అదిలాబాద్

మాజీ ఎమ్మెల్యే విఠల్‌రావ్ దేశ్‌పాండే కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 28: ఆదిలాబాద్ మాజీ శాసన సభ్యుడు విఠల్‌రావు దేశ్‌పాండే (84) గురువారం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు. 1932 ఫిబ్రవరి 1న జన్మించిన విఠల్‌రావ్ దేశ్‌పాండే గత రెండు నెలలుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల కిందటే పరిస్థితి విషమించడంతో ఆయనను హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరాడంబరజీవిగా, నిజాయితీ శాసన సభ్యునిగా జిల్లాలో పేరున్న గాంధేయవాధి విఠల్‌రావ్ దేశ్‌పాండే ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. నిజాం పాలనలో పలు సార్లు ఉద్యమాలు నడిపి జైలుకు కూడా వెళ్లారు. 1957-62 వరకు ఆదిలాబాద్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, 1962లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్ శాసన సభ నియోజకవర్గానికి పోటీ చేసి గెలుపొందిన విఠల్‌రావ్ దేశ్‌పాండే అనంతరం పలు పదవుల్లో రాణించి రాజకీయ జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. 1968-70 వరకు ఆంధ్రప్రదేశ్ షుగర్‌బోర్డు కమిటీ చైర్మెన్‌గా, 1972-78 వరకు రెండు దఫాలుగా ఆదిలాబాద్ డిసిసిబి చైర్మెన్‌గా విఠల్‌రావు పదవుల్లో రాణించారు. 1978-81 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేసి ఆ పార్టీని తిరుగులేని శక్తిగా ముందుకు నడిపించారు. సాదాసీదా వ్యక్తిగా కనిపించే విఠల్‌రావ్ దేశ్‌పాండే తన తుదిశ్వాస విడిచే వరకు ఎలాంటి వాహనం లేకుండానే కాలి నడకన తన సొంత పనులు చేసుకుంటూ ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించారు. విఠల్‌రావ్ దేశ్‌పాండేకు నలుగురు కుమారులు కాగా ఓ మనువడు భార్గవ్ దేశ్‌పాండే ప్రస్తుతం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, గురువారం సాయంత్రం కేర్ ఆసుపత్రిలో కన్నుమూసిన విఠల్‌రావ్ దేశ్‌పాండే భౌతిక కాయాన్ని రాత్రి 10 గంటలకు ఆదిలాబాద్ తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విఠల్‌రావ్ దేశ్‌పాండే మృతిపట్ల జిల్లాకు చెందిన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీమంత్రి సి.రాంచంద్రారెడ్డి ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఆదర్శ జీవితాన్ని గడిపి తమకు స్పూర్తిదాతగా నిలిచిన దేశ్‌పాండే ఆశయాలు సాధించడమే తమ ముందున్న కర్తవ్యం అని పేర్కొన్నారు.