ఆటాపోటీ

కత్తిసాముకు కొత్త రూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర మొత్తం యుద్ధాలమయమని, రక్తసిక్తమని అన్నాడో కవి. రాజుల కాలం అంటే ముందుగా గుర్తుకొచ్చేవి యుద్ధాలే. యుద్ధాలంటే శిరస్త్రాణం, కవచాలను ధరించిన వీరులు కళ్ల ముందు మెదులుతారు. పాత, కొత్త రాతి యుగాల్లో రాళ్లే ఆయుధాలైతే, లోహ యుగం ఆరంభం నుంచి కత్తులే ప్రధాన ఆయుధాలయ్యాయి. పరాక్రమానికి ప్రతీకగా కత్తి యుద్ధాన్ని పేర్కోవడం ఆనవాయితీగా మారింది. బాణాలు, శూలాలు, ఇతర ఆయుధాలను దూరం నుంచి ప్రయోగిస్తారు. కత్తితో ద్వంద్వ యుద్ధమే జరుగుతుంది. విజేతే వీరుడిగా ప్రజల నీరాజనాలు అందుకుంటాడు. యుద్ధాలు ఎప్పుడు, ఏ రకంగా వచ్చిపడతాయో తెలియదు కాబట్టి, సైనికులను ఎప్పుడూ సన్నద్ధంగా ఉంచడానికి కత్తిసామును నేర్పించడానికి శిబిరాలను నిర్వహించేవారు. నాటి కత్తిసాముకు కొత్త రూపమే నేటి ఒలింపిక్ క్రీడ ఫెన్సింగ్. ఈనెల 26, 27 తేదీల్లో బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరిగే ప్రపంచ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు వివిధ దేశాలకు చెందిన ఫెన్సర్లు హాజరవుతారు. ఎపీ, ఫాయిల్, సబ్రే విభాగాల్లో పురుషులు, మహిళలకు వేరువేరుగా ఇండివిజువల్, టీం ఈవెంట్స్‌లో పోటీలు జరుగుతాయి. ఫెన్సర్లు వాడే ఆయుధం (కత్తి) తీరునుబట్టి ఈ విభాగాలను నిర్ణయించారు. ప్రతి విభాగానికి నిర్దిష్టమైన నిబంధనలు వర్తిస్తాయి. ఎపీ తరహా కత్తులు సుమారు 500 గ్రాముల బరువు ఉంటాయి. ద్వంద్వ యుద్ధంలో ప్రత్యర్థి ఛాతీ, మెడ, పొత్తికడుపును లక్ష్యంగా చేసుకొని కొట్టాలి. కాళ్లూ, చేతులకు కత్తి తగలకూడదు. ఫెన్సర్లు చేతులకు గాయాలు కాకుండా ప్రత్యేకమైన ఆర్మ్ బ్యాండ్స్‌ను వాడతారు. కత్తి మొన తగిలినంత మాత్రాన పాయింట్లు లభించవు. కత్తి బలంగా, ఒకవేళ శిరస్త్రాణాలు, కవచాలు లేకపోతే తీవ్రంగా గాయపడే విధంగా తగలాలి. అప్పుడే పాయింట్లు లభిస్తాయి. ఇద్దరు ఫెన్సర్లు ఒకేసారి అటాక్ దాడిని మొదలుపెట్టాలి. ఐదు హిట్స్‌తో కూడిన బౌట్స్ పూర్తయ్యే సమయానికి ఎవరు ఎక్కువ పాయింట్లు సంపాదిస్తే వారే విజేతలు. ఎపీ కత్తి కూడా దాదాపుగా ఫాయిల్ కత్తి మాదిరే కనిపిస్తుంది. అయితే, ఇది సుమారు 775 గ్రాముల బరువు ఉంటుంది. ఫాయిల్ కంటే ఎక్కువ విస్తీర్ణంతో కూడిన రింగ్స్‌లో ఫైట్ కొనసాగుతుంది. ఫాయిల్‌లో ఉన్న నిబంధనలే ఎపీలోనూ వర్తిస్తాయి. కత్తి మొత్తం ప్రత్యర్థికి తగలకూడదు. కేవలం కత్తి మొన మాత్రమే బలంగా తగలాలి. స్కోరింగ్ విధానంలో కొన్ని మార్పులను మినహాయిస్తే ఫాయిల్, ఎపీ పోటీలు దాదాపు ఒకే తరహాలు, ఒకే రకమైన నిబంధనలతో జరుగుతాయి. ఫాయిల్, ఎపీ విభాగాల్లో కత్తి ప్రత్యర్థుల చేతులకు తగలకూడదు. కానీ, సబ్రేలో నడుము పైభాగంలో ఏ శరీర భాగాన్నయినా లక్ష్యంగా చేసుకొని దాడులు చేయవచ్చు. అందుకే, దాదాపు