Others

జాతీయస్థాయి కష్టమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాసాహెబ్ పాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ మూకీ చిత్రాన్ని నిర్మించి భారతదేశంలో చలనచిత్రాల నిర్మాణానికి పునాదులు వేశారు. అలా ప్రారంభమైన సినిమా రాష్ట్ర భాషలకు విస్తరించి ప్రజలకు వినోదాన్ని పంచుతోంది. తెలుగులో 1930లో వచ్చిన ‘్భక్తప్రహ్లాద’తో టాకీ సినిమా మొదలైంది. ఆ ప్రస్థానం ఎన్నో కొత్తపుంతలు తొక్కి స్వర్ణయుగంగానూ భాసిల్లింది! నేడు ఎన్నో సాంకేతిక మార్పులతో పయనిస్తూ వంద కోట్ల క్లబ్బులో వర్ధిల్లుతోంది. కానీ, ఉత్తమ సినిమాకు కొలమానమైన జాతీయస్థాయికి దూరంగా ఉండిపోయింది.
సినిమాను పరిశ్రమగా గుర్తించి భారత ప్రభుత్వం 1954 నుంచీ అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే..? ఇప్పటివరకు జాతీయ ఉత్తమ చిత్రాలను బెంగాలీలే ఎక్కువ నిర్మించగలిగారు. 22 జాతీయ అవార్డులు సాధించి బెంగాలీ సినిమా అగ్రస్థానంలోవుంటే, 13 అవార్డులతో బాలీవుడ్ ద్వితీయస్థానంలో ఉంది. 11 జాతీయ ఉత్తమ చిత్రాలతో మలయాళీలు, ఆరు ఉత్తమ చిత్రాలతో కన్నడిగులు, 4 ఉత్తమ చిత్రాలతో మరాఠీలు, సంస్కృత భాషా చిత్రాలు 2 అవార్డులు సాధించి వరుస స్థానాల్లోవుంటే, అతి పెద్ద పరిశ్రమ కలిగిన తెలుగు మాత్రం అస్సామీ, బిహారీలతో సమానంగా ఒకే ఒక్క జాతీయస్థాయి ఉత్తమ చిత్రంతో చిట్టచివరి స్థానంలోనే ఉంది. పైగా జాతీయ అవార్డులు ప్రారంభించిన 62 ఏళ్లకు తెలుగు సినిమాకు ఆ స్థాయి దక్కింది. అదీ ఒకే ఒక క్యాటగిరీ కింద. ఊహాజనితమైన తెర రూప దృశ్యం క్యాటగిరీ (గ్రాఫిక్స్) కింద రెండుసార్లు జాతీయ అవార్డుకు పోటీపడిన బాహుబలికి, ఈ ఏడాదే ఆ గౌరవం దక్కింది. మా గోప్ప తెలుగు సినీ పరిశ్రమ అని చెప్పుకోవడమే తప్ప, 62ఏళ్ల కాలంలో ఉత్తమ జాతీయ దర్శకుడుగాని, ఉత్తమ నటుడిగాని తెలుగు నుంచి లేకపోవడం దురదృష్టం, దౌర్భాగ్యం.
ఉత్తమ జాతీయ నటిగా 1978లో నిమజ్జనం చిత్రానికి శారద, 1988లో ‘దాసి’ చిత్రానికి అర్చన, 1990లో కర్తవ్యం చిత్రానికి విజయశాంతి ఉత్తమ జాతీయ అవార్డులు సాధించారు. ఉత్తమ సహాయ నటులుగా 1991లో యజ్ఞం చిత్రానికి పిఎల్ నారాయణ, 1998లో అంతఃపురం చిత్రానికి ప్రకాష్‌రాజ్ అవార్డులు అందుకున్నారు. 1985లో సుధాచంద్రన్ మయూరి చిత్రం ద్వారా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. 1995లో స్ర్తి చిత్రానికి రోహిణి, 1997లో అన్నమయ్య చిత్రానికి అక్కినేని నాగార్జున, 1998లో ‘కంటే కూతుర్నే కనాలి’ చిత్రానికి దాసరి నారాయణరావు, 2013లో ‘నా బంగారు తల్లి’ చిత్రానికి అంజలి పాటిన్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు.
