ఈ వారం కథ
బి(న్యూ) పాజిటివ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘నాన్నా, ఇవాళ సాయంత్రం నిధి వాళ్ళింట్లో పార్టీ, కాలేజీ ఫ్రెండ్స్ అంతా కలుస్తారు, నేనూ వెళ్తా నాన్నా, ప్లీజ్.. ఈ ఒక్కసారికి వద్దనకు, మరెప్పుడూ అడగను, ప్రామిస్’’ అని పొద్దున్న లేస్తూనే ఏడుపు, జాలి కలగలిపిన చిలిపిమొహంతో అడిగింది స్ఫూర్తి.
‘‘ఎందుకు తల్లీ, ఇంట్లో నీకు కావాల్సినవన్నీ అమ్మ చేసిపెడుతుంది, చక్కగా ఎంతసేపైనా తమ్ముతో ఆడుకో, లేదంటే మన లక్ష్మితో కబుర్లు చెప్పు, కధలు చెప్తుంది ఎంచక్కా. అదే పెద్ద పార్టీ’’ అన్నాడు మధు.
‘‘ఇంజనీరింగ్ అమ్మాయితో మాటాడుతున్నట్టు లేదు అబ్బాయి, ఐదవ తరగతి పిల్లని బుజ్జగిస్తున్నట్లుంది నీ తీరు’’ జోక్‌చేస్తూ పేపర్ను అడ్డుపెట్టుకున్నాడు మాధవ తండ్రి సూర్యమూర్తి.
‘‘నువ్వూరుకో నాన్నా!’’ నీకేం తెలీదు. అన్నిటికీ సపోర్టు చేయకు’’ అని విసుక్కున్నాడు మధు. చిన్నబుచ్చుకున్నా ఏమనకుండా నిమ్మకున్నాడు మూర్తి. జానకి వంట గదిలోంచి హడావుడిగా వచ్చి ‘‘నిధివాళ్ల ఇల్లు దగ్గరేనండి, క్యాబ్‌లో అరగంటకంటే పట్టదు. వెళ్లనివ్వండి ఈసారి’’ అని వెళ్లిపోయింది. ఇంట్లో అందరూ కూతురికి వంతపాడేసరికి చేసేది లేక ‘‘సరే! వెళ్లిరా కానీ త్వరగా ఇంట్లో ఉండాలి, లేదంటే నా సంగతి తెలుసుకదా’’ అన్నాడు మధు.
‘‘ఏంటి అమ్మాయిగారూ! ఇంతసక్కా ముస్తాబవుతున్నారు, పార్టీ అంట కదా, తాతయ్య సెప్పేరు. నాన్నగోరు ఒప్పుకోటమే పెద్దిసయం, భద్రం ఎల్లిరండమ్మా’’ అంటూ ఆ ఇంట్లో పనిచేసే లక్ష్మి కూడా ఉత్సాహపడింది.
లక్ష్మమ్మకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. కొడుకుల భవిష్యత్తుకున్నదంతా ఖర్పుట్టి కూతుర్ని మూడో పెళ్లివాడికిచ్చి చేసింది. వయసుడిగి ఆ అల్లుడు కాలం చెల్లించేడు, కూతురు రెక్కల కష్టంతో సంసారాన్ని నడుపుకొస్తోంది. పదేళ్లనుంచి మధు ఇంట్లో పనిచేస్తున్నందువల్ల ఇంట్లో మనిషయిపోయింది లక్ష్మమ్మ. సాయంత్రం ఆరు గంటలయింది. భుజంపైన ఉండాల్సిన కండువాను తలక్కట్టుకుని మధు కాలుకాలిన పిల్లినా అటుఇటు పచార్లు చేస్తున్నాడు. ‘‘ఏరా అబ్బాయి నేను అలా వెళ్లి నా ఫ్రెండ్స్‌ని కలిసొస్తా, స్ఫూర్తి వెళ్ళేక అరికాళ్ళకి కాస్త కొబ్బరినూనె రాసుకో, లేదంటే నిద్రపట్టదు’’ అన్నాడు.
