పర్యాటకం

శారదా స్వరూపులు.. శ్రీ భారతీతీర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఆదిశంకరులు అద్వైత మత వ్యాప్తికోసం దేశం నలుదిక్కులా ప్రతిష్టించిన చతురామ్నాయ పీఠాలలో శ్రీ శృంగేరీ శారదా పీఠం ప్రముఖమైంది. ఆచార్యులవారు తమ ముఖ్య శిష్యులలో ఒకరైన శ్రీ సురేశ్వరాచార్యులవారిని ప్రప్రథమ పీఠాధిపతిగా నియుక్తుల్ని చేసారు. శ్రీసురేశ్వరాచార్యులు సాక్షాత్తు బ్రహ్మ అంశతో జన్మించారు. స్కందావతారుడైన కుమారిలభట్టు శిష్యులలో అగ్రగణ్యుడు. శాపవశాన సరస్వతీదేవి మానవలోకంలో జన్మించి మండన మిశ్రుని పరిణయమాడింది. వైదిక కర్మకాండ విశిష్టతను ప్రచారం చేస్తూ ఒకానొక సందర్భంలో ఆదిశంకరుల అద్వైత వాదాన్ని ఎదుర్కొని ఓటమి పాలయ్యారు. స్పర్ధకు ముందు ఏర్పరుచుకున్న నిర్ణయానుసారం మండవ మిశ్రుడు సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే సన్యాస నామం స్వీకరించి, శంకరాచార్యుల వారిచే శృంగేరీ శారదా పీఠానికి తొలి పీఠాధిపతులుగా నియుక్తులయ్యారు. శ్రీ సరస్వతీదేవి శ్రీ శంకరుల ప్రార్ధన మేరకు శ్రీ శారదా మాతగా అచ్చట కొలువుతీరారు.
దక్షిణామ్నాయ పీఠాధిపతుల పరంపరలో శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధస్వామివారు 36వ శ్రీ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులుగా 19-10-1989న పట్ట్భిషిక్తులయ్యారు.
శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు ఆంధ్రదేశంలో జన్మించి పీఠాధిపత్యం వహించడం తెలుగు వారందరికీ ఆనంద దాయకమే కాక గర్వకారణం. దక్షిణామ్నాయ పీఠం దక్షిణాన వున్న ఆంధ్ర, తెలంగాణ, తమిళ, కర్నాటక, కేరళ ప్రాంతాలు ఈ పీఠం అధీనంలో వుంటూ అద్వైత సిద్ధికి ప్రాచుర్యం కల్పిస్తూ సనాతన ధర్మానికి, వేద సంస్కృత సంప్రదాయానికీ రక్షణగా నిలుస్తుంది.
శ్రీ శంకర భగవత్పాదులు తమ భాష్యాలను శిష్యులకు అధ్యాపనం చేస్తూ తన యాత్రలో భాగంగా తుంగా నదీ తీరంలో వున్న ఋష్యశృంగాశ్రమ ప్రాంతానికి రావడం తటస్థించింది. అక్కడ ఆయన మహదాశ్చర్యకరమైన దృశ్యం అవలోకించారు.
ప్రసవ సమయంలో వున్న కప్పకు ఎండవేడి తగలకుండా ఒక నాగసర్పం పడగవిప్పి నీడను సమకూర్చడం, వైరుధ్యం గల ప్రాణులు అలా ప్రవర్తించడం క్షేత్ర ప్రభావమేనని గుర్తించిన ఆచార్యులవారు అక్కడే దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాన్ని ప్రతిష్ఠించి శారదదేవిని నెలకొల్పారు. ఆ పీఠం పరంపరలోని వారే శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థస్వామివారు.నడిచే శారదామూర్తిగా కీర్తికన్న స్వామివారి జీవితాన్ని సంక్షిప్తంగా ముచ్చటించుకుందాం.