2001లో షో చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లేకు నీలకంఠరెడ్డి ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నాడు. 1988లో దాసి చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ జాతీయ అవార్డులు అందుకున్నారు.
సాహిత్యంలో 1974లో విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని గీతం ‘తెలుగువీర లేవరా!’ అనే గీతానికి శ్రీశ్రీ, 1993లో విడుదలైన ‘మాతృదేవోభవ’ చిత్రంలోని గీతం ‘వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే’ గీతానికి వేటూరికి, 2003లో విడుదలైన చిత్రం ఠాగూర్‌లోని గీతానికి ‘నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి హారతిస్తాను’ అనే గీతానికి సుద్దాల అశోక్‌తేజలు జాతీయ అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ సంగీత విభాగంలో 1979లో విడుదలైన శంకరాభరణం చిత్రానికి కెవి మహాదేవన్, 1982లో విడుదలైన మేఘసందేశం చిత్రానికి రమేష్‌నాయుడు, 1983లో సాగర సంగమం చిత్రానికి ఇళయరాజా, 1988లో రుద్రవీణ చిత్రానికి ఇళయరాజా, 1997లో అన్నమయ్య చిత్రానికి ఎంఎం కీరవాణి, 2004లో స్వరాభిషేకం చిత్రానికి విద్యాసాగర్, 2013లో ‘నాబంగారు తల్లి’ చిత్రానికి సంతానుమైత్ర జాతీయ అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ గాయనిలుగా 1976లో సిరిసిరిమువ్వ చిత్రానికి పి సుశీల, 1979లో శంకరాభరణం చిత్రానికి వాణిజయరాం, 1982లో మేఘసందేశం చిత్రానికి పి సుశీల, 1983లో ఎంఎల్‌ఏ ఏడుకొండలు చిత్రానికి పి సుశీల, 1984లో సితార చిత్రానికి ఎస్ జానకి, 1991లో స్వాతికిరణానికి వాణిజయరాం జాతీయ అవార్డులు అందుకున్నారు. 1979 శంకరాభరణం చిత్రానికి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, 1982లో మేఘసందేశం చిత్రానికి కెజె జేసుదాసు, 1983లో సాగరసంగమం చిత్రానికి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, 1988లో రుద్రవీణ చిత్రానికి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ గాయకులుగా అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ జాతీయ నృత్య దర్శకులుగా మగధీర చిత్రానికి శివశంకర్ అందుకున్నారు. భక్తకన్నప్ప చిత్రానికి 1976 ఆర్ట్ డైరెక్టర్‌గా రామనాధం ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నారు. ఉత్తమ ఎడిటర్‌గా 1976లో విడుదలైన సిరిసిరిమువ్వ చిత్రానికి బాబురావు, 1984లో విడుదలైన సితార చిత్రానికి అనిల్‌మల్నాడ్‌లు జాతీయ అవార్డులు సాధించారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా 1975లో విడుదలైన ముత్యాలముగ్గు చిత్రానికి ఇసాన్ ఆర్యా, 1988లో విడుదలైన దాసి చిత్రానికి అపుర్బకిషోర్‌బిర్ అందుకున్నారు. దాసి చిత్రం ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు అందుకొని తెలుగు సత్తాచాటింది.
గ్రాఫిక్స్ విభాగంలో 2004లో అంజి చిత్రానికి సనత్, 2009లో మగధీర చిత్రానికి కూల్‌కన్నన్, 2012లో ఈగ చిత్రానికి ముక్తాఎపెక్ట్, 2016 బాహుబలి చిత్రానికి శ్రీనివాస్ మెహాని జాతీయ అవార్డులు సాధించారు. 2006లో కిట్టు ఉత్తమ యానిమేషన్ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది.
