ఆటాపోటీ

అయ్యో ఓ ‘సాంబా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్ కోసం రియో నగరం నుంచి సుమారు 77,000 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. వీరిలో ఎక్కువ శాతం మంది తమతమ నివాసాలను వదలి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీనితో అధికారులు బలవంతంగా వారిని తరలించాల్సి వచ్చింది. కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే, నిరాశ్రయులైన వారు కూడా వారితో జతకట్టారు. నిరసన ప్రదర్శనలు పెరుగుతుంటే, ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుందోనని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. అందుకే ముందు జాగ్రత్తగా 85,000 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో వినియోగించిన సంఖ్య కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. బ్రెజిల్ పోలీసులు సగటున ఏడాదికి 1,900 మందిని కాల్చి చంపుతారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఒక ఏడాదిలో రియో నగరంలోనే సగటున 307 మంది పోలీసుల చేతిలో మరణిస్తున్నారు. వివిధ కారణాలతో ఆందోళనలు చేస్తున్న వారిపై తుపాకీ ఎక్కుపెట్టడం, పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయడం అక్కడ ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రియో ఒలింపిక్స్ సజావుగా సాగుతాయా? విజయవంతంగా ముగుస్తాయా? అన్న ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 80 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీక్షించే ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని దక్కించుకున్న ఏ దేశమైనా ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. రూపాయి ఖర్చుపెట్టి పది రూపాయలు సంపాదించుకోవచ్చని ఆనందిస్తుంది. ఆర్థికంగా ఎదుగుదలకు, రాజకీయంగా ప్రాపకాన్ని సంపాదించుకోవడానికి ఒలింపిక్స్‌ను వేదికగా తీసుకుంటుంది. లక్ష్యాలను సులభంగా అందుకుంటుంది. కానీ, ఒలింపిక్స్‌కు మొట్టమొదటిసారి ఆతిథ్యమిస్తున్న దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌కు ఒలింపిక్స్ గుదిబండగా మారాయి. ఖర్చే తప్ప రాబడి కనిపించడం లేదు. ‘సాంబా’ దేశం అనుకున్నది ఒకటి, అయినది మరొకటికాగా, దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నది. పంటి బిగువున ఒలింపిక్స్‌ను నిర్వహిస్తున్నది.
అంతర్యుద్ధం!
ఒలింపిక్స్ కారణంగా బ్రెజిల్‌లో అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన తరుణంలో కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఒలింపిక్స్‌ను నిర్వహించాల్సిన అవసరం ఉందా అంటూ ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్ ప్రధాన కేంద్రమైన రియో జాతీయ స్టేడియం వద్ద దాదాపుగా రోజూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. పోలీసుల లాఠీ చార్జి, బాష్పవాయువు ప్రయోగం నిత్యకృత్యాలయ్యాయి. తాజాగా నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు భద్రతా బలగాలు గాల్లో కాల్పులు కూడా జరిపాయ. మరోవైపు విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దొంగలు తెగబడుతున్నారు. పాత్రికేయులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపుతోంది. ఆర్థికంగా దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్న బ్రెజిల్‌లో రాజకీయ వాతావరణం కూడా ఒలింపిక్స్‌కు ఏమాత్రం అనుకూలంగా లేదన్నది వాస్తవం. అధ్యక్షురాలు డెల్మా రూసెఫ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నది. ఆమె స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మైఖేల్ టెమెర్ పరిస్థితులను ఆకళింపు చేసుకోలేకపోతున్నాడు. ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం పెల్లుబుకుతున్న తరుణంలో వారిని ఏవిధంగా శాంతింప చేయాలో అర్థంగాక అతను మల్లగుల్లాలు పడుతున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించే పరిస్థితుల్లో కూడా అతను లేడని ఒలింపిక్స్ కేంద్రాల వద్ద చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. పెను భారంగా మారిన ఒలింపిక్స్ కారణంగా బ్రెజిల్ అప్పుల్లో కూరుకుపోయింది. లాభం మాట ఎలావున్నా, సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడితే చాలని బ్రెజిల్ సర్కారు అనుకుంటున్నది. ఒలింపిక్స్‌ను నిర్వహిస్తున్నందువల్ల లాభం మాట ఎలావున్నా భారీ నష్టం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అవి ఫలించినా, ఇప్పటి వరకూ జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే బ్రెజిల్‌కు కనీసం ఐదారేళ్లు పడుతుంది. అప్పటి వరకూ ప్రజలు అనేకానేక త్యాగాలు చేయాలి. కష్టాలను కలసికట్టుగా ఎదుర్కోవాలి. అందుకు సిద్ధపడకుండా ఆందోళనకు దిగితే, ఘర్షణలు చివరికి అంతర్యుద్ధంగా మారే ప్రమాదం ఉంది.
నష్టం ఎందుకు?
ఒలింపిక్స్ వల్ల ఒక దేశం నష్టపోయే పరిస్థితి దాదాపుగా రాదు. కానీ, బ్రెజిల్ పరిస్థితి వేరు. అక్కడ ప్రజల నుంచి ఒలింపిక్స్‌కు సానుకూల స్పందన లేదు. ఈ క్రీడలను బహిష్కరించాల్సిందిగా వివిధ ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలిచ్చిన పిలుపు తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఏ స్టేడియంలో చూసినా సీట్లు పదిహేను, ఇరవై శాతం కంటే ఎక్కువ నిండడం లేదు. ఒకవైపు స్టేడియాల వెలుపల నిరసన ప్రదర్శనల హోరు.. మరోవైపు స్టేడియంలో లోపల వెక్కిరిస్తున్న ఖాళీ సీట్లు.. చివరికి బ్రెజిల్‌లో టీవీ సెట్ల ముందు కూర్చొని ఒలింపిక్స్ ఈవెంట్స్‌ను చూసే వారు కూడా కరవయ్యారు. సహజంగా ఈవెంట్స్‌కు ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటుందో అంత భారీగా ఖర్చు చేయడానికి స్పాన్సర్లు ముందుకొస్తారు. బహుళజాతి కంపెనీలు వ్యాపార ప్రకటనలు గుప్పిస్తాయి. బూట్ల నుంచి భోజనం వరకూ అన్నింటికీ స్పాన్సర్‌షిప్ లభిస్తుంది. ఆతిథ్య దేశానికి ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, అండార్స్‌మెంట్లు, టీవీ ప్రసార హక్కుల వేలం వంటి వివిధ మార్గాల్లో భారీగా ఆదాయం చేతికి అందుతుంది. కానీ, బ్రెజిల్‌లో ఒలింపిక్స్‌కు స్పందన దాదాపుగా లేకపోవడంతో బహుళజాతి కంపెనీలు ఉత్సాహం చూపడం లేదు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వచ్చే సొమ్ము తప్ప అదనంగా ఒక్క పైసా రావడం లేదు. అంచనా వ్యయం భారీగా పెరిగి, ఆశించిన మొత్తంలో రాబడి లేకపోవడంతో బ్రెజిల్ ఖజానా ఖాళీ అవుతున్నది. ఒలింపిక్స్ కోసం కొన్ని కొత్త నిర్మాణాలను చేపట్టారు. మరికొన్నింటికి మరమ్మతులు చేశారు. వీటి కోసం పెద్ద మొత్తాల్లో ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. నాసిరకం నిర్మాణాలు తలనొప్పిగా మారాయి. స్టేడియాల్లోనేగాక, క్రీడా గ్రామంలోనూ వౌలిక సదుపాయాల కొరత వేధిస్తున్నది. వివిధ దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు, అధికారులు, అభిమానులు అడుగడుగునా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికితోడు విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దొంగలు విజృంభిస్తున్నారు. క్రీడా గ్రామంలోనే కొన్ని దేశాల అథ్లెట్ల కిట్లు మాయమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. విదేశీయులపై జరుగుతున్న దాడులు, వారి నిలువు దోపిడీ సంఘటనలు బ్రెజిల్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రవాదులు 2009 మార్చి 4న దాడి చేశారు. ఆ సంఘటన తర్వాత ఇప్పటి వరకూ జింబాబ్వే, కెన్యా వంటి అనామక దేశాలు తప్ప క్రికెట్ ఆడే దేశాలు ఏవీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తటస్థ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని ఎంచుకొని పాక్ క్రికెట్ జట్టు హోం సిరీస్‌లను ఆడుతున్నది. స్వదేశంలో సిరీస్‌లు జరగకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) దివాలా తీసింది. అక్కడి ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక సాయంతో రోజులు నెట్టుకొస్తున్నది. ఈ సంఘటన కారణంగానే పాక్‌లో పర్యాటక రంగం పడకేసింది. ఒక్క క్రికెట్ జట్టుపై దాడి జరిగితేనే ఇంత అనర్థం చోటు చేసుకుంటే, వివిధ దేశాలకు చెందిన పౌరులపై జరుగుతున్న వరుస దాడుల ప్రభావం బ్రెజిల్‌పై ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటూ, అన్ని రకాలుగా పతనావస్థలో ఉన్న బ్రెజిల్‌కు పర్యాటక శాఖ కూడా దివాలా తీస్తే భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఆందోళన కలిగిస్తున్నది. మొత్తం మీద ఒలింపిక్స్ బ్రెజిల్‌ను నిలువునా ముంచేస్తున్నాయి.

- విశ్వ