రాష్ట్రీయం

హోదాపై ఇక గోదాలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 27 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో మెడ తెగి పడినా అడుగు వెనక్కువేయనని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఉద్వేగంగా అన్నారు. శనివారం స్థానిక ఇందిరామైదానంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని గంటా10 నిమిషాలపాటు ఉద్వేగంతో ప్రసంగించారు. తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకులు, మాజీమంత్రులపై సెటైర్లతో విమర్శలు చేసిన పవన్ కేంద్రంలోని బిజెపిని సైతం తనదైన రీతిలో హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి పైనా సున్నిత విమర్శలు చేస్తూ ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. హోదా ఇవ్వకపోతే తాను రోడ్లపైకి ప్రజా ఉద్యమాన్ని నడుపుతానని హెచ్చరికలు జారీచేశారు. కాగా వామపక్షాల భావాలంటే తనకు గౌరవం అంటూనే సిపిఐ నారాయణ జనసేన భజనపార్టీ అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. జనసేన భజన పార్టీ కాదని, జనంపార్టీ అని, గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ కాదని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం జరిపే పవన్‌సింగ్ అని వ్యాఖ్యానించారు. తనకు పదవులపై ఆకాంక్షలేదని, సినిమాలంటే ప్రేమలేదన్నారు. సినిమాల్లో తానెప్పుడూ ఆనందం పొందలేదన్నారు. తనకు చిన్ననాటి నుంచి పేద ప్రజల సమస్యలను పరిష్కరించడం అంటేనే ఇష్టమన్నారు. అందుకే జనసేన పార్టీ పెట్టానన్నారు. ‘్భవిష్యత్ జాతీయ పార్టీలకే ఉంటుందని, ప్రాంతీయ పార్టీలకు ఉండదని, అందుకే జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేయమ’ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనను కోరారన్నారు. జనసేన ప్రాంతీయ పార్టీయే కావచ్చని, జాతీయ సారూప్యతాభావాలు కలిగిన పార్టీ అని, దేశానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో ఏమి జరుగుతుందో అవగాహన కలిగిన అంతర్జాతీయ సారూప్యత కలిగిన పార్టీ అని స్పష్టం చేశానన్నారు. నేటి పరిస్థితుల్లో సహనం, సంయమనం అవరసమని, అవే వర్తమాన రాజకీయాలకు దిక్సూచి అని అన్నారు. అందుకే రెండున్నరేళ్ల పాటు వేచి ఉన్నానన్నారు. ఇపుడు కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ప్రశ్నించే తరుణం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి తనకు మరిన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని మున్ముందు నిర్వహించబోయే సభల్లో వెల్లడిస్తామన్నారు.
ఒక ఓటు- రెండు రాష్ట్రాలు అని బిజెపి కాకినాడ ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయించి, రాష్ట్ర విభజనకు బీజం వేసిందని అన్నారు. అందుకే అక్కడే సెప్టెంబర్ 9న తొలి సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అమరావతి భూ సేకరణలో తాను రైతులకు అండగా నిలబడ్డానన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. ఆ సమయంలో తనకు కులం బురదను పూశారన్నారు. తనకు కులం, మతం లేదన్నారు.
తనకుమార్తె ఒక క్రిస్టియన్ అన్నారు. ఆమె తల్లి చర్చ్‌కు వెళ్లినా తనకు అభ్యంతరం ఉండదన్నారు. తాను హిందువునే అయిప్పటికీ దేవుళ్లంతా ఒకటేనని నమ్మే వ్యక్తిత్వం తనదన్నారు. సమస్యలు తలెత్తినపుడు తాను ఎవరితో రాజీపడనన్నారు. తాను ఏ పార్టీ జెండా, అజెండాలు మోయనని, నేను మోసేదెల్లా ప్రజలజెండా అజెండానే అన్నారు. తాను ఎవరికీ తొత్తును కాదన్నారు. తనకు చేతగాకపోతే మభ్యపెట్టనని, ప్రజలకు క్షమాపణ చెబుతానన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ అశాస్ర్తియంగా చేసి ఏం తప్పు చేసిందో బిజెపి అలాంటి తప్పేచేస్తోందని నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినపుడు వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని తన ప్రత్యేక హోదాపై ప్రశ్నించలేదన్నారు. లేడికి లేచిందే పరుగులా వ్యవహరించకూడదన్నది తన సిద్దాంతం అన్నారు. అందుకే ఇన్నాళ్లూ వేచి చూశానని, కేంద్రంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇపుడు ప్రశ్నిస్తున్నానన్నారు. ఈ తరుణంలో 100 వేల కోట్ల ఇస్తున్నామని కాకి లెక్కలు చెప్పవద్దని ఆయన బిజెపికి హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అడ్డుచెబుతున్నారని కేంద్రం చెప్పడం సరికాదన్నారు.
ఆరు కోట్ల మంది విభజన వద్దన్నారని, మరి విభజన ఎలా చేశారని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కూడా విభజన సమయంలో రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారన్నారు. మరి ఇపుడు ప్రత్యేకహోదా వల్ల ఒరిగేదిలేదనడం సరికాదన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవులు పట్టుకొని ఊగులాడటం కన్నా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం పదవులు వదులుకోండని కేంద్ర మంత్రులకు హితవు పలికారు.

చిత్రం.. శనివారం తిరుపతిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్.