డైలీ సీరియల్

పూలకుండీలు 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లాంటి నేను ఇప్పుడాన్నుంచి డబ్బులు తెచ్చిచ్చేది చెప్పండీ!’’ అంటూ వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమాలింది శాంతమ్మ.
‘‘ఏమో నీ మాటలేవీ నమ్మేటట్టు లేదు. ఈ సోదంతా మాకెందుగ్గాని మా డబ్బులు మాకిచ్చి నీ దారి నువ్వు చూసుకో. ఆల్రెడీ మేం వేరే మనిషిని మాట్లాడుకున్నాం’’ అంటూ వాళ్ళంతా ఒక్క గొంతుకతో శాంతమ్మను అదేపనిగా బెదిరించారు.
‘‘ఈ ఒక్కసారికి సూడండమ్మా! అన్న మాట నిలబెట్టుకుంటానోలేదో మీరే సూద్దురుగాని’’ అంటూ వాళ్ళందరినీ అతి కష్టంమీద ఒప్పించింది శాంతమ్మ.
***
‘పుండుకు పుల్ల మగడు’ అన్నట్టు ఆపరేషన్ తరువాత గూడ ఆ చిన్నపిల్లకు ఆరోగ్యం కుదుటపడలేదు. పైగా ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో కస్సుబుస్సుమని ముడుచుకొనే తిరగసాగింది.
ఆ రోజు సాయంత్రం ఆరు గంటలప్పుడు శాంతమ్మ నవభారత్ సెంటర్లో ఉన్న చౌక దుకాణంలో కంట్రోల్ బియ్యం తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడప్పుడే మసక చీకటి ముసురుకుంటున్నది. పక్షులు గూళ్ళకు చేరుకుని తమ కూనలను ముదిగారంగా ముక్కులతో కుమ్ముతూ ముద్దులాడుతున్నాయి.
నవభారత్ గుట్టమీద వెంకటేశ్వర దేవాలయం పైన వెలుగుతున్న విద్యుద్దీపాలు వెన్నముద్దలా మిలమిలా మెరుస్తూ దూరానికి కన్పిస్తున్నాయి.
వెలుగు తోరణాలమాదిరిగా భద్రాచలం రోడ్డుమీద వాహనాలు పరుగులు తీస్తూ సాగిపోతున్నాయి.
‘‘ఇంటి దగ్గర పిల్లగాల్లు ముసలోల్లను ఏమేడిపిస్తున్నరో ఏమో?’’ అనుకుంటూ ఇంటిదారి పట్టి వేగంగా నడవసాగింది శాంతమ్మ.
భద్రాచలం రోడ్డునుండి మంచికంటినగర్‌కి వెళ్ళే మట్టిరోడ్డు మీదకొచ్చిన శాంతమ్మ, తోడుకి మనుషులెవర్న కన్పిస్తారేమోనన్న ఆశతో ఆ మసక చీకట్లోనే కళ్ళు పులెపొడుచుకంటూ ముందుకు పారజూసింది. కానీ, కనుచూపు మేరలో ఎక్కడా ఒక్క పురుగు కూడా కన్పించలేదు. దాంతో కొంచెం భయం భయంగానూ మరింత వేగంగా బస్తీకేసి నడవసాగింది.
ఆ మట్టిరోడ్డుకు చెరిసగాన వున్న పత్తికేశవులు బత్తాయితోట దాటుతుండగా ఎదురుగా వున్న తెల్ల తుమ్మ చెట్టు కింద బైక్‌మీద కూర్చుని ఎవరో ఒక మగ మనిషి మసకమసగ్గా కన్పించసాగాడు.
ఆ మనిషిని దూరం నుండే గమనించిన శాంతమ్మ ‘వాడెవరోగాని చీకట్లో వంటరిగా దయ్యం లెక్క అట్ల కూర్చున్నాడెవరబ్బా!’’ అకారణంగా గుండెల్లో ఓ విధమైన అలజడి కదలాడుతుంటే నడక వేగం మరింత పెంచింది.
అల్లంత దూరంలో ఉండగానే తెల్లతుమ్మ చెట్టు కింద కూర్చున్నదెవరో పోల్చుకున్న శాంతమ్మ ‘‘ఓరి వీడి ముఖం పాడుగాను వీడా! ఈ సమయంల వీడేందిక్కడ కూర్చోనున్నాడు’’ అనుకుంటూ నడక వేగం మరికొంత పెంచి ఉరుకుతున్నట్టుగా నడవసాగింది.
