మెయన్ ఫీచర్

కలకాలం ఇలా సాగనీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట్లాడుకుంటే దూరం తగ్గుతుంది. ఇది ఆ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఎయిర్‌టెల్ వాణిజ్య ప్రకటన. నిజజీవితంలోనూ ఇది వర్తిస్తుంది. ఆరు దశాబ్దాలు కలసి మెలసి ఉన్న తెలుగువాళ్లు ప్రాంతాలుగా విడిపోయి, మనుషులుగా కొనసాగుతూ రెండున్నరేళ్లయినా, పాలకుల మధ్య సఖ్యత ఇంకా పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కొన్ని అంశాల్లో తప్ప మిగిలిన అనేక వ్యవహారాల్లో ఆంధ్ర-తెలంగాణ ప్రభువుల మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. నిజానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలు కత్తులుదూసుకునేంత పెద్దవేమీ కావు. కర్నాటక-తమిళనాడు మాదిరిగా బస్సులు తగులబెట్టుకునేంత విద్వేషపూరితమైనవి కావు. ఇద్దరు చంద్రులూ పరిచయం లేనివారూ కాదు. వయసులో ఒకటి రెండేళ్లు అటు ఇటయినా ఇద్దరూ ఒకే రాజకీయ పాఠశాలలలో ఏళ్ల తరబడి గడిపిన గండరగండులే. కాకపోతే ఎవరి ప్రాంత అవసరాలు, అంతకుమించి రాజకీయ అజెండాలు వేర్వేరుగా ఉండటమే అసలు సమస్య. కేసీఆర్ కొన్ని సందర్భాల్లో బాబును కలిసిన సన్నివేశం పరిశీలిస్తే ఆయన బాబుకు మునుపటి గౌరవం ఇస్తున్నట్లే కనిపిస్తుంటుంది. తానూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న గర్వం లేకుండా, బాబుకు ఒంగి అభివాదం చెప్పే దృశ్యాలు చూశాం. అటు బాబు కూడా కేసీఆర్‌తో మునుపటి మాదిరిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. తనకంటే రాజకీయానుభవం తక్కువే అయినప్పటికీ, ప్రధాని మోదీ విశాఖ హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు బాబు ఆయనకు సగానికి వంగి అభివాదం చేశారు. కేసీఆర్ అయితే ప్రణబ్‌ముఖర్జీ, నరసింహన్ కాళ్లకు ప్రణమిల్లారు. ఇవన్నీ వారి వారి సంస్కారానికి నిదర్శనాలు. పులిచింతల నిండిపోతున్న సందర్భంలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని ఏపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావుకు ఫోన్ చేసి చెప్పడం, అందుకు ఆయన కూడా కృతజ్ఞత చెప్పడం హుందాతనంగా అనిపించింది.
మరి ఇంత హుందాతనం, సంస్కారం ప్రదర్శించే వీరి మధ్య పరిపాలనాపరంగా ఉన్న సమస్యలను వేరొకరు పరిష్కరించడం, ఆ పరిష్కారానికి హస్తిన వరకూ వెళ్లి, మరొకరి తీర్పు కోసం వేచి చూడటం ఎందుకన్నది తెలుగువారి ప్రశ్న. నిజంగా ఇది ఆలోచింపతగినదే. ఇది ఒకరకంగా ఇద్దరి జుట్టు తమంతట తాము ఇతరులకు అప్పగించడం లాంటిదే. విజ్ఞులిద్దరూ దీనిని గ్రహించాలి.
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నది నీటి తగాదానే. తెలంగాణలో నీరున్నా కరెంటు లేదు. ఆంధ్రలో ఇప్పుడు కరెంటు సమస్య కూడా తీరింది. ఒకరి అవసరాలకు మరొకరు నీరు విడుదల చేసుకునే యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకుని, తనిఖీలకు అటు ఇటు అధికారులను నియమించుకుంటే సగం సమస్య పరిష్కారమయినట్లే. కానీ ఈ ఆలోచన ఢిల్లీకి వెళ్లి కేంద్రం చెబితే తప్ప తెలుసుకోలేకపోవడం విస్మయం కలిగించేదే. బాబు-కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై సగటు తెలుగువాడి మనోగతం కూడా ఇదే. రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు కలిసే ఉంటున్నారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లో ఉన్న లక్షలాదిమంది సీమాంధ్రులు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతారన్న విభజన తొలినాటి ప్రచారంలో పసలేదని తేలిపోయింది. ఇప్పటికీ ఉపాథి, విద్య, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారంటే, ప్రజలు కలసి ఉంటున్నారన్నది స్పష్టమవుతూనే ఉంది.
