సబ్ ఫీచర్

పరిష్కారం కాని వివాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంధొమ్మిదవ శతాబ్దంలో ‘గెలివర్ ట్రావెల్స్’అనే నవల వచ్చింది. దానితో కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అది ఇంగ్లీషులో వుండడం వలన ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచుర్యాన్ని పొందింది. స్వాతంత్య్రానికి ముందు తరువాత కొంతకాలం మన దేశంలో హైస్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ విద్యార్థులకానవలను ఉపవాచకంగా పెట్టేవారు. దాని ప్రభావంతోనే కావచ్చును, పందొమ్మిదవ శతాబ్దం చివరలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు ‘వర్ధమానుని విదేశీయాత్రలు’ అనే నవల వ్రాసారు. అప్పట్లో, ఇది ఆంధ్ర దేశంలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది.
ఇంతకీ విషయమేవిటంటే, దేశ ప్రధాని విదేశ పర్యటనలు చేయవలసి వుంటుంది. ఇతర దేశాలతో దౌత్యసంబంధాల పెంపుకోసం, పారిశ్రామికాభివృద్ధికొరకు పెట్టుబడులను ఆహ్వానించడంకోసం, ఇతర ప్రధాన అంతర్జాతీయ సమావేశాలకు హాజరుకావడంకోసం ప్రధాని పర్యటించక తప్పదు. దీనిని కాదని ఎవరూ అనరు. అయితే ఈ పర్యటనలేమేరకు? ఒక సముచితమైన పరిమితితోనే పర్యటనలు జరగాలి. కాని, బి.జె.పి. ప్రభుత్వం అధికారంలోకొచ్చిన ఈ రెండు సంవత్సరాల్లోను ప్రధానమంత్రి 50కి పైనే దేశాలు పర్యటించారని పత్రికలు చెబుతున్నాయి. ఇది రికార్డు! స్వాతంత్య్రం తరువాత ఏ ప్రధానమంత్రీ కూడా రెండేళ్ళకాలంలో ఇన్ని విదేశ పర్యటనలు చేయలేదు.
అయితే, ఇన్ని యాత్రలు ఎందుకోసం? పరస్పర ప్రయోజనముండాలి కదా అని సాధారణ ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం. ఈ యాత్రలకు ఖర్చెంత? ప్రధాని విదేశ పర్యటనకు ఒక ప్రత్యేక మిలటరీ ఎయిర్‌క్రాఫ్టుమీద వెళతారు. ఆయన భద్రతా సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బందీ ఒక విమానంలో వెళతారు. సమాచార సిబ్బంది పత్రికా ప్రతినిధులు, ఎలెక్ట్రానిక్ మీడియా వేరే విమానంలో వెళతారు. వీళ్ళందరికీ ఇక్కడ ఖర్చులు, అక్కడ ఖర్చులూ అన్నీ తడిపి మోపెడై కోట్ల మీదవుతుంది! అలా అనేకసార్లంటే వందల కోట్లపైన అవుతుంది. తిరిగి వచ్చే ప్రయోజనమెంత? ‘మేక్ ఇన్ ఇండియా’ అంటే విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లో పరిశ్రమలు పెట్టి ఉత్పత్తిచేసి ప్రపంచమార్కెట్లో అమ్ముకోవడం. ఈ పథకాన్ని ప్రధాని ప్రతిపాదించారు. కాని విదేశ పెట్టుబడిదారులెంతమందో వచ్చి పరిశ్రమలు ప్రారంభించారీ రెండేళ్ళలో! మేక్ ఇన్ ఇండియా చక్రం తిరగకుండా అక్కడే ఆగిపోయింది!
