డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య వైపు అమాయకురాలిని చూసినట్టుగా చూసి, ‘‘్భలేవారే.. ‘ఇంట్లో బుద్ధిమంతుడు- వీధిలో బడాచోర్’ సీరియల్‌లో పెళ్లాం దగ్గర ప్రేమ ఒలకబోసే మగాడి అసలు రూపం ఎలా బయటపెట్టాలో వివరంగా చూపించడం లేదూ?!
‘సింగినాదం-జీలకర్ర’ సీరియల్‌లో పెళ్లాన్ని పుట్టింటికి పంపించి ఎవరో వగలాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే మగాడి గుట్టు ఎలా రట్టయిందో స్పష్టంగా చూపించలేదూ?
ఒక రకంగా చెప్పాలంటే మహిళా సంఘాలవాళ్లకంటే.. ఆడవాళ్లు తలచుకోవాలేగానీ మగాళ్లను మూడు చెరువుల నీళ్లెలా తాగించగలరో వివరంగా చూపిస్తోన్న సీరియల్స్ వల్లే నిజంగా స్ర్తిలకు తమ హక్కులేవిటో తెలిసొస్తున్నాయి. అందుకే అటువంటి సీరియల్స్ ఉంటే నాకు ఇష్టం.
మీవారిని కొంగున కట్టేసుకోవాలంటే మీరూ ప్రయత్నించి చూడండి’’ అది సామ్రాజ్ఞి.
సాహిత్యకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు సామ్రాజ్ఞి విశే్లషణ విన్న తర్వాత. మరి కాసేపు ఆమెతో మాట్లాడితే తన భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయం వేసింది సాహిత్యకు.
‘‘మీరు టీవీ చూస్తోండండి, కాఫీ తెస్తాను’’ అని అక్కడినుంచి లేచి వంటింటి వైపు అడుగులు వేసింది సాహిత్య.
సామ్రాజ్ఞి మొగుడంత దురదృష్టవంతుడు ప్రపంచంలో మరొకడుండడేమో అనిపించిందామెకు.
అత్తాకోడళ్ళ కీచులాటలు, మొగుడూ పెళ్లాల తగువులు, అక్రమ సంబంధాలు, ఆస్తితగవులు ఇత్యాది విషయాల చుట్టూ అల్లబడి మనుషుల్లోని రాగ ద్వేషాల్ని మరింతగా పెంచి పోషించే ఎక్కువ శాతం సీరియల్స్ అంటే అమితంగా ఏవగించుకునే సాహిత్యకు సామ్రాజ్ఞి ధోరణి చాలా ఇబ్బంది కరంగా అనిపించింది.
ఇహముందు ఈవిడతో జాగ్రత్తగా ఉండడమే కాకుండా వీలైనంత వరకూ ఆమెకు దూరంగా ఉండడం మంచిదనిపించింది సాహిత్యకు.
ఈరోజు సామ్రాట్ పాపం ఎంత నిరాశపడి ఉంటాడో అనిపించి ఒక్క క్షణం మనసంతా ఎంతో దిగులుగా ఏదో కోల్పోయినట్టుగా అనిపించిందామెకు.
సామ్రాట్‌తో పరిచయమైనప్పటినుంచీ ఒంటరితనమంటే ఏవిటో మరచిపోయిందామె. ఏ విషయాన్ని గురించి తామిద్దరిమధ్య చర్చ జరిగినా దాన్నింకా కొనసాగించాలనే అనిపిస్తూంటుంది ఇద్దరికీ కూడా.
అటువంటిదీరోజు సామ్రాజ్ఞి ఇంటికి వస్తానంటే అంగీకరించి పొరపాటు చేశానా? అనిపించిందామెకు. కాఫీతోపాటు సాహిత్య ఆలోచనలు కూడా మరగసాగాయి.
సాహిత్య అందించిన కాఫీ కప్పునందుకుని ఓ గుక్క త్రాగి అంది సామ్రాజ్ఞి ‘‘నాకు ఇంత రుచిగా కాఫీ ఎలా తయారుచేయాలో చెప్పరూ? మావారికి కాఫీ అంటే ప్రాణం. ఆయనకు నచ్చినట్టు కాఫీ తయారుచేయడం నాకు చేతకావడంలేదు ఎంత ప్రయత్నించినా.