శరీరం మొత్తం కవచాలు అవసరమవుతాయి. సాధరణ తెల్లని దుస్తుల మాదిరి కనిపించే ఈ కవచాల్లో ‘లేమ్’ అనే ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అమరుస్తున్నారు. దీనితో సరైన హిట్ తగిలిన వెంటనే పాయింట్లు స్కోరుబోర్డుపై కనిపిస్తాయి. రక్షణ కవచాలకు అనుసంధానం చేసిన లేమ్ ద్వారా టార్గెట్ హిట్ సరైనదో కాదో నిర్ధారించవచ్చు. ఫాయిల్, ఎపీ ఫైట్స్‌లో కేవలం కత్తి చివరి భాగం మాత్రమే తగలాలి. కానీ, సబ్రేలో కత్తి ఇరువైపులను దాడికి వాడుకోవచ్చు. ఒక రకంగా విస్తృత పరిధిలో జరిగే ఫెన్సింగ్ పోటీనే సబ్రే. కాగా, ఈ మూడు విభాగాల్లోనూ ఫెన్సర్లు జాకెట్, గ్లోవ్, సాస్-ప్లాస్ట్రాన్, బ్రీచెస్/ నిక్కర్స్, మాస్క్, సాక్స్, షూస్ వంటి రక్షణ కవచాలను ఫెన్సర్లు ఉపయోగిస్తారు. మహిళా స్పెన్సర్లకు చెస్ట్ ప్రొటెక్టర్ పేరుతో మరో కవచం ఉంటుంది.
ఘన చరిత్ర
ఒకప్పటికి కత్తి యుద్ధం నుంచే నేటి ఫెన్సింగ్ క్రీడ పుట్టింది. కత్తిసాముకు ఒక క్రీడారూపాన్నిచ్చిన ఘనత స్పెయిన్‌దే. 1458-1471 మధ్యకాంలో డిగో డి వలేరా రాసిన ‘ట్రీటైస్ ఆన్ ఆర్మ్స్’ ఫెన్సింగ్‌పై మనకు అందుబాటులోకి వచ్చిన పుస్తకం. అప్పట్లో స్పెయిన్‌లో ఫెన్సింగ్ ముఖ్యమైన క్రీడగా ఉండేది. దాదాపు అదే సమయంలో కాథలిక్ పాలకులు ఫెన్సింగ్‌ను నిషేధించారు. కానీ, స్పెయిన్ సైనికులు ఈ క్రీడను విశ్వవ్యాప్తం చేశారు. అన్ని దేశాల కంటే ఇటలీ ముందుగా దానిని సొంతం చేసేసుకుంది. అనంతరం స్పెయిన్, ఇటలీ దేశాలు ఫెన్సింగ్‌లో చిరకాల ప్రత్యర్థులుగా మారాయి. క్రీస్తు శకం 1602 సంవత్సరానికి కంటే ముందే వచ్చిన ‘ది మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్’ నాటికలో ఫెన్సింగ్ ప్రస్తావన ఉంది. అత్యాధునిక ఫెన్సింగ్ 18 శతాబ్దంలో బలమైన పునాదులు వేసుకుంది. ఫ్రెంచ్ స్కూల్ ఆఫ్ ఫెన్సింగ్ ఏర్పడిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఈక్రీడ మిగతా దేశాలకు విస్తరించింది. ఇటలీ, స్పెయిన్ దేశాల్లోనూ ఫెన్సింగ్ స్కూల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే శతాబ్దంలో లండన్‌లోని కార్లిసెల్ హౌస్‌లో ఏంజెలోస్ స్కూల్ ఆఫ్ ఆర్మ్స్ పేరుతో ఫెన్సింగ్ అకాడెమీని డొమెనికో ఏంజెలో నెలకొల్పాడు. 1763లో స్థాపించిన ఈ అకాడెమీనే ఫెన్సింగ్‌ను ఆధునిక క్రీడగా మార్చింది. సంప్రదాయంగా వస్తున్న కత్తిసాముకు కొత్త సొబగులు అద్దింది. సుమారు మూడు శతాబ్దాలపాటు ఏంజెలో కుటుంబీకులు ఐరోపా అంతటా ఫెన్సింగ్ స్కూల్స్‌ను తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. ఫలితంగా వారు నిర్ధారించిన సూత్రాలు, ప్రవేశపెట్టిన నిబంధనలే ఫెన్సింగ్ మార్గదర్శకమయ్యాయి. ఏంజెలో రాసిన నిబంధనల పుస్తకానే్న ఒలింపిక్స్‌సహా అన్ని స్థాయిలో ఫెన్సింగ్ పోటీల్లోనూ ప్రామాణిగంగా పరిగణిస్తున్నారు.
