ఆటాపోటీ

గాట్లిన్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్ అవార్డు కోసం అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) సిద్ధం చేసిన జాబితాలో పురుషుల స్ప్రింట్ డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ జస్టిన్ గాట్లిన్‌కు చోటు దక్కలేదు. లండన్‌లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 100 మీటర్ల పరుగును గాట్లిన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కెరీర్‌లో చివరి అంతర్జాతీయ రేస్‌లో పాల్గొన్న ‘స్ప్రింట్ రారాజు’ ఉసేన్ బోల్ట్ అత్యంత నిరుత్సాహంగా కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. ఆ రేసులో అతను కాంస్య పతకంతో సరిపుచ్చుకున్నాడు. ఇలావుంటే, స్వర్ణ పతకం సాధించినప్పటికీ గాట్లిన్‌కు ప్రేక్షకుల నుంచిగానీ, అభిమానుల నుంచిగానీ ప్రశంసలు లభించలేదు. అంతకు ముందు రెండు పర్యాయాలు నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించి డోపింగ్ పరీక్షలో అతను పట్టుబడడమే అందుకు కారణం. డోప్ కేసులో సస్పెన్షన్‌కు గురైన ఒక అథ్లెట్ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నంత మాత్రాన ఉత్తముడిగా మారిపోతాడా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి, రెండు పర్యాయాలు డోప్ పరీక్షలో విఫలమైన అతనిపై ఎవరూ సానుకూలంగా స్పందించడం లేదు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో బోల్ట్‌ను ఓడించినప్పటికీ అతనిని సూపర్ హీరోగా గుర్తించడం లేదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఐఎఎఎఫ్ ఉత్తమ అథ్లెట్ అవార్డుకు అతని పేరును ప్రతిపాదించలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్స్ లేదా ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగును సాధించిన ఒక అథ్లెట్ పేరు ప్రతిపాదిక జాబితాలో లేకపోవడం 2004 తర్వాత ఇదే మొదటిసారి.
గాట్లిన్‌పై విమర్శలు, నిరసనలు కొత్తేకాదు. ఉత్ప్రేరకాలను వినియోగించిన కారణంగా మొదటిసారి సస్పెన్షన్‌కు గురైనప్పుడు, తాను నిర్దోషినని, సాధారణ రుగ్మతలకు ఉపయోగించిన ఔషధాల్లో నిషిద్ధ మాదక ద్రవ్యాలు ఉండవచ్చని, అందుకే డోప్ పరీక్షలో విఫలమయ్యానని గాట్లిన్ అప్పట్లో వాపోయాడు. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరాడు. అతని అభ్యర్థనను పరిశీలించిన ఐఎఎఎఫ్ సానుకూలంగా స్పందించింది. ఆ తర్వాత, 2014లో అతని పేరును ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’కు ప్రతిపాదించింది. ఈ చర్యను తీవ్రంగా విభేదించిన అప్పటి ఒలింపిక్ డిస్కస్ త్రో చాంపియన్ రాబర్ట్ హార్టింగ్ (జర్మనీ) తన పేరును జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. గాట్లిన్ వంటి డోప్ దోషి పేరు సరసన తన పేరును చేర్చడాన్ని అంగీకరించలేనని స్పష్టం చేశాడు. ఈ సంఘటన అథ్లెటిక్స్ ప్రపంచంలో దుమారం రేపింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐఎఎఎఫ్ 2015లో అవార్డు నిబంధనల్లో సవరణలు చేసింది. సస్పెన్షన్ అమల్లో ఉన్నా.. లేకపోయినా.. డోప్ పరీక్షలో విఫలమైన ఎవరి పేరునూ అవార్డుల జాబితాలో చేర్చకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రకారమే గాట్లిన్ పేరును ఈ ఏడాది ఉత్తమ అథ్లెట్ అవార్డులకు ప్రతిపాదించిన జాబితాలో ఉంచలేదు.
అవార్డుకు ప్రతిపాదిత జాబితా..
పురుషుల విభాగం
1. మో ఫరా (బ్రిటన్/ 10,000 మీటర్ల ప్రపంచ చాంపియన్), 2.వేడ్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా/ 400 మీటర్ల పరుగు), 3. ముతాజ్ ఎస్సా బర్షిమ్ (కతార్/ హైజంప్), 4. పావెల్ ఫడెక్ (పోలాండ్/ హ్యామర్ త్రో), 5. శామ్ కెండ్రిక్స్ (అమెరికా/ పోల్‌వాల్ట్), 6. ఎలిజా మనంగోయ్ (కెన్యా/ 1,500 మీటర్ల పరుగు), 7. లువో మన్యోంగా (దక్షిణాఫ్రికా/ లాంగ్ జంప్), 8. ఒమర్ మెక్‌లియాడ్ (జమైకా/ 110 మీటర్ల హర్డిల్స్), 9. క్రిస్టియన్ టేలర్ (అమెరికా/ ట్రిపుల్ జంప్), 10. జొహానెస్ వెటెర్ (జర్మనీ/ జావెలిన్ త్రో).
మహిళల విభాగం
1. అల్మాజ్ అయానా (ఇథియోపియా/ 10,000 మీటర్ల పరుగు), 2. మరియా లాసిట్స్‌కెన్ (హైజంప్‌లో తటస్థ అథ్లెట్‌గా పోటీపడుతున్న రష్యా అథ్లెట్), 3. హెలెన్ ఒబిరీ (కెన్యా/ 5,000 మీటర్ల పరుగు), 4. శాలీ పియర్సన్ (ఆస్ట్రేలియా/ 100 మీటర్ల హర్డిల్స్), 5. సాండ్రా పెర్కొవిచ్ (క్రొయేషియా/ డిస్కస్ త్రో), 6. బ్రిట్నీ రీస్ (అమెరికా/ లాంగ్ జంప్), 7. కాస్టెర్ సెమెన్యా (దక్షిణాఫ్రికా/ 800 మీటర్ల పరుగు), 8. ఎకతెరిని స్ట్ఫోనిడీ (గ్రీస్/ పోల్‌వాల్ట్), 9. నిఫిసటౌ థియామ్ (బెల్జియం/ హెప్ట్థ్లాన్), 10. అనితా వ్లాడర్‌జిక్ (పోలాండ్/ హ్యామర్ త్రో).