ఈ వారం కథ

మాయ రోగం (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన
...............

అది ఒక హాస్పటల్. ఊరి మధ్యలో కొన్ని ఎకరాల స్థలంలో కట్టిన అందమైన బిల్డింగ్‌లతో హుందాగా ఉం టుంది. ముందు పెద్ద కాంపౌండ్ వాల్. అది అంటురోగాల హాస్పిటల్. ఊరి మధ్యలో అంత స్థలం ఉంటుందని ఎవరూ అనుకోరు. దాన్ని కట్టినపుడు అది ఊరి శివారులోనే ఉంది. కానీ, రాను రానూ ఊరు విస్తరించి అది ఓ సెంటర్ అయిపోయింది.
ఎత్తయన ప్రహరీ గోడ హాస్పటల్ నుంచి జనాన్ని విడదీస్తోంది. దాన్ని దాటి లోపలకు వెళ్ళాక ఒక బాట. బాటకి రెండువైపులా చిందర వందరగా పెరిగిన చెట్లు. అదే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయి ఉంటే అక్కడ ఎలాంటి అద్భుతమైన ఉద్యానవనం తీర్చిదిద్ది ఉండేవాళ్ళో. కానీ- ప్రభుత్వ ఆస్పత్రి కావటం వల్ల ఎవరూ పట్టించుకోని అనాథల్లా చెట్లు పిచ్చి పిచ్చిగా పెరిగాయి. అలా చాలా దూరం బాట వెంబడి వెళితే ఔట్ పేషెంట్ క్లినిక్, ఆ తర్వాత ఇంకా లోపలకు వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగులు.
పొద్దున్న పది గంటల ప్రాంతంలో ఒక పోలీసు వ్యాన్ ఆ హాస్పటల్‌లోకి ప్రవేశించింది. పేరుమోసిన క్రిమినల్ గంగారాంని పోలీసులు అక్కడికి తెచ్చారు.
‘‘అమ్మో.. ఎంత పెద్ద హాస్పటలో..?’’ అన్నాడు గంగారాం.
పోలీసులు సమాధానం చెప్పలేదు.
గంగారాంకి పది రోజుల నుంచి జ్వరం, జలుబూ, దగ్గూ వగైరా ఉన్నాయి. మామూలు హాస్పటల్‌లో వైద్యం చేయించారు. అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూ అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ హాస్పటల్‌లో స్వైన్‌ఫ్లూకి ఒక వార్డు ఉంది. అందులో చేర్పించాలని పోలీసులు అతడ్ని తీసుకుని వచ్చారు.
గంగారాంని హాస్పటల్‌కి తీసుకురాగానే చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత వార్డుకి తరలించారు. భయంకరమైన అంటువ్యాధి కాబట్టి ఎవరికీ ప్రవేశం లేదు. పోలీసులు కూడా వార్డు బయట బెంచీమీద మాస్క్‌లు ధరించి కూర్చోవలసిందే. గదిలోకి వెళ్లిన గంగారాంకి దానికన్నా తన జైలు గదే నయం అనిపించింది. జైల్లో అతనితోపాటు ఇంకో ఖైదీ కూడా ఉండేవాడు. పోలీసులు అటూ ఇటూ తిరుగుతూ కనిపించేవాళ్ళు. తలుపు తీసి బయటకు తీసుకెళ్ళి పని చేయించేవాళ్ళు. ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరూ కనిపించని ఏకాంతం. దీనికన్నా నరకం నయం అనిపించింది. ఇంతకీ ఏమైంది తనకు? సెక్యూరిటీని కూడా గాలికొదిలి, పోలీసులు తనకు దూరంగా బయట బెంచీమీద కూర్చున్నారు. డాక్టర్లూ, నర్సులూ, అటెండర్లూ అందరూ మాస్క్‌లు ధరించిగానీ తనను ముట్టుకోవటం లేదు. తనది అంత భయంకరమైన రోగమా? అసలు తను మళ్లీ భూమినీ, ఆకాశాన్నీ చూడగలడా? ఈ గదిలోనే తన జీవితం అంతం కాబోతోందా?
ఒక గంట గడిచినా ఎవరూ లోపలకు రాలేదు. డాక్టర్లు ఇందాక బయటే పరీక్షించి మందులన్నీ రాసేశారు. కాబట్టి సాయంత్రమో, రేప్పొద్దున్నో వస్తారు కాబోలు. కాలక్షేపానికి టీవీ, రేడియో లాంటివి ఏవీ లేవు. ఎందర్నో గడగడలాడించిన గంగారాంని ఈ గది గడగడలాడించేస్తోంది.
