ఆంధ్రప్రదేశ్‌

ఇమడలేకపోతున్న ‘వలస పక్షులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసల కార్యక్రమం ఇంకా కొనసాగుతునే ఉంది. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైకాపా నుంచి టిడిపిలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మరికొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, కొద్ది రోజులకు వైకాపాను ఖాళీ చేయిస్తామని చెప్పుకొచ్చారు. ఎందుకోకానీ, రాజ్యసభ ఎన్నికల తరువాత వైకాపా నుంచి వలసలు తగ్గాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు నికరంగా వైకాపాలో కొనసాగుతారా? లేదా? అన్న అంశాన్ని పక్కన పెడితే, ఇప్పటికే ఆ పార్టీని వీడి టిడిపిలో చేరిన కొద్దిమంది ఎమ్మెల్యేల్లో అసహనం పెరుగుతోందని, ఒక అరడజను ముంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు సంకేతాలు పంపుతున్నారన్న ప్రచారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున సాగుతోంది.
వైకాపాకు చెందిన సుమారు 16 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ రాజకీయ నాయకులు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, సుజయకృష్ణ రంగారావు వంటి వారు ఉన్నారు. తమతమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, అభివృద్ధిని కాంక్షించి అధికార పార్టీలో చేరుతున్నామని వైకాపాను వీడి వెళ్లి ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే, వలస వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఏ కొద్దిమందో జగన్ వ్యవహారశైలి నచ్చని వారున్నారు. మిగిలిన వారంతా జగన్‌తో సఖ్యతతో మెలిగినవారే. ఇటువంటివారు ఇప్పుడు టిడిపిలో ఇమడలేకపోతున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం.
దీనికి కారణాలు కూడా చెపుతున్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఇప్పుడు అదే నియోజకవర్గాల నుంచి వైకాపా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీలో బోలెడన్ని నిధులున్నాయి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అనుకున్నారు. ఖజానా నుంచి చిల్లిగవ్వకూడా రాకపోవడంతో వీరంతా విస్తుపోతున్నారు. కేవలం ప్రపంచ బ్యాంక్ నిధులు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఫండ్స్ తప్ప వేరే నిధులు రావడం లేదని వలస వెళ్లిన ఓ ఎమ్మెల్యే పేర్కొనడం గమనార్హం. నియోజకవర్గంలో కాస్తంత పనులవుతున్నాయన్న భావన తప్ప, వ్యక్తిగత ప్రతిష్ట మాత్రం పెరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో చెప్పి, చిన్న చిన్న పనులు చేయించుకోగలుగుతున్నామని కొంతమంది ఎమ్మెల్యేలు చెపుతున్నారు. ఇక, ఇటీవల జరిగిన టిడిపి మహానాడులో కూడా వలస ఎమ్మెల్యేలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తమకు గుర్తింపు లేకపోవడాన్ని వారు సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడుతున్నట్టు భోగట్టా. కాగా, వైకాపా నుంచి టిడిపిలో వెళ్లిన సీనియర్ నాయకులు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, సుజయకృష్ణ రంగారావు, జలీల్‌ఖాన్ మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పుష్కరాల తరువాత కానీ మంత్రివర్గ విస్తరణ లేదంటున్నారు. ఒకవేళ వీరిలో ఏ ఒక్కరికి మంత్రి పదవి వచ్చినా, మిగిలిన వలస ఎమ్మెల్యేలకు కొంత ధైర్యం వస్తుందని వారు అంటున్నారు. ఇదిలా ఉండగా ముద్రగడ పద్మనాభం పెద్దఎత్తున కాపు ఉద్యమం చేస్తూ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తున్నా, అదే నియోజకవర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూ ఆయన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీటన్నింటిని బేరీజు వేసుకుంటూ కొంతమంది వలస ఎమ్మెల్యేలు తిరిగి వైకాపాలోకి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. కొద్ది మంది ఎమ్మెల్యేలు తమ మనోగతాన్ని జగన్ సన్నిహితుల వద్ద చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే జగన్ మాత్రం వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు అంగీకరించడం లేదని తెలిసింది.