అసలు రెండు రాష్ట్రాలు నీటి కోసం కాట్లాడుకుని, వ్యవహారం ఢిల్లీ గడప తొక్కేవరకూ జమిలి గవర్నరు గారు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. ఇద్దరి మధ్య పదేళ్లు కొనసాగే చిన్న చిన్న గొడవలు, సాంకేతిక, పరిపాలనాపరమైన పంచాయతీలు తీర్చాలనే కదా ఆయనను రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పెట్టింది? కానీ దురదృష్టవశాత్తూ తిరుపతికి వెళ్లడం, నగరంలో గుళ్లకు తిరగడం, రాజ్‌భవన్‌లో విందులు, హోళీ సమయంలో రం గులు చల్లుకోవడంలో చూపే శ్రద్ధ, సమయంలో పదో శాతం రెండు రాష్ట్రాల పంచాయితీలను తీర్చడానికి వినియోగిస్తే, ఇద్దరు చంద్రులూ ఢిల్లీ గడప తొక్కేవారు కదా?!
అంటే ప్రతి తగవుకూ ఢిల్లీనే వేదిక అవుతుంటే ఇక గవర్నరు గారికి ఇక్కడ పెద్దగా పనిలేనట్లే కదా? విభజనకు ముందు జరిగిన తతంగమంతా చిదంబరం కనుసన్నలలో, కేసీఆర్ సహ దర్శకత్వంలో, గవర్నరుగారి యాక్షన్‌లో జరిగిందే కాబట్టి సమస్యకు మూలమేమిటో ఆయనకు తెలియనిది కాదు కదా? మరి ఆ మేరకు సమస్య పరిష్కరించకుండా, ఫలితాన్ని దేవుడికి, పనిని కేంద్రానికి అప్పగిస్తే ఇక గవర్నరు గారు ఉండి ఏం ప్రయోజనమన్నది జనం నుంచి వినిపిస్తున్న ప్రశ్న. నిజానికి కేంద్రం ఇచ్చిన సలహా గవర్నరు కూడా ఇద్దరినీ పిలిచి చెప్పవచ్చు. ఇంతోటిదానికి ఇద్దరు చంద్రులు ఢిల్లీ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఇద్దరు చంద్రుల ఢిల్లీ పర్యటన మీడియాలో వచ్చినంత ఆందోళనకరంగా లేకపోవడం, కేంద్రం సూచనలను మన్నించడం శుభ పరిణామం. అయితే, ఇకనయినా ఇద్దరూ తమ జుట్టు ఇంకొకరి చేతికి ఇవ్వకుండా, సాధ్యమయినంత వరకూ సామరస్యంగా పరిష్కరించుకుంటే తెలుగుజాతి పరువు నిలిపినవారవుతారు.
* * *
తెలంగాణలో కమలదళాలకు కొంచెం ధైర్యం వచ్చినట్లే. రెండున్నరేళ్లు అసలు తాము ఏ పక్షమో తెలియనంత గందరగోళంలో ఉన్న భాజపేయులకు, అమిత్‌షా వచ్చిన తర్వాతగానీ తామేమిటో తెలియలేదు పాపం. అప్పటివరకూ కేసీఆర్ సర్కారును విమర్శించాలో, వద్దో కూడా తెలియదు. కొంతమంది కేసీఆర్‌ను వ్యక్తిగతంగా పొగిడేవారు. మరికొంతమంది విమర్శించేవారు. ఒక ఎమ్మెల్యే అయితే, కేసీఆర్ అభివన దానకర్ణుడని పొగిడిన సందర్భం కూడా లేకపోలేదు. ఒకవైపు మోదీజీ తెలంగాణలో కేసీఆర్ బ్రహ్మాండంగా పాలిస్తున్నారని, ఆయనని చూసి నేర్చుకోవాలని చెబుతుంటే, కింద ఉండి కత్తులు పట్టుకున్న కమల సైనికుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? కేంద్రం మీకు దూరం కాదు. హైదరాబాద్ ఎంతో మీకు ఢిల్లీ కూడా అంతేనని మోదీ అంతటివాడు చెప్పిన తర్వాత భాజపా నేతలు సర్కారుపై ఎత్తిన కత్తి దూయాలా? దించాలా?