మొదటి పోటీ
ఆధునిక క్రీడా చరిత్రలో మొట్టమొదటి అధికారిక ఫెన్సింగ్ పోటీలు 1880లో జరిగాయి. లండన్‌లోని ఇస్లింగ్టన్‌లో గ్రాండ్ మిలటరీ టోర్నమెంట్ అండ్ అసాల్ట్ ఎట్ ఆర్మ్స్ పేరుతో నిర్వహించిన ఈ పోటీలకు విశేష ఆదరణ లభించింది. సైనికులు, సైనికాధికారుల మధ్య ఈ పోటీను జరిపారు. ఆ రోజుల్లో జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్‌కు కలిపి ఒకే సంఘం ఉండేది. ఈ సంఘమే ఏంజెలో రూపొందించిన నిబంధనల్లో కొద్దిపాటి మార్పులు చేసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి)కి అంద చేసింది. 1896లో ఆధునిక ఒలింపిక్స్ ఆరంభమైనప్పుడు ఫెన్సింగ్‌కు కూడా అందులో స్థానం లభించింది. మొదటి ఒలింపిక్స్‌లో సబ్రే ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. రెండో ఒలింపిక్స్‌లో ఎపీ రంగ ప్రవేశం చేసింది. ఫాయిల్ ఈవెంట్ 1908 ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసింది.

నిరుటి విజేతలు
మహిళల విభాగం
ఇండివిజువల్ ఎపీ: రోసెల్లా ఫియామింగో (ఇటలీ/ స్వర్ణం), ఎమ్మా శామ్యూల్స్ (స్విట్జర్లాండ్/ రజతం), సారా బేస్బెస్ (టర్కీ/రజతం)/ ఝూ ఆంకీ (చైనా/ కాంస్యం).
టీం ఎపీ: చైనా (హవో జియాలో, సన్ యూజీ, సన్ ఇవెన్, జూ అన్కీ/ స్వర్ణం), రుమేనియా (రజతం), ఉక్రెయిన్ (కాంస్యం).
ఇండివిజువల్ ఫాయిల్: ఇన్నా డెరిగ్జోజువా (రష్యా/ స్వర్ణం), ఐదా హనమేవా (రష్యా/ స్వర్ణం), అరియానా ఎరిగో (ఇటలీ/ కాంస్యం)/ జింగా ప్రస్కాడ్ (అమెరికా/ కాంస్యం).
టీం ఫాయిల్: మార్టినా (మార్టినా బాటినీ, ఎలిసాడి ఫ్రాన్సిస్కో, అరియానా విరిగో, వలెంటీనా వెజాలీ/ స్వర్ణం), రష్యా (రజతం), ఫ్రాన్స్ (కాంస్యం).
ఇండివిజుల్ సబ్రే: సోఫియా వెలాకియా (రష్యా/ స్వర్ణం), సెసిల్లా బెర్డర్ (ఫ్రాన్స్/ రజతం), హెన్ చెన్ (చైనా/ కాంస్యం)/ అనా మార్టిన్ (హంగరీ/ కాంస్యం).
టీం సబ్రే: రష్యా (ఎకతరీన డచెన్కో, యూనా ఎగోరియన్, యులియా గావ్రిలోవా, సోఫియా వెలాకియా/ స్వర్ణం), ఉక్రెయిన్ (రజతం), అమెరికా (కాంస్యం).

ఆధునిక ఒలింపిక్స్‌లో మొదటి నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఐదు క్రీడాంశాల్లో ఫెన్సింగ్ ఒకటి. మిగతా నాలుగు అథ్లెటిక్స్, సైక్లింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్. ఆధునిక ఫెన్సింగ్‌ను ఒలింపిక్ ఫెన్సింగ్ అని కూడా పిలుస్తారు. ఇటలీలో ప్రాచుర్యం పొందిన ‘క్లాసిక్ ఫెన్సింగ్’నే దాదాపు అన్ని దేశాలూ అనుసరిస్తున్నాయి. ఎపీ, ఫాయిల్, సబ్రే విభాగాల్లో ఒకదానిని ఎంచుకొని, అందులోనే ఫెన్సర్లు శిక్షణ పొందుతారు. ఒక విభాగం వారు మరో విభాగం పట్ల ఆసక్తిని ప్రదర్శించరు.
ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో సుమారు 43,000 ఫెన్సింగ్ క్లబ్స్ ఉన్నాయి. 15 లక్షలకుపైగా ఔత్సాహికులు ఫెన్సింగ్‌ను నేర్చుకుంటున్నారు. ఈక్లబ్స్‌లో దాదాపు సగం ఐరోపాలోనే ఉన్నాయి. అమెరికా 35 శాతం, ఆసియాలో 10 శాతం, ఆఫ్రికాలో 5 శాతం ఉన్నాయి. నెట్లు, బంతులు, బ్యాట్లు లేకుండా కేవలం ఫాయిల్ ఉంటే ఫెన్సింగ్‌ను ప్రాక్టీస్ చేయవచ్చు. అందుకే క్రమంగా ఎక్కువ మంది ఈ క్రీడ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు పరస్పరం తలపడే రెజ్లింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో వివిధ వెయిట్స్‌గా పోటీలను విభజిస్తారు. ఫెన్సింగ్‌లో మాత్రం అలాంటి వెయిట్ విభజన లేదు.

పురుషుల విభాగం
ఇండివిజువల్ ఎపీ: గెజ్ ఇమ్రే (హంగరీ/ స్వర్ణం), గాథియర్ గ్రూమెర్ (ఫ్రాన్స్/ రజతం), జంగ్ డియోంగ్‌వా (కొరియా/ కాంస్యం)/ పాట్రిక్ జార్జినొన్ (డెన్మార్క్/ కాంస్యం).
టీం ఎపీ: ఉక్రెయిన్ (అనతొలి హెరే, దిమిత్రో కర్యుచెన్కో, మార్కిమ్ ఖూరొస్ట్, బొధాన్ నికిషిన్/ స్వర్ణం), దక్షిణ కొరియా (రజతం), స్విట్జర్లాండ్ (కాంస్యం).
ఇండివిజువల్ ఫాయిల్: యుకీ ఒటా (జపాన్/ స్వర్ణం), అలెగ్జాండర్ మసియలాసిలోస్ (అమెరికా/ రజతం), ఆర్థర్ అట్మాఖుజిన్ (రష్యా/ కాంస్యం)/ గెరెక్ మీన్హార్డ్ (అమెరికా/ కాంస్యం).
టీం ఫాయిల్: ఇటలీ (జార్జియో అవోలా, ఆండ్రియా బెల్డినీ, ఆండ్రె కాసరా, డానియేల్ గారోజో/ స్వర్ణం), రష్యా (రజతం), చైనా (కాంస్యం).
ఇండివిజువల్ సబ్రే: అలెక్సీ యాకిమెన్కో (రష్యా/ స్వర్ణం), డెరిల్ హోమర్ (అమెరికా/ రజతం), తిబురు డొనికెమా (రుమేనియా/ కాంస్యం)/ మాక్స్ హార్టింగ్ (జర్మనీ/ కాంస్యం).
టీం సబ్రే: ఇటలీ (ఎన్రికో బెరె, లూకా కరటోలీ, ఆల్డో మోంటానో, డిగో అహియూజీ/ స్వర్ణం), రష్యా (రజతం), జర్మనీ (కాంస్యం).

ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన ఫెన్సింగ్ క్లబ్ ‘కాఫ్రెరీ డి సెయింట్ మిచెల్’. బెల్జియంలోని గెంట్‌లో దీనిని 1613లో స్థాపించారు. ఫుట్‌బాల్‌లో పురాతన క్లబ్స్ షీఫీల్డ్ (1857), హలామ్ (1860), వర్క్‌సొమ్ టౌన్ (1861) కంటే ఇది సుమారు 250 సంవత్సరాలు ముందుగానే ఏర్పడింది.
ఈజిప్టులోని పలు మందిరాల్లో చిత్రాలు కనిపిస్తాయి. అవి సుమారు క్రీస్తు పూర్వం 1190 ప్రాంతానికి చెందినవిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. దాదాపు ప్రతి మందిరంలోని చిత్రాల్లో కనీసం ఒక బొమ్మ ఫెన్సింగ్ మ్యాచ్‌కి సంబంధించింది కావడం విశేషం.

- ఎస్‌ఎంఎస్