‘‘నాన్నా, ఇంట్లో ఆడపిల్ల మనెవరి తోడులేకుండా పార్టీ అని మొదటిసారి బయటికెళ్తోందని నేను టెన్షన్ పడుతుంటే, నీకు కనీసం ఆ అక్కర కూడా ఉన్నట్టు కనిపించట్లేదు, పైగా వెటకారం’’.
‘‘చూడు మధు, తను చిన్నపిల్ల కాదు, మంచి చెడు తెలుసు, ధైర్యవంతురాలు. కాలం బావులేదని పేపర్లో రోజూ చూసి నీకలా భయం ఉండిపోయింది. తనకేం కాదులే. నా మనుమరాలు క్షేమంగా ఇంటికొస్తుంది’’ అని బయటికెళ్లిపోయాడు.
‘‘నే పార్టీకెళ్ళొస్తా నాన్నా, టెన్షన్ పడకండి, త్వరగా వచ్చేస్తా, బాయ్’’- బంగారపు ఛాయపైన, లేత గులాబీ రంగు కుర్తా, పైజమా, చందనం కలర్‌చున్నీలో మెరిసిపోతూ చెప్పింది స్ఫూర్తి.
‘‘అరేయ్ రిషి, అక్కను దింపేసిరారా అని కేకేసేడు’’.
‘‘వాడెందుకు నాన్నా ఇపుడు, అయినా చిన్నవాడిని నాకుతోడు వెళ్ళమంటావేంటి’’ అంది.
‘‘నేనేం చిన్నపిల్లాడిని కాదు, అయినా నే వెళ్లను నాన్నా’’ అని విసవిసలాడుతూ వెళ్లిపోయేడు రిషి.
‘‘సరే’’ అని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో కూతుర్ని సాగనంపేడు మధు.
‘‘లక్ష్మి! త్వరగా ఇల్లంతా ఊడ్చేసి, ఈ కాస్త గినె్నలు కడిగి వెళ్ళు’’ అరిచింది జానకి. సమాధానం రాలేదు. ఏమాట్లాడవేం అంటూ వెళ్లి చూసేసరికి పెరట్లో ఓ మూల కంట తడిపెడుతున్న లక్ష్మి కనబడింది. ఏవైందని అడిగితే, ‘‘అమ్మా! అన్నీ కొడుకులే అని నా శక్తంతా ధారపోసేను, చివరకు ఉన్న ముగ్గురు కొడుకులు కాదంటే నా బిడ్డ నన్ను సాకుతోందమ్మా. పైగా గర్భవతి, అట్లే పనిలోకెళ్తుంది. దాని బాధ తల్చుకుంటేనే దానికి చేసిన అన్యాయం గుర్తొచ్చి గుండె సెరువవుతోందమ్మా’’ అంది. ఆమెకు సమాధానపరిచి, లక్ష్మికి ఆడపిల్లల గొప్పతనం అంటూ క్లాస్ చెప్పింది జానకి.
రాత్రి పదవుతోంది. స్ఫూర్తి ఇంకా ఇంటికి రాలేదు. జానకి మెల్లగా మధు దగ్గరకొచ్చి ‘‘ఏమండీ! అమ్మాయి ఆలస్యమవుతుందని ఫోన్ ఏమన్నా చేసిందా’’ అడిగింది. అసలే పిల్ల ఇంకా ఇంటికి రాలేదన్న టెన్షన్ మొహంలో బయటపడనీకుండా గంభీరంగా అప్పటిదాకా కూచున్న మధు ఇక ఆపుకోలేక ‘‘ఇపుడు గుర్తొచ్చిందా పిల్ల సేఫ్టీ, ఈ పార్టీలేవీ వద్దు అంటే విన్నారా, తగుదునమ్మా అని ఆ ముసలాయన దగ్గరనుంచి లక్ష్మమ్మదాకా ‘వెళ్లిరమ్మని’ సాగనంపేరు కదా. ఇక అనుభవించండి, నే పడుకుంటున్నా’’ అంటూ బుసలుకొడుతున్న పామల్లే వెళ్లిపోయాడు. ‘‘ఈ మాత్రానికే అంత కోపం అవసరమా’’ అన్నట్టు అంతా విస్తుపోయారు. కానీ, మధు టెన్షన్‌వారికి అర్థమయింది. ‘‘మామయ్యా! పార్టీ ఇంతసేపు అవుతుందంటారా, నాకెందుకో కాస్త కంగారొస్తోంది. ఏం చేద్దాం’’ కూతురిమీదున్న బెంగ కళ్ళనిండా నింపుకునున్న జానకి అడిగింది.
