డైలీ సీరియల్

కొత్త స్నేహితులు ( కొత్త సీరియల్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామ్రాట్ బట్టలు మార్చుకుని కాళ్లూ, చేతులూ కడుక్కుంటోండగా భోజనాల బల్లమీద గినె్నలు సర్దుతోన్న అలికిడి అయింది. అయిదు నిముషాల తర్వాత ఆముదం త్రాగబోతున్నవాడి మొహంతో అతడూ, ముష్టివాడికి కబళం వేసే వాలకంతో ఆమె, ఎదురెదురుగా కూర్చున్నాక అందామె, ‘‘మరో నాల్రోజులుండలేకపోయారా!’’

సమాధానంగా మందహాసం చేశాడతడు. ‘‘నేనడిగిందానికి సమాధానం చెప్పకుండా ఆ వెర్రి నవ్వేమిటి?’’ అందామె గినె్నలోని గుత్తొంకాయ కూరని అతడి కంచంలోకి బదిలీ చేస్తూ.
ఈసారి ‘‘హి..హి..హి..’’ అన్నాడు సామ్రాట్.
‘‘అదిగో సరిగా సమాధానం చెప్పకుండా అలా వెకిలి నవ్వు నవ్వితేనే నాకు ఒళ్లు మండేది’’ అందామె.
సమాధానంగా మళ్లీ ‘‘హి..హి..’’ అన్నాడతడు.
గినె్నలోని అన్నాన్ని అతడి కంచంలోకి సరఫరా చేస్తూ, ‘‘ఇన్నాళ్లకిల్లు గుర్తొచ్చిందా?’’ అందామె తన గొంతుకు వెటకారాన్ని జత చేస్తూ.
అందుకు జవాబుగా అన్నంలో కూర కలుపుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని తింటూ ‘‘గుత్తొంకాయ కూర అద్భుతంగా ఉంది. వేడి చల్లారాక ముందే నువ్వూ ఆరగించు మరీ!’’ అన్నాడతడు లొట్టలువేస్తూ.
‘‘ననే్నం పొగిడి మునగచెట్టు ఎక్కించనక్కర్లేదు. రెండ్రోజుల్లో తిరిగొచ్చేస్తానని వెళ్లిన పెద్దమనిషి ఏకంగా వారం రోజులుండిపోవడానికి కారణవేమిటీ? అని అడుగుతున్నాను’’ అందామె కళ్లు పెద్దవి చేసి చూస్తూ.
భోజనం పూర్తయ్యేవరకూ అతడేం మాట్లాడలేదు. భోజనం ముగించాక, ‘‘నీకు తెలియందేవుంది సామూ.. వెధవుద్యోగం.. ఒక టైమా, పాడా? ఎంత పనిచేసినా ఇంకా ఎంతో కొంత మిగిలే వుంటుంది’’- ఎంగిలి కంచాన్ని సింక్‌లో పడేసి చేతులు కడుక్కుంటూ ఉన్నాడు సామ్రాట్.
‘‘మీకు చేతకాదని చెప్పండి. మీ కంపెనీలో అందరూ మీలానే రాత్రీ పగలూ పనిచేస్తూ ఇల్లు పట్టకుండా తిరుగుతున్నారా!?’’
నోటి దగ్గర చిటికెలు వేస్తూ గోడ గడియారం వైపు చూసి ‘‘నాకు నిద్రొస్తోంది. రేపుదయం మాట్లాడుకుందామా?’’ అని ఆమె సమాధానం కోసం ఎదుచూడకుండా పడక గదిలోకి నడిచాడు సామ్రాట్.
***
సామ్రాజ్ఞి పేరుకు
తగినట్టే చిన్నప్పటినుంచీ మహారాణిలా పెరిగింది. వారసత్వంగా సంక్రమించిన లక్షణాలవల్లో లేక పెంపకంవల్ల అలవాటైన గుణాలవల్లో ఆ ఏటికాయేడు వయసుతోపాటు ఆమెలో పెంకితనమూ పెరుగుతూ వచ్చింది. ఆమెకు ఊహ తెలిసినప్పటినుంచీ బట్టలూ, నగలూ తదితర భౌతికమైన వస్తువులే తప్ప స్నేహితులంటూ ఎవరూ ఆమెకు దగ్గర కాలేకపోయారు.
అరకొర మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తన ఈడు ఆడపిల్లల్లానే మొగుడి కోసం ఎదురుచూస్తోంగా- సామ్రాట్ ఓ చేత్తో బ్యాగూ, మరోచేత్తో సూట్‌కేసూతో వాళ్ల పక్కింట్లో అద్దెకు దిగాడు. అతడికి పీజీ డిగ్రీ ఉంది. ఆ డిగ్రీ తెచ్చిపెట్టిన అప్పూ, పుట్టిన ఊళ్ళో ఓ పాడుపడిపోయిన కొంపా, ఆ కొంపలో కొడుకుమీద కొండంత ఆశ పెట్టుకుని జీవిస్తోన్న తల్లీ ఉన్నారు.
యూనివర్సిటీ వారిచ్చిన గోల్డ్‌మెడల్‌ను మర్నాడే అమ్మేసి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అనుభవం కూడా వుంది అతడికి. పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించి విసిగిపోయి ఉన్న అతడు.. ‘స్వయంగా నగరంలో మకాం పెట్టి చిన్నదో, చితకదో ఉద్యోగం వెదుక్కుంటే మేలు’ అని ఓ శ్రేయోభిలాషి సలహానీయగా.. తల్లి గాజులమ్మి ఆ డబ్బుతో నగరంలోకి అడుగుపెట్టాడు.
అతడా ఇంట్లోకి ప్రవేశిస్తోండగా అతడిని తొలిసారి చూసిన వ్యక్తి- సామ్రాజ్ఞి తల్లి. ఆమె కళ్లు చాలా చురుకైనవి. ఆమె కళ్లకంటే మెదడు మరింత చురుకైనది.
అతడా ఇంట్లోకి ప్రవేశించిన అరగంటలోగా అతడి బయోడేటా మొత్తం సేకరించిందామె. మరో మూడు నెలల్లో అతడి ప్రవర్తన, మనస్తత్వం వగైరాల గురించి పూర్తి అవగాహనకు వచ్చేసిందామె.

-ఇంకాఉంది

సీతాసత్య