సరే రెండున్నరేళ్ల తర్వాతయినా నాయకత్వం కళ్లు తెరచి, సర్కారుపై తానే యుద్ధం ప్రారంభించింది. అమిత్‌షా కూడా బరిలోకి దిగి, ఇదీ మన పాలసీ అని చెప్పి వెళ్లిన తర్వాత వరకూ కమలంలో కదనోత్సాహం చెక్కుచెదరలేదు. కానీ తెలంగాణలో పార్టీకి పెద్ద దిక్కయిన దత్తన్నతో కేసీఆర్ చర్చల సారాంశం మీడియాకు పొక్కిన తర్వాత మళ్లీ గందరగోళం మొదలు! తెలంగాణకు దత్తనే్న పెద్ద దిక్కుగా ఉంటారని, ఇకపై ఎంపీలు కేంద్రమంత్రులతో ఏం పని ఉన్నా పెద్ద దిక్కును వెంట తీసుకువెళ్లాలని ఎంపీల సమక్షంలో ఆదేశించడం, అందుకు దత్తన్న కూడా బహు సంబరపడి.. దానికేముంది? రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి, కేంద్రానికి, పార్టీకి మీరంటే ప్రత్యేక గౌరవాభిమానాలున్నాయని సెలవివ్వడం చకచకా జరిగిపోయాయి. గతంలో అదే శ్రమశక్తి భవన్‌కు వచ్చిన కేసీఆర్‌ను తన చాంబరుకు రావాలని దత్తన్న కోరినా, తర్వాత చూద్దాంలే అంటూ అదే కేసీఆర్ వెళ్లిపోయారు. ఇప్పుడు స్వయంగా కేసీఆరే ఎంపీలను వెంటబెట్టుకుని తాను కాదన్న దత్తన్న చాంబరుకు వెళ్లి, ఆయనను తెలంగాణకు పెద్దన్నగా కితాబు ఇచ్చారు. కేసీఆర్‌ను అంచనా వేయడం బహుశా కేసీఆర్‌కూ కష్టమేమో?
సరే దాన్నలా ఉంచితే, అమిత్‌షా తెరాసను ప్యామిలీ కంపెనీగా విమర్శించిన తర్వాత, హరీష్‌రావు దత్తన్నను మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు. అదేరోజు హరీష్, అమిత్‌షా మీద విమర్శల వర్షం కురిపించారు. విచిత్రంగా మీడియాలో దత్తన్నను హరీష్ సత్కరిస్తున్న వార్తతోపాటు, అమిత్‌షాపై చేసిన విమర్శలూ పక్కపక్కనే చోటుచేసుకున్నాయి. అంతకుముందు అదే దత్తన్న వరంగల్ సభలో అమిత్‌షా సమక్షంలోనే, కేసీఆర్ పతనం వరంగల్ నుంచే ప్రారంభమంటూ శపించడం మరో విశేషం. మరి ఇప్పుడు భాజపేయులు అమిత్‌షా చెప్పినట్లు కేసీఆర్ సర్కారుపై కత్తులు దూయా లా? లేక పెద్దన్న దత్తన్న దారిలో కత్తులు కిందపడేసి, కలసి నడవాలా?
* * *
హైదరాబాద్‌ను చూస్తే ఎవరికైనా గుండె చెరువువుతుంది. రాజధానిని విశ్వనగరంగా చేస్తామన్న కేటీఆర్ హామీలు భారీవర్షాల్లో కొట్టుకుపోయాయి. తెరాస అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిపోయింది. ఇంకా రాజధాని వైఫల్యానికి గత పాలకులను విమర్శించడం అవివేకం. వారు ఏమీ చేయలేదన్న అసంతృప్తే కదా తెరాసను గెలిపించింది? స్వయంగా కేటీఆర్ తనిఖీ చేసి వచ్చిన రోడ్లకే దిక్కులేకపోతే ఇక మామూలు మంత్రులు, ఎమ్మెల్యేలు చెబితే పట్టించుకునేదెవరు? భారీ వర్షాలు జనజీవనానికి కన్నీళ్లు తెప్పిస్తుంటే, ఆదుకోవలసిన పాలకులు అర్ధరాత్రి వరకూ తాము మేల్కొనే ఉన్నామని చెబితే దానివల్ల ఏమిటి ప్రయోజనం? రెండున్నరేళ్ల నుంచి ప్రత్యామ్నాయం చూపకుండా నిద్ర పోయి, ఇప్పుడు 24 సెంటీమీటర్ల వర్షం వచ్చినప్పుడు సురక్షితమైన కంట్రోల్‌రూములో మేల్కొని కూర్చుంటే వచ్చే ఫలితమేమిటి? ఇవన్నీ గవర్నెన్సు లేదన్న విమర్శలను నిజం చేయడమే కదా?!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144