మీ చేతి కాఫీ త్రాగాక, మావార్ని ఎప్పుడూ పొరపాటున కూడా మీ ఇంటికి రానివ్వకూడదనిపిస్తోంది నాకు. మీ చేతి కాఫీ మావారొక్కసారి రుచి చూస్తే ఇక మిమ్మల్ని వదిలిపెట్టరు’’ అంది సామ్రాజ్ఞి.
ఆమె మాటల్లో ధ్వనించిన అపసవ్యతకు ఉలిక్కిపడి అంది సాహిత్య, ‘‘అవునూ మీ వారి పేరేమిటో చెప్పారు కాదు’’
‘‘మా జంట ఒకరికోసం మరొకరన్నట్టుగా ఉండకపోయినా మా పేర్లు విన్నవారికెవరికైనా మిమ్మల్ని ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనాలని ఉంటుంది తప్పకుండా. ఊహించగలరా ఆయన పేరేమిటో!?’’ అంది సామ్రాజ్ఞి.
‘‘చక్రవర్తా..?’’
‘‘ఊహూ..’’
‘‘రాజా..?’’
‘‘ఊహూ...’’
‘‘రారాజూ..?’’
‘‘ఊహూ..’’
‘‘ఇక నేను చెప్పలేను. నా చిన్న బుర్రకింతకంటే ఏవీ తట్టడంలేదు. మీరే చెప్పేయండి’’ అంది సాహిత్య అనాసక్తిగా.
‘‘సరే.. అయితే.. తీరా చెప్పేశాక ‘అరెరే ఇది నాకు తెలిసిన పేరే!?’ అనరు కదా?’’ అంది సామ్రాజ్ఞి నవ్వుతూ.
‘‘ఉహూ.. అనను, చెప్పండి’’
‘‘సా..మ్రా..ట్..’’ అంది సామ్రాజ్ఞి.
‘‘అరెరే ఈ పేరు నాకు తెలియకపోవడమేమిటి?’’ అని అప్రయత్నంగా అనబోయి ఆగిపోయింది సాహిత్య.
మరుక్షణంలో సామ్రాట్ పట్ల జాలీ, సామ్రాజ్ఞి మీద అసూయా ఏకకాలంలో కలిగాయి సాహిత్యకు.
****
‘‘ఈ రోజు ఆఫీసులో పని చాలా ఎక్కువగా ఉందనుకుంటాను, బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. మీకిష్టమని మిరపకాయ బజ్జీలు చేశానివ్వాళ. మీ కోసం చూసి చూసి నా మెదడు వేడెక్కిపోయింది. అవేమో చల్లారిపోయాయి’’.
ఆఫీసు నుంచి వచ్చి బట్టలు మార్చుకుందుకు లోపలి గదిలోకి నడిచిన సామ్రాట్ వెనుకే నడుస్తూ అంది సామ్రాజ్ఞి.
‘‘చాలా థాంక్స్ సామూ.. నీలా భర్త కష్టాన్ని వేయికళ్లతో కనిపెట్టి చూసే భార్యలెంతమందుంటారు చెప్పు!’’ అంటూ స్నానాల గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు సామ్రాట్.
అతను స్నానం ముగించుకుని తాజాగా తయారై వచ్చేసరికి భోజనాల బల్లమీద వెండి పెళ్లమూ, దాంట్లో మిరపకాయ బజ్జీలూ నోరూరిస్తూ కనిపించగానే కుర్చీలో కూర్చుని ప్లేటు ముందుకు లాక్కుని, ఉన్నవాటిలో కాస్త పొడవుగా కనిపిస్తోన్న మిరపకాయ బజ్జీనొకదాన్నందుకుని కొరికాడు.
అతడి కదలికల్ని చురుగ్గా గమనిస్తోన్న సామ్రాజ్ఞి అతడికెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ ‘‘ఈమధ్య మీ ఆఫీస్ పని అవుట్‌డోర్‌కి కూడా మారినట్టుందీ?!’’ అంది ఎటువంటి భావాన్నీ మొహంలో ప్రదర్శించకుండా.
బజ్జీలోని కారపు ఘాటుకంటే సామ్రాజ్ఞి మాటల్లోని శే్లషే ముందుగా అతడి మెదడుకు చేరడంతో ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు సామ్రాట్.

-ఇంకా ఉంది

సీతాసత్య