ఆటాపోటీ

వైద్యుల సలహా బేఖాతరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాస్పద అథ్లెట్‌గా ముద్రపడిన ఒపి జైష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వైద్యుల సలహాను బేఖాతరు చేసిన ఆమె త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నది. తాను బాగా కోలుకున్నానని, మందులు కూడా వాడడం లేదని పిటిఐ వార్తా సంస్థకు వివరించింది. విశ్రాంతి తీసుకోవాలని కూడా తనకు ఎవరూ సూచించలేదని వ్యాఖ్యానించింది. రియో ఒలింపిక్స్ నుంచి జ్వరంతో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన వెంటనే భారత అధికారులపై ఆమె ఆరోపణాస్త్రాలు సంధించి సంచలనం సృష్టించింది. రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్ పోటీలో పాల్గొన్నప్పుడు అధికారుల నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని, ఒకానొక దశలో ప్రాణం పోతుందేమోనని భయపడ్డానని జైష చేసిన ఆరోపణలు భారత క్రీడా రంగంలో దుమారం రేపాయి. మారథాన్‌లో పాల్గొంటున్న వారికి నీరు, ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడానికి అన్ని దేశాల స్టాల్స్‌లోనూ అధికారులు ఉంటే, మన దేశ స్టాల్స్‌లో మాత్రం ఎవరూ లేరని అప్పట్లో జైష ఆరోపించింది. మంచినీరు కూడా లేకుండా రేసును కొనసాగించానని చెప్పింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో అందరినీ ఇరుకున పెట్టిన జైష ఈనెల 21న భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. 24న ఆమె బెంగళూరులో ఉన్నట్టు సాయ్ అధికారులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్య పరీక్షల కోసం రక్తం నమూనాను ఇవ్వడానికి జైష నిరాకరించింది. ఆమె నుంచి శాంపిల్స్ తీసుకోవడానికి అధికారులు ఎంతో కష్టపడ్డారు. చివరికి స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, జైష కనీసం నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని, ఆతర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చని సాయ్ వైద్యురాలు సరళ స్పష్టం చేసింది. అయితే, జైష మాత్రం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా తనకు ఎవరూ సూచించలేదని స్పష్టం చేసింది. ఒకటి రెండు రోజుల్లో ప్రాక్టీస్ మొదలు పెడతానని అన్నది. శిక్షణ ఎక్కడ ఉంటుందో ఇంకా నిర్ణయించుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.