‘‘ఏమిటమ్మా నువ్వు కూడా వాడిలాగా, నేనున్నానుకదా, నే చూసుకుంటాలే. నువ్వు లోపలికెళ్లి ఆ మంట చల్లార్చు. పిల్లకోసం బెంగ అని పైకి చెప్పుకోలేడు పిచ్చివాడు’’ అని జానకిని పంపేశాడు సూర్యమూర్తి.
టైం 11, రిషి పరీక్షకి చదువుకుంటున్నాడు. జానకి, మధులు అలసిపోయుండటంతో మేలుకుని ఉందామనుకున్నా నిద్రాదేవి ఆవహించేసింది, ఈ స్ఫూర్తి ఇంకా రాలేదు, మధుకు తెలిస్తే ఎంత పెద్ద గొడవవుతుందో అనుకుంటూ రిషి దగ్గరికెళ్లి ‘‘రిషి! నీకు అక్క ఫ్రెండ్ ఇల్లు తెలుసా నాన్నా’’ అడిగాడు.
‘‘తెలుసు తాతయ్యా, నేను కూడా చాలాసార్లు వెళ్ళా’’ అని ఇంకా తను పూర్తిచేయకుండానే ‘సరే’ మరి బండి తీయి, ఓసారి అలా వెళ్ళొద్దాం’’ అన్నాడు సూర్యమూర్తి.
‘‘సరే నాన్నకి చెప్పొస్తా ఉండు’’ అంటూ లేబోయాడు రిషి.
‘‘ఒరేయ్ బాబూ, కొంపముంచేలా ఉన్నావ్, మీ నాన్నకి నేను చెప్తాలే కానీ చప్పుడు చేయకుండా చెప్పులేసుకుని రా, నే భయటుంటా’’ అన్నాడు.
నిధి ఇంటికి వీళ్ళు చేరుతుండగానే దారిలో ఓ క్యాబ్ ఆగి ఉండడం కనిపించింది, డ్రైవర్ టైరును తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. పక్కనే స్ఫూర్తి బిక్క మొహమేసుకుని మొబైల్ వేపు, ఆకాశంవైపు మార్చి మార్చి చూస్తూ ఉంది.
‘‘తాతయ్యా! అది అక్క’’ అని అరిచాడు రిషి.
‘‘ష్ష్.. నిశ్శబ్దం’’ అన్నట్టు సైగ చేశాడు సూర్యం.
ఇంతలో స్ఫూర్తి పక్కగా ఓ కారొచ్చి ఆగింది. అందులోంచి డ్రైవర్ కాకుండా ఇంకొకతను దిగి స్ఫూర్తితో ఏదో మాట్లాడేడు. ఓ పావు గంట సేపు డిస్కషన్ జరిగింది. స్ఫూర్తి వెళ్లి కార్‌లో కూచుంది. సూర్యానికి గుండె జారినంత పనయింది.
‘‘పద, రిషి కార్‌ని ఫాలోచేయి’’ అన్నాడు.
‘‘మనింటికే వెళ్తున్నట్టున్నారు తాతయ్యా’’.
మధు ఇంటి దగ్గర కారు ఆగకుండా పదడుగులు ముందుకెళ్లింది. రిషి కంగారుగా బండి స్పీడు పెంచడు. ఇంతలో కారు వెనక్కొచ్చి ఇంటికి ముందు ఆగింది. స్ఫూర్తి దిగగానే కారు వెళ్లిపోయింది. ఇంతలో వీళ్లిద్దరు కూడా ఇంటికి చేరారు. సూర్యాన్ని చూస్తూనే ‘‘తాతయ్యా, మీరేంటి ఇక్కడ, అసలేం అయిందంటే’’ అంటూ స్టోరీ చెప్పుకొచ్చింది.