ప్రతి క్షణం ఒక యుగం, అట్లా చాలా యుగాలు గడిచిపోయాయి.
ఇంతలో తలుపు తెరుస్తున్న సవ్వడి. గంగారాం చాలా ఆతృతగా చూశాడు. మరో ప్రాణిని చూడాలన్న తపన.
తలుపు తెరచుకుంది. లావుపాటి స్ర్తి ఒకామె గది లోపలకు వచ్చింది. గదిని శుభ్రం చేసి, చెత్తబుట్టలో ఉన్నదాన్ని జాగ్రత్తగా ఒక కవర్లో వేసి పట్టుకుంది. ఆమె కూడా మాస్క్, గ్లౌవ్స్ ధరించింది. గంగారాం పలకరిస్తే పలకలేదు. ‘నోరు మూసుకుని పడుకో’ అన్నట్లు కళ్ళురిమి- ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది.
ఆ తర్వాత ఒక డాక్టరూ, ఒక అసిస్టెంటూ వచ్చారు. వాళ్ళూ ఏమీ మాట్లాడలేదు.
అట్లాగే రాత్రి అయిందని తెలిసింది గంగారాంకి. ఏడు గంటలకి భోజనం పెట్టారు.
గంగారాం నీరసంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఎనిమిది గంటల ప్రాంతంలో తలుపు మళ్ళా తెర్చుకుంది. తనతో ఎవరూ మాట్లాడరనీ, తన భయంకర రోగం దానికి కారణమనీ అర్థమైపోయిన గంగారాం కళ్ళు తెరిచే ప్రయత్నం కూడా చెయ్యలేదు.
రూమ్‌లోకి ఎవరో ప్రవేశించినట్లు మెత్తటి అడుగుల సవ్వడి. గంగారాం చేతిమీద ఎవరో సున్నితంగా తట్టారు.
కళ్ళు తెరిచి చూశాడు గంగారాం. తెల్లటి గౌను, నెత్తిన తెల్లటి టోపీ, తెల్లటి మేజోళ్ళు, తెల్లటి బూట్లతో శాంతిదూతలా ఒక నర్సు. ఆమె కళ్ళు- ప్రేమ, దయ, స్నేహం కురిపిస్తున్నాయి.
గంగారం అప్రయత్నంగా లేవబోయాడు. ఆమె అతనికి ఆసరా ఇచ్చి కూర్చోబెట్టింది. టెంపరేచర్ చూసి కేస్‌షీట్ ఒకసారి చదివింది. మాత్రలు తీసి ఇచ్చింది. మంచినీళ్ళు తాగించింది.
ఆమెకు ముప్ఫై ఏళ్ళ లోపే ఉంటుంది వయసు. ఆమె కన్నతల్లిలా ఆప్యాయంగా అన్నీ చేస్తుంటే గంగారాం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
‘‘బాధపడకు.. తగ్గిపోతుంది..’’ ఆమె మృదువుగా భుజం తట్టింది.
గంగారాం తల ఊపాడు.
‘‘నేను నైట్ డ్యూటీ నర్సుని’’ అంది ఆమె మృదువుగా.
‘‘మీ పేరేంటి?’’
‘‘కరుణ’’
మనిషికి తగ్గ పేరు అనుకున్నాడు గంగారాం.
‘‘హాయిగా నిద్రపో.. నీకేం ఫర్వాలేదు’’ అంది కరుణ.
‘‘మీరు కూడా హాయిగా నిద్రపోండి’’ అన్నాడు గంగారాం. ఆమె కిల కిలా నవ్వింది.
‘‘మేం నిద్రపోతే మా ఉద్యోగం ఊడిపోతుంది’’ అంది. నవ్వుతూనే తన ట్రే తీసుకుని, బయటకు వెళ్ళటానికి సిద్ధమైంది.
‘‘అపుడే వెళ్లిపోతున్నారా...?’’
‘‘మళ్ళీ వచ్చి చూస్తుంటాను’’ ఆమె అతని నుదుటిమీద చేయి రాసి వెళ్లిపోయింది.
ఆమె ఏం మందు ఇచ్చిందో, మంత్రమే వేసిందో గానీ- ఎన్నో రోజుల తర్వాత గంగారాంకి హాయిగా నిద్రపట్టింది.
