. నా హోదా మీ హోదాకంటే ఎలా తక్కువ?’’ అనడిగాడు తేజ.
‘‘సమాన హోదా వాళ్లతో సరదాగా మాట్లాడితే వాళ్లెప్పుడూ నా చెయ్యి పట్టుకోలేదు’’ అని, ‘‘మళ్లీ ఎప్పుడూ ఇలా నా చెయ్యి పట్టుకోనని మాటివ్వు. మనం మునుపటిలాగే స్నేహంగా ఉందాం’’ అంది తులసి.
తేజకి తులసిమీద అభిప్రాయం మారింది. వాళ్ల స్నేహం కొనసాగుతోంది. అలాంటి సమయంలో తేజని ఓ మనిషి కలిశాడు. తన పేరు మద్దూ అని చెప్పాడు. తనకి తులసి కావాలన్నాడు. ఆమెను కిడ్నాప్ చెయ్యడానికి సహకరిస్తే లక్ష రూపాయలిస్తానన్నాడు.
లేత వయసు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వృత్తిలోకి దింపే ముఠా ఒకటుంది. వాళ్లు హైక్లాస్ వర్గానికి ఆడపిల్లల్ని సరఫరా చేస్తారు. మద్దూ దాంట్లో సభ్యుడు. వాళ్లు తమ వ్యవహారాలకి- ధనాశకి లొంగే బడుగు మనుషుల్ని ఎన్నుకుంటారు. తేజకి తులసితో ఉన్న పరిచయం ఆ ముఠా దృష్టికి వచ్చింది.
‘‘ఆ అమ్మాయి చాలా మంచిది. ఆమె జోలికి వెళ్లొద్దు’’ అని తేజ మద్దూకి చెప్పాడు.

ఇంకా ఉంది

వసుంధర