పొద్దున్న లేచి కాఫీ కప్పు తీసుకుంటూనే అందుకున్నాడు మధు-‘‘ జానకి! మీ ముద్దుల కూతురు ఇంటికి ఎన్నిగంటలకొచ్చింది. నిద్రలేవనీ దాని సంగతి చెప్తా’’ అన్నాడు.
జానకి బెరకుగా మామగారి వంక చూసింది.
అప్పుడే మార్నింగ్ వాక్‌కి వెళ్ళొచ్చి కాఫీ తాగుతున్న సూర్యమూర్తి ‘‘ఏరా మధు, పొద్దున్న లేచి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించక, ఎందుకురా నీకు ఆ ముక్కుమీద కోపం. అబ్బాయి! రోజూ చదివే వార్తల్లో బలాత్కారమో, హత్యో లేక మోసం చేసాడని మగవాళ్లకు సంబంధించిన వార్తను మాత్రమే చూస్తామెక్కువ. మోసాలు చేసి లేక వేరే సంబంధాలు పెట్టుకున్న ఆడవాళ్ళూ లేకపోలేరు. కానీ మన పరిస్థితి, పరిసరాలను బట్టి మనకి ఒక కోణమే కనిపిస్తుంది. కన్నతల్లికి మాత్రమే కాదు, తండ్రికి కూడా ఆడపిల్ల నడవడిక, కదలికల గురించి ఎంత అక్కర ఉంటుందని నిన్ను చూస్తే నాకర్థమయింది. ఆడది కనుక తల్లి తన బెంగను, బాధను కన్నీళ్ల ద్వారానో, మాటల ద్వారానో వ్యక్తపరుస్తుంది. తండ్రి పైకి చెప్పుకోలేక దాన్ని కోపం రూపంలో వ్యక్తపరుస్తాడు. ఆడపిల్ల అంటే చాలు వయసుతో నిమిత్తం కూడా లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్న ఈ సమాజంలోనే, అర్థరాత్రి తన క్యాబ్‌లో ఒంటరిగా దొరికిన ఆడకూతుర్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చాలనునేవారూ ఉన్నారు. నిన్న అటువంటి కారులో బయల్దేరుతుండగానే ట్రబుల్ ఇచ్చింది. అంతలో స్ఫూర్తి స్నేహితులిద్దరు వచ్చి తన పరిస్థితి చూసి లిఫ్ట్ ఇచ్చి ఇంటి దగ్గర దింపేరు, తనకు ఎటువంటి హాని చేయకుండా. ఫోన్‌లో ఛార్జ్ అయిపోవడంవలన మీకు చెప్పడానికి కుదరలేదు తాతయ్యా అంటూ తననెక్కడ అపార్థం చేసుకుంటామో అని బోరుమంటూ జరిగిందిది అని చెప్పింది పిచ్చిపిల్ల.
ఇంతలో లక్ష్మమ్మ వచ్చి ‘‘అయ్యా! ఇదిగో నోరు తీపి చేస్కోండి’’ అంటూ స్వీట్ అందించింది.
‘‘ఏమిటే ఇంత ఆనందం, ముందు విషయం చెప్పు’’ అంది జానకి.
‘‘నా కూతురికి ఆడబిడ్డ పుట్టిందమ్మా’’ అంది ఆనందంగా. అంతా అవాక్కయ్యారు. లక్ష్మీ మామూలుగా తన పనిలో మునిగిపోయింది. తనతో లక్ష్మి చెప్పుకుని ఏడ్చిందంతా జానకి ఇంట్లోవాళ్లకి చెప్పింది.
‘‘చూసేవా మధు, లక్ష్మిలో ఎంత మార్పొచ్చిందో. ఇంతకంటే ఇంకో రుజువేం కావాలి ఈ నూతన సంవత్సరం అద్భుతంగా ప్రారంభమయింది అనడానికి. హ్యాపీ న్యూ ఇయర్ మధు’’ అన్నాడు.