దేశంలో అనేక సమస్యలున్నాయి. వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు- జల వివాదాలు, భూవివాదాలు, ఆస్తుల పంపిణీ- మొదలైనవి. కేంద్రం కలుగచేసుకుని ఈ వివాదాలను పరిష్కరించడం లేదు. వారికి సమయం వుండ డం లేదు. ఆంధ్రప్రదేశ్‌ను అనేక రాజ్యాంగ, న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం, బి.జె.పి. పార్టీ ఏకమై విడగొట్టారు. ఫలితంగా, అంతకు క్రితంవరకూ స్వయం సమృద్ధంగా వున్న ఆంధ్ర ప్రాంతం పేద రాష్ట్రంగా మిగిలిపోయింది. తరువాత అధికారంలోకొచ్చిన బి.జె.పి. ప్రభుత్వం వెనుకబడిన ఆంధ్రను నిలబెట్టడానికేమీ చేయడం లేదు సరికదా, అడిగితే బిచ్చంలాగా విదిలిస్తున్నారు. విడిపోయిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు మిగిలిపోయాయ. జల వివాదం, 9,10 షెడ్యూలు ఆస్తుల పంపకం హైకోర్టు విభజన మొదలైనవి. విభజన వలన కలిగిన వివాదాలను పరస్పర చర్చల ద్వారా రెండు రాష్ట్రాలూ పరిష్కరించుకోలేక పోతే, కేంద్రం కలుగచేసుకుని పరిష్కరించాలని విభజన చట్టం లో పేర్కొన్నారు. అందుకే, రాష్ట్రం కేంద్రానికి మొరపెట్టుకుంటున్నది. మీరూ మీరూ చర్చించుకుని తేల్చుకొండని కేంద్రం చెబుతోందే తప్ప మధ్యవర్తిత్వం వహించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మాట్లాడక వూరుకుంటున్నది. ఎందుకంటే వారు స్థాన బలిమితో వున్నారు. విభజింపబడవలసిన ఆస్తులన్నీ హైదరాబాదు నగరంలోనే ఎక్కువ వున్నవి. ఎందుకు కేంద్రం నడుం కట్టుకుని పరిష్కరించడం లేదంటే వారికి సమయం లేదు. అక్కడ ప్రధానమంత్రి అనుమతి లేకుండా ఎవ్వరూ ఏమీచేయలేరు. అసలు ఆంధ్రా సమస్యలన్నీ ప్రధాని దృష్టికెళుతున్నవా అని ముఖ్యమంత్రి సంశయాన్ని వ్యక్తం చేసారు. అంటే ప్రధానికి తీరిక వుండడం లేదని అభిప్రాయం.
అందువలన ప్రధానమంత్రి విదేశీ యాత్రలను పరిమితిమేరకు తగ్గించుకుని, దేశ సమస్యలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన సమయాన్ని ఎక్కువగా దేశాభివృద్ధి, సమస్యల పరిష్కారం మీదనే వెచ్చించాలి. ఆయన రాష్ట్రాలను ఎక్కువగా సందర్శించడం లేదు. ఉప ఎన్నికలొచ్చినపుడు మాత్రమే పార్టీ ప్రచారంకోసం రాష్ట్రాలకు వెళుతున్నారు. ఎక్కువ దేశాలు పర్యటిస్తున్నందువలన, విదేశాలలో సమయం గడుపుతున్నందువలన సాధారణ ప్రజల్లో కూడా అసమ్మతిని వ్యక్తమవుతోంది. ఈ విదేశీ పర్యటనల గురించి కొన్ని చమత్కార మాటలు, నిరసనలనూ పత్రికల్లో చదువుతున్నాం. ఆయన పార్లమెంటులో వున్నపుడు కూడా, విమానంలో ప్రయాణిస్తున్నారనే భావనతో, సీటు బెల్టుకోసం చూసుకుంటున్నారని సి.పి.ఎమ్ నేత సీతారాం ఏచూరి చమత్కరించారు!
ప్రధానమంత్రి తనకు వీలు కలిగినపుడల్లా రాష్ట్రాలను సందర్శిస్తూ వుండాలి. అందువలన ప్రజాసమస్యలు, రాష్ట్ర సమస్యలూ ఆయనకర్థమవుతాయి. రాష్ట్రాల మధ్యనున్న వివాదాల గురించి అవగాహన ఏర్పడుతుంది. బి.జె.పి. అధికారంలోవున్న రాష్ట్రాలు, ఇతర పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలనూ తరచూ సందర్శించడంవలన ఆయనకు దేశ ప్రజలతో సాన్నిహిత్యమేర్పడుతుంది. ప్రజలలో ఆయన యొక్క ‘ఇమేజి’ పెరుగుతుంది. సాధారణ ప్రజల అభిప్రాయం ప్రజలను నేరుగా కలిసినపుడే తెలుస్తుంది. ఇతర నాయకుల ద్వారా కాదు.

- మనె్న సత్యనారాయణ