ఆటాపోటీ

కోహ్లీ.. ఎవరి మాటా వినడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహ్లీ మొండి వైఖరి గురించి ఎంత తక్కువగా చెప్తే అంత మంచిది. సొంత అజెండాను అమలు చేసే అతను, జట్టు ప్రయోజనాలు గాలికి కొట్టుకుపోయినా సరే తన పంతమే నెగ్గాలన్న అతని వైఖరి కారణంగానే కోచ్ పదవి నుంచి అనీల్ కుంబ్లే ఉద్వాసనకు గురయ్యాడు. బ్యాటింగ్‌లో రాణించడం, రికార్డుల మీద రికార్డులు సృష్టించడం, నలువైపుల నుంచి ప్రశంసల జల్లు కురవడం వంటి అంశాలు కోహ్లీలో మొండితనాన్ని, ‘తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు’ అనే తత్వాన్ని మరింతగా పెంచాయి. దీని ప్రభావం జట్టు కూర్పుపై ప్రత్యక్షంగా, మ్యాచ్ ఫలితంపై పరోక్షంగా కనిపిస్తున్నది. 2014లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు, టెస్టు సిరీస్ పూర్తికాక ముందే మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. దీనితో ఆ బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ అక్కడ చివరి టెస్టులో జట్టుకు నాయకత్వం వహించాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ, సుమారు మూడేళ్ల కాలంలో అతను 34 వేర్వేరు ప్లేయింగ్ ఎలెవెన్ కాంబినేషన్స్‌తో బరిలోకి దిగాడు. ఎంత సీనియర్ ఆటగాడైనాసరే, తుది జట్టులో చోటు ఉంటుందా? ఊడుతుందా? అని తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే పరిస్థితిని కల్పించాడు. జట్టులో నిలకడ లేకపోవడానికి అతను తరచు ఆటగాళ్లను మార్చడమే ప్రధాన కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే, జట్టు విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో, జట్టులో తరచు చేస్తున్న మార్పులపై ప్రశ్నించలేదు. దక్షిణాఫ్రికాలో వరుసగా రెండు టెస్టుల్లోనూ పరాజయాలను ఎదుర్కొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకున్న తర్వాత అతనికి తొలిసారి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ కాంబినేషన్స్‌తో ఎందుకు ఆడతారని ఒక విలేఖరి నిలదీసినప్పుడు కోహ్లీ నేరుగా సమాధానం చెప్పలేకపోయాడు. సరైన జవాబు లేకపోవడంతో, కోపంతో ఊగిపోయాడు. ఆ విలేఖరిని ఎదురు ప్రశ్నలు వేసి, పొంతనలేని సమాధానాలు చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విలేఖరుల సమావేశం నుంచి అతను పెద్దగా సమస్యలు ఎదుర్కోకుండా బయటపడినప్పటికీ, జట్టులో చేస్తున్న మార్పులు, అతని మొండివైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఓపెనింగ్ కాంబినేషన్ స్థిరపడకపోవడానికి కోహ్లీ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణం. మురళీ విజయ్, లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్‌లలో ఎవరినీ అతను ఎక్కువ కాలం ఓపెనర్‌గా కొనసాగించలేదు. మ్యూజికల్ చైర్స్ మాదిరి పదేపదే మారుస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీశాడన్న విమర్శలున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో మురళీ విజయ్ 25, లోకేష్ రాహుల్ 20, శిఖర్ ధావన్ 17 టెస్టులు ఆడారు. ఓపెనింగ్ కూర్పుపై అతను ఏకంగా ఏడుగురితో ప్రయోగాలు చేశాడు. మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, పార్థీవ్ పటేల్, గౌతం గంభీర్, అభినవ్ ముకుంద్ కనీసం ఒక టెస్టులో ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చారు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న ఈ మూడేళ్ల కాలంలో ఆరుగురు ఆటగాళ్లు, కర్న్ శర్మ, నమన్ ఓఝా, జయంత్ యాదవ్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో పాండ్య, బుమ్రా తప్ప మిగతా వారి కెరీర్ ఎటు వెళుతున్నదో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. వనే్డ ఇంటర్నేషనల్స్‌కు పనికిరాడంటూ సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌పై ముద్రవేయడానికి కోహ్లీ ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే, అతనిని టెస్టుల్లో మాత్రమే ఆడిస్తున్నారన్నది విమర్శకుల వాదన. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అశ్విన్ కెరీర్‌లో ఇప్పటి వరకూ 57 టెస్టులు ఆడాడు. వాటిలో 33 కోహ్లీ నాయకత్వంలో ఆడినవే. మూడేళ్ల కాలంలో కోహ్లీ 34 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరిస్తే, వాటిలో 33 టెస్టుల్లో అశ్విన్ ఉన్నాడు. ఒక్క టెస్టులో అశ్విన్ స్థానంలోనే అతను కర్న్ శర్మను తీసుకున్నాడు.
