రాష్ట్రీయం

సమన్వయమే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనం నిర్మూలనకే పెద్ద నోట్ల రద్దు ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరు
పోలీసు వ్యవస్థలో పారదర్శకత ఉండాలి టెక్నాలజీతో జాతివిద్రోహులపై ఉక్కుపాదం
డిజిపిల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ పిలుపు

హైదరాబాద్, నవంబర్ 25: దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిస్ధాయిలో నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు ఉమ్మడిగా, సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశంలో అంతర్గత భద్రత పటిషంగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పనిచేయాలని, వ్యవస్ధీకృత నేరాలు, నకిలీ కరెన్సీ నోట్ల చలామణి, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం పీచమణచాలంటే ప్రజల సహకారం అవసరమని గుర్తించాలని సూచించారు. నల్లధనం నిర్మూలనలో భాగంగానే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని, కేంద్రం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయానికి ప్రజల నుంచి మద్దతు ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, నకిలీ కరెన్సీతో జాతి విద్రోహ శక్తుల నడ్డివిరిచినట్లయిందన్నారు.
శుక్రవారం ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమిలో 3 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్ధాయి 51వ డిజిపి, ఐజిపిల సదస్సు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు ఉగ్రవాదం నుంచి రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు పోలీసులు రాజీలేని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. శాంతి భద్రతలు కేవలం ఒక్క రాష్ట్రం వల్లనే సాధ్యమయ్యే పనికాదని, దేశంలోని వివిధ రాష్ట్రాలు జాతీయ స్ధాయిలో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నిన ఐఎస్‌ఐఎస్ కుట్రలను నిఘా విభాగం పోలీసులు తిప్పిగొట్టారని, వీరు ఇచ్చిన అమూల్యమైన సమాచారంతో ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేస్తున్నామన్నారు. పోలీసులు తమ రాష్ట్రంలో నేరస్తుల కదలికలపై సేకరించిన కీలకమైన సమాచారాన్ని తమవద్దనే ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు సమాచారాన్ని ఇవ్వడం వల్ల నేరస్తులను సులువుగా పసిగట్టి అరెస్టు చేయవచ్చన్నారు. పోలీసు శాఖలో దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్, ప్రాసిక్యూషన్ విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే కోర్టు ఎదుట నేరస్తులను దోషిగా నిరూపించగలమన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సరిహద్దురాష్ట్రాల్లో మొన్నటి వరకు ఉన్న అశాంతి, అలజడి తగ్గిందన్నారు. డిజిటల్ ఎకానమీ విస్తరిస్తోందని, దీని వల్ల నకిలీ కరెన్సీకి అడ్డుకట్టవేయవచ్చన్నారు. ఒక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలే కీలకమని, ఇవి లేని పక్షంలో అశాంతి రాజ్యమేలుతుందని, పెట్టుబడులు రావన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉత్తమ పోలీసింగ్ విధానాలకు అన్వయించుకుని అమలు చేయాలన్నారు. జమ్ముకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, దండకారణ్యంలో వామపక్ష తీవ్రవాదంపై పోరాడేందుకు కేవలం ఆయుధాలు సరిపోవని, పటిష్టమైన నిఘా, ఆధునిక టెక్నాలజీ అవసరమన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల డిజిపిలు ఈ విషయమై దృష్టిని సారించాలన్నారు. ఆర్ధిక నేరాలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు అవసరమన్నారు. పోలీసు వ్యవస్ధలో పారదర్శకత రావాలన్నారు. పోలీసులు ప్రజలకు ఎంత సన్నిహితంగా ఉంటే అంత విలువైన సమాచారం వస్తుందన్నారు. గత ఏడాది డిజిపిల సదస్సు గౌహతిలో నిర్వహించామని, ఆ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిరిణ్ రిజ్జు, హన్సరాజ్ గంగారామ్ ఆహిర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిశ్రీ, నేషనల్ పోలీసు అకాడమి డైరెక్టర్ అరుణ బి బహుగుణ, వివిధ పోలీసు బలగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించిన హోంశాఖ ఉన్నతాధికారులు, నిఘావిభాగం అధికారులకు ఇండియన్ పోలీసు పతకాలను హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రదానం చేశారు. తొలుత అకాడమిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్ర మంత్రులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

చిత్రం... ఎయర్‌పోర్ట్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర హోంమంత్రి నాయని