***
చచ్చిపోతాడనుకుని హాస్పటల్‌కు తెచ్చిన గంగారాం చిత్రంగా కోలుకోవటం మొదలుపెట్టాడు. కరుణతో అతనికి మాటలు పెరిగాయి. అతను ఎందుకు క్రిమినల్‌గా మారిందీ ఆమె అడిగి తెలుసుకుంది. పేదరికం, సరైన శిక్షణ లేకపోవటం, నేరాలకి అలవాటు పడిపోవటం,

జైలు జీవితం, తన కష్టాలన్నీ అతను చెప్పుకునేవాడు.
ఆమె ఓదారుస్తూ మందులు వేసేది.
అతనికి పేపరు చదివేంత చదువు ఉంది. అవీ ఇవీ మాట్లాడుతుండేవాడు. వారం రోజుల్లో ఇద్దరూ మంచి మిత్రులయ్యారు.
ఆ రోజు రాత్రి ఆమె రావటం ఆలస్యమైంది. దాదాపు తొమ్మిది గంటలైంది. రోజూ ఎనిమిది గంటలకల్లా దేవకన్యలా ప్రత్యక్షమయ్యే కరుణ ఆరోజు తొమ్మిది దాటాక వచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చినట్లు ఎర్రబడి ఉన్నాయి. కళ్ళల్లో ఇంకా తడి.
‘‘ఏమైంది?’’ గంగారాం గాభరాగా అడిగాడు.
కరుణ మాట్లాడలేదు. కళ్ళల్లోంచి జల జలా నీళ్ళు కారాయి.
‘‘ఏమైంది? చెప్పు..’’ గంగారాం బతిమాలాక కరుణ మెల్లగా చెప్పింది. ఆ రోజు రాత్రి డ్యూటీకి వస్తోంది కరుణ. గేటు దాటి లోపలున్న రోడ్డుమీద నడుస్తూ ఉంది కరుణ. రాత్రి పూట చిమ్మ చీకటి. రోడ్డుకి రెండువైపులా గుబురుగా ఉన్న చెట్లు. నిర్మానుష్యంగా ఉన్న పరిసరాలు. ఇంతలో ఎవరో కరుణని గభాల్న చెయ్యి పట్టి లాగారు. గుబురులోకి ఈడ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు. కరుణకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ వ్యక్తి నిర్దయగా ఆమె దేహాన్ని కబళించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎట్లాగో ధైర్యం తెచ్చుకుని వెర్రికేకలు వేసింది. ఈ లోపల అదృష్టవశాత్తూ వాచ్‌మ్యాన్ పరుగెత్తుకుని వచ్చాడు. వాళ్ళ అరుపులు విని వార్డు దగ్గర నుంచి మరికొందరు వచ్చారు. వాడు పలాయనం చిత్తగించాడు. కరుణ ఏడుస్తూ నిలబడిపోయింది. ఎట్లాగో ధైర్యం కూడగట్టుకుని డ్యూటీలోకి ప్రవేశించింది.
‘‘ప్రతిరోజూ ఇదే భయం. కొన్నాళ్ళ క్రితం కూడా ఎవడో ఇట్లాగే చెయ్యబోయాడు. అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. నాకే కాదు, చాలామంది సిబ్బందికి ఈ అనుభవాలయ్యాయి. సిటీ మధ్యలో ఉన్నా గోడ చాటున ఏం ఉందో అవతలివాళ్ళకు తెలియదు. వార్డులు చాలా దూరం. ఈమధ్యలో నడవటం- నిజంగా రోజూ ముళ్ళమీద నడకే. ఎప్పుడు ఎవడేం చేస్తాడోనని అంతా బిక్కుబిక్కుమంటూ ఉంటాం. బతుకుతెరువుకి ఉద్యోగం చెయ్యక తప్పదు’’ కరుణ నిట్టూర్చింది.
‘‘ఇంతేనా... దీనికి ఏడుస్తున్నావా?’’ అన్నాడు గంగారాం అంతా విని తేలిగ్గా.
కరుణ నిరుత్తరు రాలైంది. అంతేలే.. గంగారాం కరుడుగట్టిన నేరస్థుడు. అతను అంతకన్నా ఏం అనగలడు? తనను తాను ఓదార్చుకుంది.
ఆమె ఇచ్చిన టాబ్లెట్ మింగి గంగారాం నిద్రలోకి జారుకున్నాడు.
****
గంగారాంకి పూర్తి ఆరోగ్యం చేకూరింది. మర్నాడు డిశ్చార్జ్ చేస్తామన్నారు.
