సబ్ ఫీచర్

నేను మళ్లీ జీవిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను మళ్లీ పుడతా.. మళ్లీ జీవిస్తా.. మనుషుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం, మానవీయతను మనుషుల ప్రాథమిక హక్కుగా గుర్తింపు సాధించటం కోసం.. ఒహో.. నేను మళ్లీ జీవిస్తా..’’ కొద్దికాలం క్రితం జైపూర్‌లో జరిగిన సాహిత్య పండుగలో భారతదేశం గర్వించదగ్గ సాహితీమూర్తి మహాశే్వతాదేవి పలికిన పలుకులివి. తమ ఆశలు, కలలను నిజం చేసేందుకు రెండోసారి జీవించాలని ఉందని ఆమె అన్న మాటలు నిజం కావాలని గురువారం మధ్యాహ్నం మహాశే్వతాదేవి భౌతిక దేహం ముందు సామాన్యుడు రోదిస్తున్నాడు. 90సంవత్సరాల నిండైన జీవితమంతా గిరిజనుల కోసం, అణగారిన వర్గాల కోసం రాజీలేని పోరాటం చేసిన యోధురాలు శక్తి సన్నగిలిన దేహాన్ని వదిలి మరోదేహంలో పుట్టుకొస్తానంటూ వెళ్లిపోయింది. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న కలలు, మానవత్వం, మనిషితనం- సామాన్యుడు కోరుకునే ఈ అంశాల కోసమే సాగించిన పోరాటం అసాధారణమైంది. ఆమె రచన అగ్నిగర్భ.. ఆమే ఒక అగ్నిగర్భ. ఆమె కడుపునిండా సామాన్యుడి వెతల గోస అగ్నిగోళమై ఆమరణాంతం మండుతూనే ఉంది. జీవించే హక్కుల కోసం గిరిజనుల కడుపుమంట భగభగమంది.. వయోభారంతో తనలో శక్తి తగ్గిపోయినా ఆమె స్వరం ఖంగుమంటూనే ఉంది. ‘‘బలం తగ్గటం అంటే పోరాటానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్లు కాదు. చివరి స్టేషన్ వచ్చేసినట్లు కానే కాదు. కాస్త నెమ్మదించినట్లే తప్ప యుద్ధం ఆగేది లేదు.. ఆపేదీ లేదు’’ అన్న మాటలు విన్నప్పుడు ఆమెలో దాగి ఉన్న అగ్నిశిఖలు అక్షరజ్వాలగా ఎగిసిపడుతున్నట్లే అనిపిస్తుంది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 90 ఏళ్ల క్రితం జన్మించిన మహాశే్వతాదేవి ప్రపంచానికి కనిపించని, ప్రపంచం గుర్తించని, ప్రపంచంతో సంబంధం లేని సమాజాలకు వెలుగు చూపించినప్పుడు నాగరిక ప్రపంచం విస్తుపోయింది. వారి సంస్కృతి, పోరాటాలు, లక్ష్యాలు, వాటిని సాధించేందుకు వారు చేసే జీవన ప్రయాణం మామూలు నగర సమాజం అర్థం చేసుకోలేదు. వారిని గుర్తించనూ లేదు. కొండకోనలను ఆనుకుని జీవిస్తారు కాబట్టి వాళ్లను గిరిజనులని(గిరి అంటే కొండ) సివిల్ సొసైటీ పేరు పెట్టింది. మరింత ముందుకు వెళ్లిన మరో వర్గం వారిని దళితులంటూ ట్యాగ్‌లైన్ తగిలించింది. కానీ, మహాశే్వతాదేవికి వారంతా కేవలం మనుషులే. సామాన్య మనుషులు. పెద్ద పెద్ద ఆకాంక్షలు లేని.. తమ జీవికకు అవసరమైన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవటానికే పోరాటం చేసే అమాయకులు. మనిషితనం మాయం కానిది వారిలో మాత్రమే. ఈ మనిషితనాన్ని గుర్తించటం కోసమే.. ఈ మానవతను కాపాడటం కోసమే మహాశే్వత తన స్వరంతో, అక్షరంతో అలుపెరుగని పోరాటం చేశారు. ఆమెను రామన్ మెగసెసే అవార్డు వరించవచ్చు. భారతీయ జ్ఞానపీఠ పురస్కారమూ దక్కవచ్చు. అనేకానేక సంస్థలు ఆమెను అనేకానేక అవార్డులు, పురస్కారాలతో సత్కరించవచ్చు. సన్మానించవచ్చు. కానీ, ఇవన్నీ ఆమె చేసిన పోరాటంలో మార్గమధ్యంలో తగిలిన మైలురాళ్లలా మిగిలిపోయాయే తప్ప, వాటితో ఆమె ప్రస్థానం మాత్రం ఆగిపోలేదు.