ఇక అజింక్య రహానే పట్ల కోహ్లీ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాడన్న విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. సెలక్టర్లు రహానేను టెస్టు జట్టుకు ఎంపిక చేయడమేగాక, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పచెప్పారు. కానీ, కేప్‌టౌన్‌లో జరిగిన మొదటి టెస్టులో రహానే లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంపై ఎంతోమంది కోహ్లీని విమర్శించారు. మొదటి టెస్టులో జట్టు ఓటమిపాలైన తర్వాత, రెండో టెస్టులో రహానేను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, విమర్శలను పట్టించుకుంటే, అభిమానుల డిమాండ్‌కు తలవంచినట్టు అవుతుందని అనుకున్నాడో ఏమోగానీ రెండో టెస్టులోనూ రహానేను తీసుకోలేదు. ఆ టెస్టుతోపాటు, సిరీస్‌ను కూడా భారత్ కోల్పోయింది. అంతకు ముందు, రహానేను టెస్టు క్రికెట్‌కే పరిమితం చేస్తూ, అతను వనే్డలకు పనికిరాడన్న అభిప్రాయాన్ని కల్పించిన కోహ్లీ ఇప్పుడు టెస్టుల నుంచి కూడా అతనిని దూరంగా ఉంచడం వివాదాస్పదమవుతున్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను చివరిదైన మూడో టెస్టులో రహానేకు అవకాశం కల్పించాడు. ఇలావుంటే, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు కూడా అన్యాయమే జరుగుతున్నది. కోహ్లీ తన నాయకత్వంలో జరిగిన 34 టెస్టుల్లో కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే భువీకి చాన్స్ ఇచ్చాడు. 2016లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు తప్ప భువీ వరుసగా రెండు టెస్టుల్లో ఆడిన సందర్భాలు లేవంటే, కోహ్లీ అతనిని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాడో ఊహించుకోవచ్చు. చివరి టెస్టులో రహానేతోపాటు అతనికి కూడా చోటు కల్పించక తప్పలేదు. చటేశ్వర్ పుజారా 30, వృద్ధిమాన్ సాహా 29 టెస్టులు కోహ్లీ నాయకత్వంలో ఆడారు. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే పుజారా 54.67 సగటుతో 2,187 పరుగులు చేశాడు. ఏడో నంబర్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన సాహా 23 ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మకు 17 టెస్టుల్లో అవకాశం లభించింది. ఓపెనింగ్ కాంబినేషన్‌తోపాటు, మిగతా స్థానాల్లోనూ బ్యాట్స్‌మెన్‌ను కుదుటపడనీయకుండా కోహ్లీ పదేపదే మార్పులు చేయడం విమర్శలకు తావిస్తున్నది. అతని కెప్టెన్సీలో, కేవలం ఆరో స్థానంలోనే తొమ్మిది మంది బ్యాటింగ్‌కు దిగారు. ఒక ఆటగాడిని కొంతకాలం అదే స్థానంలో ఆడనివ్వకుండా కోహ్లీ ఇబ్బంది పెడతాడని వచ్చిన విమర్శలకు ఈ గణాంకాలు బలాన్నిస్తున్నాయి. ఇప్పటికైనా అతను మొండితనాన్ని వీడి, తాను భారత జాతీయ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాననే వాస్తవాన్ని గుర్తించి ప్రవర్తించడం మంచిది.