ఆంధ్రప్రదేశ్ గుంటూరుజిల్లా పలనాడు తాలూకా అలుగుమల్లెపాడు అగ్రహారంలో వుంటున్న తంగిరాల వేంకటావధాని, అనంతలక్ష్మి దంపతులకు ఇరువురు కుమార్తెల తరువాత పుత్రుడు జన్మించాడు. అవధానిగారు ప రమ సాత్వికులు, షట్కర్మ నిరతులు. శ్రీరామానుగ్రహంతో జన్మించిన కుమారునికి (11-4-1951) సీతారామాంజనేయులు అని నామకరణం చేసారు.
అవధానిగారు తమ కుటుంబాన్ని నరసారావుపేటకు తరలించారు. బాల్యంనుంచి బాలుడు శివభక్తియుతుడై వుండేవాడు. అక్కడే శ్రీ ప్రతాపగిరి శివరామశాస్ర్తీగారివద్ద సీతారామాంజనేయులు ప్రాథమిక విద్యనభ్యసించారు. బాల్యంలోనే పండితులైన గురువులవద్ద ఏకసంధాగ్రాహియైన బాలుడు అల్ప కాలంలోనే అనల్ప సంస్కృత భాషా సాహిత్యాలను ఔపోసనం పట్టాడు. వారి శక్తి ఎంతటిదంటే 1960లో అమరావతి క్షేత్రంలో శ్రీ నారాయణ భట్ల కృష్ణమూర్తి శాస్ర్తీగారు కాశీనుండి పండితులతోపాటు ఆంధ్రదేశములో సంస్కృత పండితులను రావించి భాగవత సప్తాహమును నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గోడానికి వచ్చిన తండ్రితోపాటు తొమ్మిదేండ్ల వయసున్న సీతారామాంజనేయులు భాగవతంపై అనర్గళంగా సంస్కృతంలో ప్రసంగించిన బాలుడ్ని చూసి అందరు ఆశ్చర్యచకితులయ్యారు.
ఒకవంక నరసారావుపేట హైస్కూలులో విద్యాభ్యాసం చేస్తూనే వేరొకవంక తండ్రివద్ద వేదాధ్యయనం, శాస్ర్తీగారివద్ద సంస్కృత సాహిత్య వ్యాకరణాలను అధ్యయనం చేసేవారు. ఆ వయసులోనే సంస్కృతంలో అశువుగా శ్లోకాలను చెప్పడమే కాక చిన్న చిన్న స్తోత్రాలను రచించారట.
1961లో శృంగేరీ జగద్గురువులు శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామి వారు విజయవాడ వచ్చిన సందర్భంలో పదకొండేళ్ల వయసులో బ్రహ్మచారి సీతారామంజనేయులు స్వామివారిని దర్శించి, సంస్కృతంలో సంభాషించిన సందర్భంలో జగద్గురువులు అబ్బురపడి పట్టువస్త్రంతో అభినందించారు. అపుడే జగద్గురువుల దృష్టి వీరిపై పడింది. తదుపరి ఐదు సంవత్సరాలలో జగద్గురువులను సందర్శించే భాగ్యం దక్కించుకున్నారు. జగద్గురువులే తన జీవితాన్ని ఉద్దరిస్తారని విద్యా ప్రదాతలవుతారన్న నిశ్చయానికి వచ్చారు.
ఒకసారి జగద్గురువులు ఉజ్జయిని క్షేత్రంలో చాతుర్మాస్యం గడపడానికి వస్తున్నారని తెలుసుకున్న స్థానిక విద్యారణ్య స్వామివారు ఉజ్జయిని వెళ్లడానికి సంకల్పించారు. అప్పటికి సీతారామాంజనేయులుకు పదవ తరగతి పూర్తయింది. జగద్గురువుల వద్ద శాస్త్ధ్య్రాయనం చేయడానికి వీలుగా తనను కూడా తీసుకెళ్లమని విద్యారణ్య స్వామివారిని కోరడంతో అతని సమ్మతి లభించింది. ఇంటివద్ద చెప్పకుండనే ఉజ్జయిని వెళ్లారు.