ఉత్తమ జాతీయ బాలల చిత్రాలుగా రామాయణం 1997లో, 1991లో భద్రంకొడుకో, 1996లో లిటిల్ సోల్జర్ చిత్రాలు అందుకున్నాయి. బాల నటులుగా సంతోష్‌రెడ్డి భధ్రం కొడుకో చిత్రానికి, కావ్య లిటిల్ సోల్జర్ చిత్రానికి గాను, 2005లో సాయికుమార్ బొమ్మలాట చిత్రానికిగాను ఉత్తమ అవార్డులు అందుకున్నారు.
పాపులర్ సినిమా కేటగిరిలో 1979లో శంకరాభరణం, 1987లో పుష్పక విమానం, 1989లో గీతాంజలి, 1997 రామాయణం చిత్రాలు అందుకున్నాయి. 2001లో నూతన ఉత్తమ దర్శకులుగా తిలదానం చిత్రానికి కెఎన్‌టి శాస్ర్తీ, 2004లో గ్రహణం చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రాలకుగాను 1981లో సప్తపదికి కె విశ్వనాథ్, 1988లో రుద్రవీణకు కె బాలచందర్, 2006లో హోప్ చిత్రానికి సతీష్ కాశెట్టి అవార్డులు అందుకున్నారు.
1954 నుంచి ప్రాంతీయ తెలుగుభాషా విభాగం క్రింద ఎన్నో చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా బహుమతులు అందుకున్నాయి. పెద్దమనుషులు, తోడుదొంగలు, విప్రనారాయణ లాంటి సినిమాల నుంచి నిన్న మొన్నటి ఈగ, నా బంగారుతల్లి, చందమామ కథలు, కంచెలాంటి చిత్రాల వరకూ బహుమతులు అందుకున్నవే.
ఉత్తమ దర్శకులుగా సత్యజిత్‌రే, ఆదూరు గోపాలక్రిష్ణన్‌లు ఆరుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటులుగా అమితాబ్, మమ్మూట్టిలు నాలుగుసార్లు, కమల్‌హాసన్ మూడుసార్లు అందుకుంటే, సహాయ నటులుగా నానాపటేకర్, పంకజ్‌కపూర్, అతుల్ కులకర్ణీ, షబానా ఆజ్మీ (5), శారద (3), కంగనా రనౌత్ (3) సార్లు అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావు ఆరుసార్లు అవార్డులు సాధించారు.
దాదాసాహెబ్ పాల్కే అవార్డు 1974 బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, 1980లో పైడి జయరాజు, 1982లో ఎల్‌వి ప్రసాద్, 1986 బి నాగిరెడ్డి, 2009లో డి రామానాయుడు, 2010లో కె బాలచందర్, 1990లో అక్కినేని నాగేశ్వరరావులు అందుకున్నారు.
1954 నుంచి 2016 వరకు తెలుగు నుంచి జాతీయ ఉత్తమ చిత్రంగాని, ఉత్తమ దర్శకుడుగాని, ఉత్తమ నటుడుగాని లేకపోవడం నిజంగా దురదృష్టం. తెలుగులో ఎందరో స్టార్లు ప్రజల్లో దేవుళ్లుగా పాలాభిషేకం చేయించుకుంటున్నారు. ఏం లాభం? జాతీయ స్థాయిలో వెలగలేకపోతున్నారు. కోట్లు తీసుకుంటున్నా ఎందరో క్రియేటివిటి దర్శకులున్నారు. ఒక్కరూ జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకులు కాలేకపోతున్నారు. తెలుగు సినిమాకు డబ్బే ప్రధానమైంది. అందుకే జాతీయస్థాయిని అందుకోలేకపోతున్నాం. ఇకనైనా ప్రపంచస్థాయి సినిమా ప్రమాణాన్ని టార్గెట్ చేసుకుని -కనీసం జాతీయస్థాయి అవార్డు సాధించే దిశగానైనా తెలుగు సినిమా ప్రయత్నం జరగాలని కోరుకుందాం.

-ఆకుల రాఘవ