‘‘స్ఫూర్తిపైన నాకున్న ప్రేమను ఎంత బాగా అర్థం చేసుకున్నావ్ నాన్నా. నిజమే, తను పార్టీకి వెళ్లడం ఇష్టం లేక కాదు, నా చిట్టి తల్లి ఇంటికి జాగ్రత్తగా రావాలన్న బెంగ నా చేత అలా మాట్లాడిస్తుంది. ఆడపిల్ల కదా అని ఇంటికే పరిమితం చేసే ఉద్దేశ్యమున్న మనిషినైతే ఇంజనీరింగ్‌కే పంపేవాడిని కాదు. నీ మాటలు నాకెంతో స్వాంతననిచ్చాయి. తనపైన బెంగతో అటు ఇటు తిరుగుతూ హడావిడి పడ్డానే తప్ప, నీలాగా సరైన టైంలో సరైన పని చేయలేదు నాన్నా. అన్నిటికీ సరదాగా మాట్లాడతావని ఇన్నాళ్లు నిన్ను విస్కుంటూ ఉన్నా, నన్ను క్షమించు, నాలో కూడా మార్పును చూస్తావ్ ఈ రోజునుంచి’’ అని సూర్యమూర్తి చేతులు పట్టుకుని, ‘‘హ్యాపీ న్యూ ఇయర్ నాన్నా’’ అన్నాడు.
ఇంతలో స్ఫూర్తినిద్రలేచి భయం భయంగా హాల్లోకి వచ్చింది. ‘‘నాన్నా! అసలేం జరిగిందంటే’’ అని చెప్పబోతుండగానే ఆపి, ‘‘నువ్వేం చెప్పక్కర్లేదు తల్లీ. హ్యాపీ న్యూ ఇయర్ రా, మనకు మాత్రమే కాదు, ఈరోజే భూమిమీద పడిన మొట్టమొదటి అదృష్టవంతురాలు లక్ష్మి మనుమరాలికి, ఇంకా తమ పిల్లలను ధైర్యంగా ఎంత రాత్రైనా బైటకు పంపచ్చు అనే ధైర్యాన్నిచ్చిన నీ క్యాబ్ డ్రైవర్ లాంటి మంచి మనసులకు.. ఒంటరిగా కనపడినా సరే మరొక ఆలోచన లేకుండా నిన్ను భద్రంగా ఇంటిదగ్గర దింపిన నీ స్నేహితుల్లాంటి మంచి మనుషులకు, అటువంటి మంచి కూడా ఉంది సమాజంలో, మన దృష్టికోణాన్ని విస్తరించి చూడాలని నా కళ్లు తెరిపించిన తాతయ్య లాంటి పెద్దవాళ్లకు, ఆడపిల్లవి, పార్టీలేమిటని అనకుండా.. పర్వాలేదు పంపమని నాకే ధైర్యం చెప్పిన మీ అమ్మలాంటి సాటి తల్లులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తల్లీ. ఈ ప్రసార మాధ్యమాల ప్రభావంవలన చెడుకి అలవాటుపడినట్లు, మన కళ్ళు, చెవులు మంచికి అలవాటుపడలేదింకా. ఈ న్యూ ఇయర్ నుంచి ఐనా, పైపైన జరిగేవాటిని చూసి మనుషుల పట్ల అభిప్రాయాన్ని ఏర్పర్చుకోకుండా వాస్తవాన్ని గమనించగలిగేలా మారాలి మన దృష్టికోణం. మోసం, ద్వేషం, స్వార్థం, అన్యాయం, ఇటువంటివన్నీ సమసిపోవాలి. వెతికి పట్టుకుందామనుకున్నా చెడు వార్త కనపడకూడదు, పేపర్, టీవీ.. ఈ మాధ్యమాలనిండా మంచి మాత్రమే వినపడాలి, కనపడాలి. మన మనసుల్లో పేరుకున్న నెగెటివ్ ఆలోచనలని చెరిపేస్తూ అంతటా పాజిటివ్ వాతావరణం నెలకొనాలి’’ అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు సంతోషంగా.
*