గతంలో పరిచయం వుండడం చేత జగద్గురువులు ‘నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ అని ఆంజనేయుల్ని అడిగారు. ‘శ్రీచరణుల సన్నిధిలో శాస్త్ధ్య్రాయనం చేయాలన్న కోరికతో వచ్చాన’ని దృఢంగా సమాధానం ఇచ్చారు.
బాలుని సమాధానం విన్న జగద్గురువులు సంతోషించి ఆనాడే తర్క సంగ్రహ పాఠాన్ని ప్రారంభించారు. ఆ అధ్యాపన కాలంలో శ్రీ ఆదిశంకరాచార్యులవారికి శ్రీ తోటకాచార్యులవలె గురు శుశ్రూష చేస్తూనే అధ్యాపనం చేసారు.
ఒకటిన్నర సంవత్సరాల తర్వాత తమ గురువుతోపాటు ప్రప్రధమంగా శృంగేరీ వెళ్లారు. జగద్గురువులను సందర్శించుకుని ఆతని ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు. సీతారామాంజనేయులు నిరాటంకంగా విద్యాభ్యాసం చేయడానికి వీలుగా జగద్గురువులే అతన్ని స్వీయ పర్యవేక్షణలో వుంచుకుని తగిన బస ఏర్పాటు చేసారు. తాము స్వయంగా అధ్యాపనం చేయడమే కాక న్యాయశాస్త్ధ్య్రాయనానికి శ్రీ గొల్లపూడి గోపాల కృష్ణ శాస్ర్తీగారిని నియమించారు. సంవత్సర కాలంలోనే కృష్ణ యజుర్వేదం పూర్తి చేసారు. మహా మేధావి అయిన సీతారామాంజనేయులు పద వాక్య ప్రమాణ పారావార పారీణులయ్యారు. జ్యోతిష శాస్త్రంలో పాండిత్యం సంపాదించారు. గుర్వనుగ్రహం, శారదాంబానుగ్రహం వల్లనే ఇదంతా సాధ్యమైందని తరువాత కాలంలో ప్రసంగాలలో తన పూర్వ వృత్తాంతాన్ని చెప్పేవారని పెద్దలంటారు.
శ్రీ అభినవ విద్యా తీర్థ మహాస్వామివారు తమ శిష్యునిలో పీఠాధీశ్వరులు ఎట్లుండాలని ఆదేశించారో ఆ లక్షణాలన్నీ సీతారామాంజనేయులలో దర్శించారు. తనలో చాలా కాలంగా వున్న సంకల్పం సిద్ధించే తరుణం ఆసన్నమైందని ఆనందించారు.
‘‘ఉత్తరాధికారులైనప్పటినుంచి శ్రీ సన్నిధానం వారిని (సీతారామాంజనేయులు) మహా సన్నిధానం వారు ‘స్వాములూ’ అని సంబోధించేవారట.పుత్ర వాత్సల్యం కంటె అత్యధికమైన శిష్య వాత్సల్యం చూపుతుండేవారని నాటి పెద్దలు చెప్పేవారు.
శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి అపారమైన వేద శాస్త్ర పరిజ్ఞానంతోపాటు అద్భుతమైన కవితాపటిమ వుంది. స్వామివారు ఎన్నో అద్భుతమైన గద్య రచనతోపాటు స్తోత్రాలను రచించారు. శృంగేరీ పీఠాధీశ్వరుల వలెనే ఆ పీఠం యొక్క కీర్తి కిరణాలను నలుదెసలా వ్యాపింపచేస్తూ గత ఇరవై ఐదేళ్లుగా శ్రీ శృంగేరీ పీఠంపై ధ్వజాన్ని రెపరెపలాడిస్తున్న జగద్గురువులు సాక్షాచ్ఛంకరావతారులు. శారదా స్వరూపులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణాలకు నమస్సుమాంజలులు.

-ఎ.సీతారామారావు