ఆ రాత్రి కరుణకి డ్యూటీ లేదు. ఇంట్లోనే ఉండి హాయిగా నిద్రపోయింది. మర్నాడు కాఫీ తాగుతూ పేపర్ చదువుతోంది.
ఒక వార్త చదివి ఆమెకి మతిపోయినట్లయింది. రాత్రి హాస్పటల్‌లోని వార్డు నుంచి గంగారాం ఎట్లాగో తప్పించుకున్నాడు. అతను తప్పించుకున్నాడని కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. అక్కడ స్పెషల్ రూమ్‌లో ఒక పలుకుబడిగల పేషెంట్ ఉంది. ఆమెకి తోడుగా మరొక స్ర్తి ఉంది. ఆ స్ర్తి ఏదో పనిమీద రాత్రి ఎనిమిది గంటలకు బయటకు వెళ్ళే బాట మీద నడుస్తోంది. అంతే.. గంగారాం ఆమె మీద పడి, తన కబంధ హస్తాల్లో బంధించాడు. ఆమెని చెట్ల చాటుకి లాక్కెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆమె అరుపులకి వాచ్‌మెన్ ఇంకా కొందరు పరుగెత్తుకుని వచ్చారు. అంతా కలిసి గంగారాంని బంధించారు.
అసలే నేరస్థుడు. ఆపైన మానభంగం చేయబోయాడు. ఆ వార్త గుప్పుమనడంతో పేపర్ల వాళ్ళూ, ఛానెళ్ళ వాళ్ళూ వచ్చేశారు.
గబగబా టీవీ పెట్టింది కరుణ. గంగారాం గురించి వార్త లైవ్‌లో ప్రసారం అవుతోంది. ఆలా చానెల్స్‌లో దానిమీద చర్చా కార్యక్రమం పెట్టారు. మహిళా సంఘాల వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు.
‘‘అసలు ఆ ప్రదేశం ఎట్లా వుందో చూడండి. స్ర్తికి అస్సలు రక్షణ లేదు. చుట్టూ చెట్లు, చీకటి. లోపలకు వెళ్ళిందాకా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇట్లాంటివి ఇదివరకు కూడా జరిగాయని అక్కడి వాళ్ళు చెపుతున్నారు. అవి పునరావృతం కాకూడదు. అక్కడ సెక్యూరిటీని పెంచాలి. లైట్లు రాత్రంతా వెలుగుతుండాలి..’’ ఇంకా ఏమేం చెయ్యాలో మహిళా సంఘాల వాళ్ళు చెప్తున్నారు.
ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగడంతో అక్కడ అన్ని ఏర్పాట్లూ చేశారు.
కరుణ గంగారాంని చూడటానికి వెళ్లింది.
‘‘నిజం చెప్పు. ఎందుకు చేశావీ పని..?’’ అడిగింది.
‘‘నేను క్రిమినల్‌ని. నాకు ఇంకో నాలుగేళ్ళు శిక్ష పడినా, మరణశిక్ష పడినా ఒకటే. మీరంతా ఈ ఆస్పత్రిలో పనిచేయవలసినవాళ్ళు. రాత్రీ పగలూ తేడా లేకుండా డ్యూటీ చేసి, పేషెంట్లని కాపాడే చల్లని తల్లులు. మీకు రక్షణ ఉండాలి. అందుకే నాకు తోచిన మార్గంలో మీకు రక్షణ దొరికే దారి చూశాను. ఇంత గోల జరిగితే గానీ యంత్రాంగంలో కదలిక రాలేదు. ఇపుడు మీకు పూర్తి రక్షణ ఏర్పాట్లు జరిగేదాకా జనం వదిలిపెట్టరు.’’ అన్నాడు గంగారాం.
అతని కళ్లు పొడిగా ఉన్నాయి. కరడుగట్టిన నేరస్థుడిలో- స్ర్తి పట్ల ఎంత కరుణా? ఆమె కళ్ళు చెమర్చాయి.
‘‘ఈ రోజుల్లో ఆడవాళ్ళు రాత్రీ, పగలూ తేడా లేకుండా తిరగాల్సి వస్తోంది. ఆడవాళ్ళను చూస్తే మగవాడికి మాయరోగం పుడుతోంది. ఆ మాయరోగాన్ని నిర్మూలిస్తేగానీ సమాజం బాగుపడదు’’ అన్నాడు గంగారాం.
కరుణ కళ్ళల్లో నీరు బుగ్గలమీదికి జారింది.
చేతులు జోడించి గంగారాంకి నమస్కరించింది.

*

రచయత్రి సెల్ నెం: 939 111 6702