ఆటాపోటీ

టార్గెట్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, శ్రీలంక జట్ల మధ్య 1982లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 1985లో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో గెల్చుకుంది. 1986-87 సీజన్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. లంకపై భారత్‌కు అదే తొలి విజయం. ఆతర్వాత భారత్ వరుసగా మరో మూడు (1990, 1993, 1994) సిరీస్‌లను తన ఖాతాలో వేసుకుంది. 1997, 1998 సంవత్సరాల్లో జరిగిన రెండు సిరీస్‌లు డ్రా అయ్యాయి. 1999లో జరిగిన ఆసియా టెస్టు చాంపియన్‌షిప్ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తోపాటు భారత్, శ్రీలంక కూడా పాల్గొన్నాయి. ఆ టోర్నీని పాక్ గెల్చుకుంది. కాగా, 2001లో శ్రీలంక సిరీస్‌ను సాధిస్తే, 2006 సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచింది. 2008లో తిరిగి శ్రీలంక సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2010లో భారత్ సిరీస్‌ను సాధిస్తే, అదే ఏడాది జరిగిన మరో మూడు మ్యాచ్‌ల సిరీస్ డ్రా అయింది. 2015లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ ఏడాది శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. అదే ఉత్సాహంతో తాజా సిరీస్‌కు సిద్ధమైంది. వరుసగా మూడోసారి సిరీస్‌ను అందుకొని, హ్యాట్రిక్‌ను నమోదు చేయడానికి అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంది.

భారత్‌లో శ్రీలంక ఇంత వరకూ ఒక్క టెస్టు మ్యాచ్‌ని కూడా గెల్చుకోలేదు. 1982 నుంచి ఇప్పటి వరకూ ఈ జట్టు భారత్‌లో 17 టెస్టులు ఆడింది. పది మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కోగా, మిగతా ఏడు టెస్టులు డ్రా అయ్యాయి. మొదటిసారి భారత గడ్డపై టెస్టుల్లో విజయాలను నమోదు చేయాలన్న పట్టుదలతో ఉన్న శ్రీలంక అన్ని విధాలా సిద్ధమైంది. కానీ, కెప్టెన్ దినేష్ చండీమల్‌కే భారత్‌లో టెస్టులు ఆడడం ఇదే మొదటిసారి. దీనిని బట్టి మిగతా ఆటగాళ్ల పరిస్థితిని ఊహించుకోవడం కష్టం కాదు. ఏ మాత్రం అంచనాలు, గొప్పగా పోరాడతారన్న ధీమాలు లేకుండా బరిలోకి దిగుతున్న లంకేయులు ఎంత వరకూ తమ ప్రయత్నంలో సఫలమవుతారో చూడాలి.

శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గెల్చుకొని, హ్యాట్రిక్ పూర్తి చేయడమే లక్ష్యంగా ఎంచుకున్న టీమిండియా అందుకు అన్ని విధాలా సిద్ధమైంది. 2015లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకున్న భారత్, ఈ ఏడాది శ్రీలంక వెళ్లి, అక్కడ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మరోసారి అదే స్థాయిలో ప్రత్యర్థిని మట్టికరిపించాలన్న పట్టుదలతో ఉంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఏ ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా, విశేష స్పందన ఉంటుంది. ఇరు దేశాల మధ్య సారూప్యం ఉండడంతోపాటు, వాతావరణం, పిచ్‌ల తీరు కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి, ఆధిపత్య పోరు ఆసక్తికరంగా సాగుతుంది. 1982లో టెస్టు హోదాను సంపాదించిన శ్రీలంక ఆ ఫార్మాట్‌లో ఇప్పటి వరకూ భారత్‌తో 41 మ్యాచ్‌లు ఆడింది. ఏడింటిని గెల్చుకొని, 19 పరాజయాలను ఎదుర్కొంది. 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మ్యాచ్‌ల పరంగా చూస్తే, లంకను సాధారణ జట్టుగానే పరిగణించాల్సి వస్తుంది. కానీ, ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. 1997 ఆగస్టులో, కొలంబోలో భారత్‌పైనే ఆ జట్టు ఆరు వికెట్లకు 952 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్టు చరిత్రలో ఇదే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. రెండు దశాబ్దాల క్రితం లంక నమోదు చేసిన ఆ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం విశేషం. ఇరు దేశాల మధ్య ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు జాబితాలో రెండో స్థానం కూడా శ్రీలంకదే కావడం విశేషం. 2009 నవంబర్‌లో జరిగిన అహ్మదాబాద్ టెస్టులో లంక ఏడు వికెట్లకు 760 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది. కాగా, ఆ జట్టుపై భారత్ అత్యధిక స్కోరు ఏడు వికెట్లకు 726 (డిక్లేర్డ్) పరుగులు. 2009 డిసెంబర్‌లో, ముంబయి టెస్టులో టీమిండియా ఈ స్కోరు చేసింది. 2010 జూలైలో, కొలంబో టెస్టులో భారత్ 707 పరుగులు సాధించింది. మొత్తం మీద రెండు దేశాల మధ్య ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 700లకుః మించి పరుగులు నాలుగు పర్యాయాలు నమోదయ్యాయి. అందులో లంక రెండుసార్లు, భారత్ రెండుసార్లు చొప్పున ఆ స్కోర్లను సాధించి, సమవుజ్జీలుగా నిలిచాయి.
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇంత వరకూ జరిగిన టెస్టుల్లోని ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు 82 పరుగులు. 1990 నవంబర్‌లో జరిగిన చండీగఢ్ టెస్టులో శ్రీలంక ఈ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. 2015 ఆగస్టు, గాలే టెస్టులో భారత్ 112 పరుగులే చేయగలిగింది.
భారీ విజయాల జాబితాలో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2008 జూలైలో కొలంబోలో జరిగిన టెస్టను ఆ జట్టు ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో గెల్చుకుంది. అయితే, మొత్తం మీద భారత్ పదిసార్లు ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేస్తే, శ్రీలంక కేవలం రెండు పర్యాయాలు ఆ ఫీట్‌ను అందుకోగలిగింది. వికెట్ల పరంగా చూస్తే, భారత్‌పై లంక ఆధిపత్యం కనిపిస్తుంది. ఆ జట్టు రెండు పర్యాయాలు పది వికెట్ల తేడాతో, ఒకసారి ఎనిమిది వికెట్ల తేడాతో విజయాలు సాధించగా, భారత్ అత్యుత్తమంగా 2001లో ఏడు వికెట్ల ఆధిక్యంతో లంకను ఓడించింది. భారీ విజయాల్లోనేకాదు.. అత్యల్ప స్కోరు తేడాతో గెలిచిన రికార్డు కూడా లంక పేరిటే ఉంది. 2015లో గాలే టెస్టులో ఆ జట్టు కేవలం 63 పరుగుల తేడాతో గెలిచింది. అదే సిరీస్‌లో కొలంబోలో జరిగిన టెస్టును భారత్ 117 పరుగుల తేడాతో సొంతం చేసుకుంది. లంకపై టీమిండియాకు అదే అతి తక్కువ తేడాతో చేతికి అందిన విజయం.
ఫేవరిట్ టీమిండియా
మొత్తం మీద గణాంకాలు ఎలావున్నా, ఈనెల 16 నంచి 20 వరకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే టెస్టుతో మొదలయ్యే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకపై భారత్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. ఇటీవలే శ్రీలంకకు వెళ్లి, దినేష్ చండీమల్ నాయకత్వంలోని లంకకు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ వేయడమేగాక, వనే్డ, టి-20 సిరీస్‌ల్లోనూ క్లీన్‌స్వీప్ సాధించిన కోహ్లీ సేన ఆతర్వాత కూడా అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నది. స్వదేశంలో ఆడడం టీమిండియాకు కలిసొచ్చే ప్రధాన అంశంకాగా, ఆటగాళ్లంతా ఫామ్‌ను కొనసాగించడం మరో శుభసూచకం. ఎట్టి పరిస్థితుల్లోనూ సిరీస్ చేజారకుండా పోరాటం సాగించాలన్న పట్టుదల భారత జట్టులో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చేరిక భారత్ బలాన్ని పెంచుతున్నది. కోహ్లీ బృందంలో ఎక్కువ మంది స్టార్లు ఉంటే, శ్రీలంక జట్టులో ఆ స్థాయి ఆటగాళ్లు ఒకరిద్దరి కంటే మించి లేకపోవడమే రెండు జట్ల మధ్య తేడాను స్పష్టం చేస్తున్నది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేకపోయినా, ఈ సిరీస్‌లో భారత్‌దే పైచేయి అవుతుందనేది వాస్తవం. లంకేయులు ఏ స్థాయిలో పోరాడతారన్న విషయంపైనే మూడు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్ ఎంత వరకూ ఉత్కంఠను సృష్టిస్తుందనేది ఆధారపడి ఉంటుంది. స్థూలంగా చూస్తే, లంకను భారత్ చిత్తుగా ఓడించగలదని స్పష్టమవుతుంది. గణాం కాలు, నిపుణుల అంచనాలు, విశే్లషకుల అభిప్రాయాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయ. టీమిండియాదే విజయమని స్పష్టం చేస్తున్నాయ. అయితే, నిర్లక్ష్యంగా ఆడినా, నిలకడగా రాణించలేకపోయినా చేదు అనుభవాన్ని చవిచూడక తప్పదు. కోహ్లీ అండ్ కో ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటుందనే ఆశిద్దాం.

-విశ్వమిత్ర