ఆటాపోటీ

రణమా? శరణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్‌కు మంచి రోజులు రాబోతున్నాయా? లేక ఎప్పటి మాదిరిగానే మార్పులకు బ్రేక్ పడుతుందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం వచ్చేనెల 9న జరగనున్న నేపథ్యంలో, ఫలితం ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. సుమారు నాలుగేళ్లుగా నానుతున్న వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చి, ఉత్కంఠను పెంచుతున్నది. లోధా సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తుంటే, అన్నింటినీ తు.చ తప్పకుండా అమలు చేయడం సాధ్యం కాదని బీసీసీఐ వాదిస్తున్నది. సిఫార్సుల అమలు ప్రక్రియను వేగవంతం చేయడానికి బోర్డు పాలనాధికారుల బృందం (సీఓఏ) ప్రయత్నిస్తున్నది. అయతే, కొంత మంది అధికారులు అడుగడుగునా అడ్డు పడడంతో, ప్రక్షాళన వేగాన్ని పుంజుకోవడం లేదు. అయతే, ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. లోధా చేసిన ప్రతిపాదనలను అమలు చేయకుండా యుద్ధాన్ని కొనసాగించడమా లేక అమలు చేయడం ద్వారా శరణు కోరడమా అన్నది తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్న బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

తూతూమంత్రమేనా?

గతంలో మాదిరిగానే డిసెంబర్ 9న కూడా బోర్డు సమావేశం తూతూమంత్రంగానే జరుగుతుందా? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. గతంలో ఎన్నోసార్లు ఎస్‌జీఎంతోపాటు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించినా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరగాలన్న సుప్రీం కోర్టు సూచనలను బీసీసీఐ అధికారులు పట్టించుకోకపోవడమే అందుకు ప్రధాన కారణం. లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోరాదని బలంగా వాదిస్తున్న బీసీసీఐ వివిధ సమావేశాలను ఒక తంతుగా మార్చేసింది. లోధా సిఫార్సుల్లోని కీలక అంశాలను పక్కకుపెట్టి, ఎలాంటి ప్రాధాన్యం లేని చిన్నచిన్న సూచనలు అమలు చేస్తామంటూ గత ఎస్‌జీఎంలో తీర్మానాన్ని ఆమోదించడమే అందుకు నిదర్శనం. దశల వారీగా సిఫార్సుల అమలు ప్రక్రియ పూర్తవుతుందని ఆశించిన సీఓఏకు కూడా ఈ తీర్మానంతో బీసీసీఐ సవాళ్లు విసిరింది. మళ్లీ అదే దారిని అనుసరించబోదని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. బీసీసీఐ ఎప్పుడు ఏం చేస్తుందో? ఎంతకు తెగిస్తుందో? ఎవరూ చెప్పలేకపోతున్నారు. లోధా సిఫార్సుల్లో పేర్కొన్న పలు అంశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీసీసీఐని తమ చెప్పుచేతల్లో ఉంచుకొని చక్రం తిప్పుతున్న వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు కొరుకుడు పడడం లేదు. బీసీసీఐ పాలక మండలిలో మంత్రులు ఉండకూడదని లోధా కమిటీ తేల్చిచెప్పింది. కోట్ల రూపాయల లావాదేవీలను ఎవరి జోక్యం లేకుండా స్వతంత్రంగా పర్యవేక్షించుకుంటున్న బీసీసీఐ ప్రస్తుత, మాజీ అధికారులకు ఇది రుచించడం లేదు. అందుకే, లోధా కమిటీ సమర్పించిన నివేదికలోని పలు అంశాలు ఆచరణలో కష్టమని, వాటిని అమలు చేయడం అసాధ్యమని బీసీసీఐ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. కోర్టులో వాదించింది. త్వరలో జరగబోయే ఎస్‌జీఎంలో ఏదీ తేల్చకుండా, చెప్పిందో మళ్లీమళ్లీ వల్లెవేసినా ఆశ్చర్యం లేదు. సుమారు నాలుగేళ్లుగా ఇదే వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్న బీసీసీఐ డిసెంబర్‌లో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏం చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

సుప్రీం కోర్టు నియమించిన ఆర్‌ఎం లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలా? లేక పాత పంథానే అనుసరిస్తూ, యుద్ధాన్ని కొనసాగించాలా? అనేది తేల్చుకోవాల్సిన సమయం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కి వచ్చేసింది. స్పష్టత ఇవ్వకుండా ఇంకా తాత్సారం చేయడం వల్ల మరింత నష్టమే తప్ప లాభం ఉండదనే విషయం బీసీసీఐకి ఇప్పటికే స్పష్టమైంది. రాద్ధాంతాలు, వాదనలు, ఎత్తుగడలు, తాత్సారాలు, కుంటిసాకులు, ఏకపక్ష నిర్ణయాలు, కాలక్షేప వ్యాఖ్యానాలకు బోర్డు చెల్లిచీటీ ఇవ్వాల్సిందే. లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలన్నింటినీ తు.చ తప్పకుండా అమలు చేయాలా? ఈ విషయంలో ఇన్నాళ్లూ చేస్తున్న వాదనను విరమించుకోవాలా? శరణమంటూ రాజీపడాలా? లేక అమీతుమీ తేల్చుకోవడానికి యుద్ధ్భేరి మోగించాలా? ప్రస్తుతం బీసీసీఐని వేధిస్తున్న ప్రధాన ప్రశ్నలివి. డిసెంబర్ 9న జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఏదో ఒక దారిని ఎంచుకోక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. పాలనాధికారుల బృందం (సీఓఏ) ఆదేశాలు జారీ చేసే వరకూ ఎస్‌జీఎం గురించి బీసీసీఐ పాలక వర్గం పట్టించుకోలేదు. తక్షణమే తేదీని నిర్ణయించి, నోటీసు జారీ చేయాలని సీఓఏ స్పష్టం చేయడంతో, బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా స్పందించాడు. డిసెంబర్ ఒకటిన ఎస్‌జీఎం జరుగుతుందని నోటీసునిచ్చాడు. ఫ్యూచర్ టూర్స్ అండ్ ఫిక్చర్స్‌ను ఖరారు చేయడం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న కొచ్చి టస్కర్స్ కేరళతో రాజీ ఒప్పందం కుదుర్చుకోవడం, రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సీఏ)పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడం అనే మూడు ప్రధాన అంశాలతో తొలుత అజెండాను ప్రకటించినప్పటికీ ఆతర్వాత క్రికెటర్లకు డోప్ పరీక్ష అంశాన్ని కూడా చేర్చారు. అయతే, వీటితోపాటు లోధా సిఫార్సుల అమలుపైనా చర్చ జరగవచ్చని అంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో బీసీసీఐకి హడావుడిగా ఏదోఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే, వివిధ విచారణ కమిటీలతోపాటు ఏకంగా సుప్రీం కోర్టునే ఎదిరించే ప్రయత్నం చేసి, సమస్యను కొనితెచ్చుకుంది. తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నది. సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్రమైన పర్యవసానాలు తప్పవని తెలిసినప్పటికీ, భారత క్రికెట్‌పై తన పట్టు పోతుందేమోనన్న భయంతో ఒక్కోసారి ఒక్కో వాదనతో ముందుకొచ్చి పరువు పోగొట్టుకుంది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను ఆసాంతం అమలు చేస్తే, కోట్లాది రూపాయల ఆదాయవనరులున్న బోర్డుపై తమ పెత్తనం కొనసాగదన్న భయంతో కొంత మంది అధికారులు రకరకాలు వేషాలు వేస్తూ, వాదనలు చేస్తూ, ఎంతో విలువైన కాలాన్ని హరించివేస్తూ అందరి సహనానికీ పరీక్ష పెడుతున్నారు. వారి ప్రయత్నాలు, వ్యూహాలు బెడిసికొట్టడంతో, బీసీసీఐ దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. దీనికితోడు తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా, ప్రధాన కార్యదర్శి అమితాబ్ చౌదరితో కోశాధికారి అనిరుద్ధ్ చౌదరికి విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. లోధా సిఫార్సులు అమలు కాకుండా అడ్డుకోవడంలో వీరంతా ఒక్కటే. కానీ, ఆంతరంగిక వ్యవహారాలు, ఆధిపత్య పోరాటాలతో వీరు ఒకరికొకరు దూరమవుతున్నారు. ఫూచర్ టూర్స్ అండ్ ఫిక్స్‌చర్స్‌పై అనుసరించాల్సిన విధానాల గురించి తనకూ సమాచారం ఇవ్వాలని బోర్డు అధ్యక్షుడు ఖన్నాకు కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి లేఖాస్త్రాన్ని సంధించడం వీరి మధ్య తలెత్తిన వివాదాలకు అద్దం పడుతుంది. మరోవైపు, ఈ ముగ్గురినీ వెంటనే వారివారి పదవుల నుంచి తొలిగిస్తే తప్ప లోధా సిఫార్సుల అమలుపై తమ పనిని సజావుగా చేసుకోలేమని సుప్రీం కోర్టుకు సీఓఏ విన్నవించుకుందంటే, బీసీసీఐ అధికారుల తీరు ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. లోధా సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా పట్టించుకోకుండా, కీలక అంశాలను మినహాయించి, మిగతా వాటిని అమలు చేస్తామంటూ రోజుకో పాట పాడుతున్న బీసీసీఐ వైఖరిపై అటు కోర్టు, ఇటు సీఓఏ తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే వివిధ సందర్భాల్లో బోర్డు అనుసరిస్తున్న తీరుపై అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఇకపై మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తున్నది. లోధా సిఫార్సుల నేపథ్యంలోనే అధ్యక్ష, కార్యదర్శి పదవుల నుంచి అనురాగ్ ఠాకూర్, రాహుల్ జోహ్రిలను తొలగించిన సుప్రీం కోర్టు తాత్కాలిక అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతున్నది. అంతకంటే ముందు, ఎస్‌జీఎంలో బీసీసీఐ తీసుకోబోయే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. లోధా సిఫార్సులను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేయడమంటే, దశాబ్దాలుగా భారత క్రికెట్‌పై కొనసాగిస్తున్న అధికారాన్ని అంతోఇంతో వదులుకోవాలి. అందుకు సిద్ధపడాలి. ఎలాగూ అధికారం చేజారిపోతుంది కాబట్టి అమీతుమీ తేల్చుకుందాం అనుకుంటే యుద్ధాన్ని ప్రకటించక తప్పదు. ఈ రెండు దారుల్లో బీసీసీఐ దేనిని ఎంచుకుంటుందో చూడాలి.
లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి బిసిసిఐ ఎందుకు భయపడుతున్నదో తెలుసుకోవాలంటే, ముందుగా ఆ కమిటీ చేసిన సూచనలను ఒకసారి పరిశీలించాలి. క్రికెట్ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై లోధా కమిటీ దృష్టి సారించింది. క్రికెట్‌తో సంబంధం లేనివారే క్రికెట్ బోర్డు, సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కారణంగానే సమస్యలు తలెత్తుతున్నాయని నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. రాజకీయ నేతలను క్రికెట్‌కు దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మంత్రలు ఎవరూ బిసిసిఐ లేదా దాని అనుబంధ సంఘాల పాలక మండళ్లలో సభ్యులుగా ఉండరాదని స్పష్టం చేసింది. దశాబ్దాలుగా బిసిసిఐని శాసిస్తున్నది రాజకీయ నాయకులు లేదా వ్యాపారవేత్తలేనన్నది జగమెరిగిన సత్యం. అందుకే, వారంతా లోధా సూచనలను వ్యతిరేకిస్తున్నారు. వారి చెప్పుచేతల్లో ఉంది కాబట్టి, ఆ వాదనే బోర్డు వాదనగా మారింపోయింది. కాగా, లోధా కమిటీ చేసిన మరో కీలక సూచన కూడా చాలా మందికి మింగుడు పడడం లేదు. బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర హోదాల్లో ఉన్నవారికి కొన్ని ప్రత్యేక అర్హతలు అవసరమని లోధా కమిటీ స్పష్టం చేసింది. దీనిని ఆమోదించడమంటే, తమ పతనానికి తామే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుందని బోర్డు పెద్దలకు అర్థమైంది. పాలక మండలి సభ్యుల్లో ఎవరి వయసూ 70 సంవత్సరాలకు మించరాదన్నది లోధా కమిటీ అభిప్రాయం. బోర్డుపై ఇప్పటికీ పెత్తనం చెలాయించాలని చూస్తున్న చాలా మంది ఈ వయసును దాటేశారు. ఈ నిబంధనను అమలు చేయడం బోర్డు పదవులను పట్టుకొని వేళ్లాడాలనుకుంటున్న వారికి ఇష్టంలేదు. చివరికి సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, సస్పెండ్ చేసే వరకూ చాలా మంది తమ పదవుల్లోనే కొనసాగిన వైనం మనకు తెలియందికాదు. కార్యవర్గ సభ్యుల పదవీకాలంపై సీలింగ్ విధించాలని, ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లు, మొత్తం మీద గరిష్టంగా మూడుసార్లు ఎన్నికకావచ్చని పేర్కొంది. అంతకంటే ఎక్కువ పర్యాయాలు పదవిలో ఉండకూడదని తేల్చిచెప్పడం సైతం బోర్డు అధికారులకు ఏమాత్రం నచ్చడం లేదు. దశాబ్దాలపాటు అధికారంలో ఉంటూ, భారత క్రికెట్‌పై పెత్తనం చెలాయిస్తూ, కోట్లాది రూపాయలను విచ్చలవిడగా ఖర్చు చేసే వారు సహజంగానే ఈ మార్పును వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలన్న సూచనకు బీసీసీఐ సభ్య సంఘాలు ససేమిరా అంటున్నాయి. క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉండి, ప్రతి మ్యాచ్‌కీ స్టేడియాలు నిండిపోయే రాష్ట్రాలను, అసలు క్రికెట్ పట్ల ఏమాత్రం ఆసక్తి చూపని రాష్ట్రాలను ఒకే రీతిలోచూడడం ఏ విధంగా సాధ్యం కాదన్నది బీసీసీఐ వాదన. బోర్డు అధ్యక్షుడికి మూడు ఓట్లు వేసే హక్కును తీసివేయాలని, ప్రజలతో ప్రత్యేక సంబంధం ఉంది కాబట్టి జవాబుదారీ వహించాలని, సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి రావాలని లోధా చేసిన సిఫార్సులను ఆమోదించి, అమలు చేయడానికి బీసీసీఐ సుముఖంగా లేదు. ఈ మార్పులకు అనుగుణంగా నిబంధనావళిని మార్చడానికి కూడా ఇష్టపడడం లేదు. అందుకే, వచ్చేనెల 9వ తేదీ నాటి ఎస్‌జీఎంలో జరగబోయే చర్చ, తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. ఈ సస్పెన్స్‌కు ఎంత త్వరగా తెరపడితే, భారత క్రికెట్‌కు అంత మంచిది.

- కౌస్త్భు