దాదాపుగా తెల్ల తుమ్మచెట్టు దగ్గరికొచ్చిన శాంతమ్మ వంక అదోరకంగా చూస్తూ ‘‘ఇందాకటినుండీ నీకోసమే ఎదురుచూస్తున్నా’ బైక్ దిగి ఆమె దారికి అడ్డుగా వస్తూ గుసగుసగా అన్నాడా వ్యక్తి.
ఆ మాటలతో ఒక్కసారిగా గుండెలు ఝల్లుమంటుంటే చిక్కబట్టుకున్న శాంతమ్మ ‘ఈ సమయంలో ఇక్కడ నాకోసం ఎదురుచూస్తున్నావా? ఎందుకు? నాతో ఏదన్నా పనుంటే ఇంటికొచ్చి మాట్లాడు. అంతేగాని చీకటి మాటున ఎటూగాని డొంకల్లో ఇట్లా అడ్డందిరిగి పట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్?’’ కనుగుడ్లు పెద్దవి చేస్తూ గద్దిస్తున్నట్లుగా మాట్లాడింది.
ఆమె గద్దింపుతో కొంత తడబాటుకు లోనైన ఆ వ్యక్తి శాంతమ్మ వంక బెదురుచూపులు చూస్తూ తను అడగాలనుకున్న విషయం ఏదో అడగాలా వద్దా అన్నట్టుగా నిలబడిపోయాడు.
అనుమానాస్పదంగా వున్న అతని ప్రవర్తనకు ఇంకొంచెం బెదిరిపోయిన శాంతమ్మ ‘‘వీడికేదో మాయ మగరోగం వచ్చినట్టుంది! నా ఇంటి పరిస్థితి, నా పిల్లల పరిస్థితి చూసి డబ్బులు ఎరవేసి నన్ను సాధించాలనుకుంటున్నాడేమో! వీడిల్లు పాడుగాను వీణ్ణి నోరారా అన్నా! అని పిలుస్తాను గదా?
అది కూడా మరచిపోయి వీడిట్లా తెగబడ్డాడంటే ఏమనుకోవాలి! అసలే బస్తీ అంతా వీడికి ఆ పిచ్చి వుంది. వైద్యం కోసం వచ్చిన ఆడోళ్లను మాయమాటలు చెప్పి లొంగదీసుకుంటాడనుకుంటారు. అది నిజమేనేమో! ఈదుర్బుద్ధి మనసులో పెట్టుకొనే డబ్బుల వంకన ఈమధ్య మాటిమాటికీ మా ఇంటికొస్తున్నాడేమో! ఇప్పుడు వీరి బారినుండి ఎట్ల తప్పించుకోవాల? ఈ దారినబడి ఎవరన్నా వచ్చినా బాగుండు’’ అనుకుంటూ పరి పరి విధాలుగా ఆలోచన చేయసాగింది.
అదే సమయంలో....
తను శాంతమ్మకోసం ఎందుకు ఎదురుచూస్తూ కూర్చున్నాడో ఆ విషయాన్ని ఎలా కదపాలా? అన్న సందిగ్ధంతో అతను బెదురు బెదురు చూపులతో ఆమె వంకే చూడసాగాడు.
అతని ఆ చూపులతో శాంతమ్మ మనసులో మెదులుతున్న సందేహాలకు మరింత బలం చేకూర్చినట్లై ‘‘లింగన్నా! నీకిది లాకీగాదు, నా బాకీ కింద మా ఇల్లు వాల్చుకొమ్మని మా మామ మొన్ననే నీకు చెప్పిండు గదా! మరింకేంది ఈయాలప్పుడు డొంకలో ఎవ్వరు లేంది జూసి ఏందేందో మాట్లాడుతున్నావ్?’’ దారికి అడ్డుగా వున్న అతణ్ణి దాటుకొని విసవిసా నాలుగడుగులు ముందుకేసింది.
అప్పటికిగాని ఆమె అంతరంగంలో బుడబుడమని మసిలిపోతూ బుడగలెత్తుతున్న ఆలోచనలను అర్థం చేసుకున్న ఆర్‌ఎంపి లింగయ్య ‘‘ఓ చెల్లే! మన బస్తీవాళ్ళంతా అనుకుంటున్నట్టు నేను అలాంటోణ్ణి గాను. పైసల కోసం నువ్వు పడుతున్న ఇబ్బందులను చూసి నీకేదో సాయం చేద్దామని ఇలా వచ్చి కూర్చున్నానంతేగాని నువ్వనుకుంటున్నట్టు నీమీద నాకెలాంటి దురుద్దేశం లేదు చెల్లే!’’ వజ వజ వణికిపోతూ ఇంకేదో కొత్త విషయాన్ని బయటపెట్టబోతున్నట్టుగా మాట్లాడుకొచ్చాడు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు