రివ్యూ

సాహసాల బుల్లోడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడులాంటి మనిషి
రచన: యు.వినాయకరావు
పేజీలు: 600, వెల: రూ.1200
ప్రచురణ: జయా పబ్లికేషన్స్
ప్రతులకు: ప్లాట్ నెం.102,శ్రీశ్రీ శ్రీనివాస నిలయం
7-1-303/డి/2, బాలయ్యనగర్, సంజీవరెడ్డినగర్
హైదరాబాద్-38, ఫోన్: 9885179428
==========================

అదృష్టం అడ్రస్ అనే్వషిస్తూ చాలామంది బయలుదేరుతుంటారు. కానీ ఆ అదృష్టం కొందరిని మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది. ఊహించని విధంగా అందలం ఎక్కిస్తుంది. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి నటశేఖరుడు కృష్ణ. సాహసం ఆయన ఇంటిపేరు.. మంచితనం ఆయనకు మారుపేరు. యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన చేసిన సాహసాలకు లెక్కేలేదు. మంచి నటుడిగానే కాకుండా, మనసున్న వ్యక్తిగా అందరి ఆదరాభిమానాలు అందుకున్నారు. నటుడిగా యాభై ఏళ్లు కొనసాగారంటే నటనతో పాటు ఆయన మంచి తనం కూడా కారణం. ‘చిత్రసీమలో మంచి వాళ్లు ఎవరున్నారయ్యా..కృష్ణలాంటి ఒకరిద్దరుతప్ప’ అని మహాకవి శ్రీశ్రీ అనడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. కృష్ణ నటనను విమర్శించే వారు ఉండవచ్చేమో కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని వేలు పెట్టి చూపించే వారు మాత్రం ఉండరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ యుగంలో కూడా తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు హీరో కృష్ణ. అలాంటి వ్యక్తిపై వచ్చిన పుస్తకమే ‘దేవుడులాంటి మనిషి’. సీనియర్ పాత్రికేయుడు యు.వినాయకరావు రచనలో రూపుదిద్దుకున్న ఈ పుస్తకం ఆయన అభిమానులనే కాక, అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. పాఠకులకు కావాల్సిందేమిటో, వారికి ఏ స్థాయి భాష, భావం అవసరమో వినాయకరావుకి బాగా తెలుసు. ఆ స్థాయిలోనే అవి అందించి ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆయన రాసిన ఎనిమిది పుస్తకాల్లో ఆయన వ్యక్తం చేసిన సంఘటనలు, తెలిపిన నిజమైన వాస్తవాలు పాఠకుల కళ్లకు కట్టాయి. ఈ ‘దేవుడులాంటి మనిషి’ తొమ్మిదో పుస్తకం. సూపర్‌స్టార్ జీవితం మీద పుస్తకం రాయడం అంటే మాటలు కాదు.. చేతలు కావాలి. ఆ చేతల్ని పాఠకులు మెచ్చేట్టు.. అభిమానులు ఆనంద పారవశ్యంలో మునిగేట్టు చేశారు వినాయకరావు.
తెలుగు సినిమా వయస్సు 82 ఏళ్లయితే, అందులో కృష్ణ వాటా యాభై ఏళ్లు. హీరో కృష్ణ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తెరపై సాహస ప్రయోగాలు అందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చాలా మంది చెబుతుంటారు. అవి వాస్తవం కూడా కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించడానికే కృష్ణ అవతరించారా? అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలు, హీరోగా ఆయన చేసిన సాహసాలు మరెవరూ చేయలేదనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం అనే్వషిస్తూ, వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ పరిశ్రమకు మార్గదర్శకంగా నిలిచారు. మంచితనం, మానవత్వం మూర్త్భీవించిన వ్యక్తిగా, ధైర్య సాహసాలే ఊపిరిగా జీవించే నాయకునిగా, సంచలన నిర్మాతగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండటం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. అందరూ తనవారేనని నమ్మే మనస్తత్వం ఆయనది. నిర్మాత నష్టపోతే తనే నష్ట పోయానని భావించే వ్యక్తి. ఐదుపదుల నటజీవితంలో 365 చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. అలాంటి వ్యక్తి కృష్ణ గొప్పతనాన్ని చాటుతూ, ఆయన సాహసాల్ని అడుగడుగునా గుర్తు చేస్తుంది ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకం. అటువంటి ఘనమైన చరిత్ర కలిగిన హీరో కృష్ణకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఘనంగానే ఆయన అభిమానులకు అందించారు రచయిత. 600 పేజీలతో ఒక హీరోకి సంబంధించిన పుస్తకం రావడం ఇదే ప్రథమమేమో! కృష్ణ నటించిన 365 చిత్రాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. ఈ పుస్తకానికి సంబంధించి ఎంతో అందాన్ని ఇచ్చినవి ఈ ఫొటోలు. ‘తేనె మనసులు’ చిత్రం నుండి ‘శ్రీశ్రీ’ వరకూ హీరోగా నటించిన 365 చిత్రాల్లో ఏ ఒక్కదాన్నీ వదల్లేదు. ఒక్కో చిత్రం గురించి ఈ పుస్తకంలో ఎంతో వివరంగా వుంది. అంతేకాదు, ఆ సినిమాలకు సంబంధించిన ఒరిజినల్ లోగోలు కూడా పుస్తకానికి అందాన్ని తెచ్చాయి. నిర్మాతగా కృష్ణ ఇతర భాషల్లో నిర్మించిన చిత్రాల ప్రస్తావన కూడా వివరంగా ఉంది. అలాగే ఆయన రాజకీయ జీవితం గురించి వివరణ.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది హీరో కృష్ణ యాభై ఏళ్ల సినీ జీవితానికి సంబంధించిన సమగ్ర సమాచారం. సినిమా చూసినంత తేలికైన విషయం కాదు సినిమా ఆర్టిస్ట్ కావడం. సినిమాల్లో నటించాలనీ, వెండితెరపై తమని తాము చూసుకోవాలనీ తహతహలాడే వారి సంఖ్య అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆర్టిస్ట్ కావడానికి కనీస విద్యార్హతలు ఏమీ లేకపోవడం.. అందరికీ కలిసొచ్చే అంశం. అందుకే అవకాశాల వేటలో ఇక్కడ నిత్యం పోటీయే. అయితే తన కలల్ని సాకారం చేసుకొని విజేతలైన వారికంటే ఆశాభంగం చెంది, నిరాశతో వెనక్కి తిరిగి వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. కొంతమంది నటుల అనుభవాలు, గుర్తింపు తెచ్చుకోవడానికి వారు పడినపాట్లు తెలుసుకోవాలంటే ‘సినిమా ఆర్టిస్ట్ కావడానికి ఇంత కష్టపడాలా?’ అనిపిస్తుంది. ఆటుపోట్లు, కష్ట నష్టాలు కవ్వించి ఇబ్బంది పెడుతున్నా, తట్టుకొని నిలబడే వారు కొందరే ఉంటారు. అటువంటి కార్య సాధకుల జీవితాలే భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం.. అనుసరణీయం. అలా అనుకున్నది సాధించి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వారిలో హీరో కృష్ణ ఒకరు. ఆయన ఆర్టిస్ట్ కావడానికి పెద్దగా కష్టపడలేదు. కానీ హీరో అయిన తర్వాత తనని తాను నిలబెట్టుకోవడానికి ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేసి ‘డేరింగ్ డాషింగ్ హీరో’ అనిపించుకున్నారు. ఎంతటి ప్రయాణమైనా ప్రారంభమయ్యేది తొలి అడుగుతోనే. కొత్త తరానికి తివాచీ పరిచిన ‘తేనె మనసులు’ నుంచి ప్రారంభమైన ఈ పుస్తకం ఆద్యంతం చదివిస్తుంది. ఆసక్తి గొలిపేలా ముందుకు కదలనిస్తుంది. కృష్ణ జీవితంలో ప్రతి ఉదయం చైతన్య స్రవంతి, అభిమానులకు ఆయన హృదయం విశాల భవంతి. అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగానే కాకుండా ఎక్కువ సంఖ్యలో అతిధి పాత్రలు పోషించిన ఆర్టిస్టుగా హీరో కృష్ణకు ఒక రికార్డ్ ఉంది. తన కెరీర్ మొత్తంలో 20 చిత్రాల్లో ఆయన అతిధి పాత్రలు పోషించారు. ఇందులో స్పెషల్‌సాంగ్స్ చేసిన చిత్రాలూ వున్నాయి. సాధారణంగా స్టార్ ఇమేజ్ వున్న హీరోలు బయటి చిత్రాల్లో స్పెషల్‌సాంగ్స్ చేయడానికి అంగీకరించరు. దానివల్ల తమ ఇమేజ్‌కు భంగం కలుగుతుందని అనుకుంటారు. కానీ కృష్ణ మనస్తత్వం అది కాదు. తను నటించడం వల్ల ఆ చిత్ర నిర్మాతకు ఏమన్నా మేలు జరుగుతుందా? అని మాత్రమే ఆలోచించి అతిధి పాత్రలు చేసేవారు. హీరో కృష్ణ పోషించిన అతిధి పాత్రలు, ఆ చిత్రాల వివరాలు