2006లో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన బుక్‌ఫెయిర్‌లో రాజ్‌కపూర్ ప్రసిద్ధ గీతం ‘మేరా ఝూతా హై జపానీ’ పాటను ప్రస్తావిస్తూ ఆమె చేసిన ప్రసంగం ప్రేక్షకుల కంట తడిపెట్టించింది. ‘‘ ఇది నిజం. ఇప్పుడు మనం జపాన్ బూట్లు, ఇంగ్లీష్ ప్యాంటు, రష్యా టోపీ ధరించే కాలంలో ఉన్నా, మనసు మాత్రం హిందుస్తానీదే ఉంది. నా దేశం గర్వించదగ్గ, అందమైన దేశం. వేడిగా, ఆర్ద్రంగా, చల్లగా వెలిగే దేశం’’ అని ఆమె అన్నప్పుడు చలించని ప్రేక్షకులు లేరు.
1084మందికి తల్లి(హజార్ చౌరాసీకీ మా), రుడాలీ వంటి రచనలు తరువాత సెల్యులాయిడ్‌పై చిత్రాలై తమకు తెలియని ప్రపంచాన్ని, జాతులను, వారి జీవన విధానాలను నాగరకపు సమాజానికి పరిచయం చేశాయి. సంపన్నుల ఇళ్లల్లో ఎవరైనా చనిపోయినప్పుడు శవాల దగ్గర కూచుని ఏడవటం కోసమే ఒక వర్గం ప్రత్యేకంగా ఉంటుందని రుడాలీ ద్వారానే సమాజానికి తెలిసింది.
మహాశే్వతను మార్క్సిస్ట్ భావజాలం ఉన్న రచయితగా అంతా అన్నారు. ఆమె మాత్రం తన భావజాలం మానవత్వం అన్నారు. ఒక రచయిత ఏ సిద్ధాంతానికి, భావజాలానికి కట్టుబడి ఉన్నారన్నది పాఠకులు నిర్ణయించుకుంటారని ఆమె దృఢమైన అభిప్రాయం.
ప్రపంచీకరణపై ఆమె స్పష్టంగానే తన వైఖరిని వెల్లడించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఇంత తేలిగ్గా ప్రపంచీకరణను ఎదుర్కోవచ్చా అని ముక్కున వేలేసుకున్నారు. ‘‘ప్రపంచీకరణను ఎదుర్కోవటానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మంచి కూడలిలో ఒక స్థలంలో బాగా గడ్డి పెంచండి. మధ్యలో ఒక చెట్టు ఉంటే చాలు. మీ కుమారుడి మూడు కాళ్ల సైకిల్‌ని అక్కడ పెట్టండి. ఓ పేద పిల్లవాణ్ణి అక్కడికి వచ్చి అడుకోనివ్వండి. ఒక పక్షి వచ్చి చెట్టును ఆశ్రయించేలా చేయండి. చిన్న చిన్న కలలను నిజం చేయండి. చిన్న చిన్న ఆశలను ఫలించేలా చేయండి.’’ ఇంత అద్భుతంగా చెప్పటం మహాశే్వతకు కాకుండా మరొకరికి సాధ్యం కానే కాదు. ఆమె నవలలు, చిన్న కథలు, నాటకాలు, వ్యాసాలు.. ప్రతి ఒక్కటి కూడా ఆమె భావాలను ప్రస్ఫుటంగా ప్రతిఫలింపజేసేవే. కలానికి ఉన్న శక్తి ఆమె. సామాన్యుడి పిక్కటిల్లిన స్వరం ఆమె. సమానత్వానికి నిర్వచనం ఆమె. న్యాయానికి నిలువుటద్దం ఆమె.. మహాశే్వత.. సామాన్యుడి మహాశక్తి.

-కోవెల సంతోష్ కుమార్