ఇందులో ఎంతో చక్కగా విశే్లషించారు. తెలుగులో అపరాధ పరిశోధక సినిమాలకు ఊపిరి పోసిన నటుడు కృష్ణ. ‘గూఢచారి 116’తో తొలి జేమ్స్‌బాండ్ చిత్ర కథానాయకునిగా ఆయన ఎవరికీ దక్కని అరుదైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సాంకేతికంగా తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన కృష్ణ ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్’గా పేరొందారు. తెలుగుబాండ్‌గా ఆయన విన్యాసాలు అభిమానులకు ఇప్పటికీ గుర్తే. ఈ పుస్తకంలో ఆయన నటించిన గూఢచారి 116, జేమ్స్‌బాండ్ 777, ఏజెంట్‌గోపి, రహస్య గూఢచారి, గూఢచారి 117 లాంటి గూఢచారి చిత్రాల ఎంతో విపులంగా ఉన్నాయి. ప్రయోగాలు చేయడంలో ముందుండే కృష్ణ మోసగాళ్లకు మోసగాడు చిత్రంతో తెలుగు పరిశ్రమకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. 1970ల నాటికి ఆదరణ కోల్పోతున్న జానపన సినిమాల స్లాట్‌ని తన కౌబాయ్ చిత్రంతో భర్తీ చేస్తూ సగటు ప్రేక్షకుల్ని కృష్ణ థియేటర్‌కి రప్పించ గలగడమే ఈ విజయానికి ఓ కారణం. మోసగాళ్లకు మోసగాడుతో కొత్త తరహా మాస్ సినిమాలకు శ్రీకారం చుట్టాడు కృష్ణ. తెలుగులో మరిన్ని కౌబాయ్ చిత్రాలు రావడానికి ఆయనే కారకుడయ్యారు. కౌబాయ్, క్రైమ్, నవలా చిత్రాల విశే్లషణ బావుంది. తెలుగులో సాంఘిక సినిమాల నిర్మాణం బాగా పెరుగుతున్న తరుణంలో ప్రేక్షకుల్ని అలరించే విభిన్న కథలు అవసరమయ్యాయి. 1960ల ద్వితీయార్థంలో కొత్తతరం తెలుగు నవలలకి మార్కెట్ పెరిగింది. దీని వల్ల నవలలు రాసే రచయిత్రుల సంఖ్య పెరిగింది. అరికపూడి కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవలను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ‘డాక్టర్ చక్రవర్తి’ పేరుతో సినిమాగా తీశారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తెలుగు నవలలకి గిరాకీ పెరిగింది. ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతూ హీరో కృష్ణ కూడా 18 నవలా చిత్రాల్లో నటించారు. వీటిలో అధిక శాతం విజయం సాధించినవే. ఆ వివరాలు ఇందులో చదివించేలా వున్నాయి. అంతే గాకుండా, కృష్ణ ద్విపాత్రాభియ చిత్రాల విశే్లషణలు, త్రిపాత్రాభినయ చిత్రాలు, మల్టీస్టారర్, డైరెక్టర్‌గా కృష్ణ (దాదాపు 14 చిత్రాలు), రాజకీయ చిత్రాలు, రీమేక్ చిత్రాలు, కొత్త దర్శకులతో కృష్ణ, సాంఘిక చిత్రాలు ఇలా ఎన్నో..ఎనె్నన్నో... విశే్లషణలతో సమగ్రంగా నిండివుంది ‘దేవుడులాంటి మనిషి’ రూపంలో. చారిత్రక చిత్రాలైన అల్లూరి సీతారామరాజు, విశ్వనాథ నాయకుడు, శాంతి సందేశం, పౌరాణిక చిత్రాలైన మల్లమ్మకథ, కురుక్షేత్రం, ఏకలవ్య, జానపద చిత్రాలైన ఇద్దరు మొనగాళ్లు, బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు, సింహాగర్జన, సింహాసనం తదితర ఎన్నో చిత్రాల వివరణ వుంది. ఈ ‘దేవుడులాంటి మనిషి’ ఆద్యంతం సూపర్‌స్టార్ కృష్ణ అభిమానులనే కాదు, ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.. ఆద్యంతం చదివిస్తుంది... పాఠకుల్ని కృష్ణ చిత్రాలలోతుల్లోకి తీసుకెళ్తుంది.
తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన విశిష్టవ్యక్తుల గురించి, వారి గొప్పతనం గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. సూపర్‌స్టార్ కృష్ణ గురించి ఎన్నో పుస్తకాలు వచ్చినా వాటికి మిన్నగా, భిన్నంగా ఉండేలా ఈ పుస్తక రూపకల్పనలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు రచయిత వినాయకరావు. ఏ దశలోనూ రాజీపడకుండా అనుకున్న విధంగా ‘దేవుడులాంటి మనిషి’కి ఓ అందమైన రూపం తీసుకొచ్చారు. *

-ఎం.డి. అబ్దుల్