ఈ వారం కథ

బ్లాక్ అండ్ వైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేష్‌కుమార్ స్నేహితులతో వీక్‌ఎండ్ పార్టీలో బిజీబిజీగా వున్నాడు. శుక్రవారం సాయంకాలం రాజేష్, అతని మిత్రులు అంతా ఫార్చ్యూన్ హోటల్‌కి చేరుకుని సరదాగా గడుపుతుంటారు. రాజేష్ బి.టెక్ తర్వాత కొంతకాలం జాబ్ చేసి, అది నచ్చక స్వంతంగా బిజినెస్ చేస్తున్నాడు.
రాజేష్ జేబులో సెల్‌ఫోన్ ‘వైబ్రేషన్’లో వుంది. అదేపనిగా చప్పుడు చేస్తూ గిలిగింతలు పెడుతోంది. అతను విసుగ్గా సెల్‌లో డిస్‌ప్లే అవుతున్న నెంబర్ చూశాడు. వెంటనే అతని ముఖం వెలిగిపోయింది. అది తన భార్య సరయు నెంబర్.
‘‘హలో సరూ..!’’ అన్నాడు ఆతృతగా.
‘‘బాబూ..! నేను ప్రకాశరావుని..’’
‘‘మామయ్యా..! మీరా?’’
‘‘గుడ్ న్యూస్.. సరయుకి నార్మల్ డెలివరీ అయింది. కవలలు పుట్టారు.’’
‘‘‘కవలలా..?’’’
‘‘ఔను.. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కంగ్రాచ్యులేషన్స్’’
‘‘నేనే మీకు చెప్పాలి మామయ్యా ! ఐయామ్ హేపీ.. నేను రేపే వస్తున్నాను. సరయుకి చెప్పండి’’ ఆనందంగా చెప్పాడు రాజేష్.
‘‘ఏంట్రా బాబూ! హేపీ అంటున్నావ్? మీ ఆవిడ డెలివరీ అయ్యిందా? మగపిల్లాడే పుట్టాడా?’’ ఒక ఫ్రెండ్ అడిగాడు.
‘‘మగపిల్లాడితో పాటు పాప కూడా! ట్విన్స్..!’’ చెప్పాడు వెలిగిపోతున్న ముఖంతో.
‘‘బతికిపోయావు పో...!’’
‘‘ఏం?’’
‘‘ఆడపిల్ల పుడితే మీ అమ్మ వారసుణ్ణి కనలేదని కోడల్ని సతాయించేది. నాకు తెలుసురా! మీ అమ్మకు మనవడు పుట్టాలని కోరిక’’.
‘‘అదేం కాదులే! నాకైతే పాప పుడితేనే హేపీ. పాప కావాలనే వుంది. నాకు, మా చెల్లెలికి టూ ఇయర్సే గ్యాప్. అది నాతోటిదే కావడంతో పిల్లల్ని ఎత్తుకుని ముద్దు చేసి ఆడించాలనే కోరిక అంతర్లీనంగా వుండిపోయింది. తర్వాత ఏ పాపను చూసినా ఎత్తుకోవాలని వుర్రూతలూగుతూ వుండేవాడిని. మా వీధిలో ఎవరింట్లో పాప వున్నా ఎత్తుకుని ముద్దు చేసేవాడిని’’ చెప్పాడు రాజేష్.
‘‘ఎనీహౌ.. నీ కోరిక తీరింది. నీదే కాదు.. మీ అమ్మది కూడా! ఒక దెబ్బకు రెండు పిట్టలు. కంగ్రాట్స్!’’
‘‘్థంక్యూ... థాంక్యూ.. ఈవాళ బిల్లు నేనే పే చేస్తాను’’ చెప్పాడు రాజేష్.
***
‘‘ఫ్లైట్‌లో ఎందుకురా! అంత ఖర్చు ఎందుకు? ట్రైన్‌లో టిక్కెట్ బుక్ చెయ్యి పొద్దునే్న. తత్కాల్‌లో బెర్తులు దొరుకుతాయి. ఇప్పుడు పండగ సీజన్ కూడా కాదు’’ అన్నది కనకదుర్గ కొడుకుతో.
‘‘నాకు వెంటనే పిల్లల్ని చూడాలని వుందమ్మా!’’ అన్నాడు రాజేష్.
‘‘మీ మామయ్యకు చెప్పరా! పిల్లల ఫొటోలు వాట్సప్‌లో పంపమని’’.
‘‘అట్లా వద్దు. నేనే వెళ్లి పర్సనల్‌గా చూడాలి. పిల్లల్ని ఎత్తుకోవాలి.’’
‘‘సరేరా! నీ ఇష్టం..!’’ అన్నది కనకదుర్గ.
‘‘నువ్వు అన్నీ సర్దుకుని రెడీగా వుండు..!’’ చెప్పాడు రాజేష్.
కనకదుర్గకూ సంబరంగానే వుంది మనవడు పుట్టాడని. కొడుకు ఆతృత చూసి లోలోపల మురిసిపోయింది.
***
విశాఖపట్నంలో ఫ్లైట్ దిగగానే అత్తగారింటికి వెళ్లి ప్రెష్ అయి హాస్పిటల్‌కి వెళ్లారు తల్లి, కొడుకు. అది చిన్న నర్సింగ్ హోమ్. దాన్ని చూసి కనకదుర్గ ముఖం చిట్లించింది.
‘‘ఇదేంటండీ..? ఇంత చిన్న హాస్పిటల్లో చేర్చారు? వైజాగ్‌లో పెద్ద హాస్పిటల్స్ ఏమీ లేవా?’’ అన్నది.
‘‘ఉన్నాయండీ! ఇక్కడి డాక్టర్ దమయంతి మాకు బంధువు. అంతేకాదు చాలా సీనియర్ గైనకాలజిస్ట్. చాలా దయగల మనిషి. ‘జనతా హాస్పిటల్’ అని పేరు పెట్టి బీదవాళ్ళకి కూడా అందుబాటులో ట్రీట్‌మెంట్ ఇస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ అని పేరేగాని నార్మల్ డెలివరీ కానిస్తారా? అందరికీ సిజేరియనే చేసి భారీగా డబ్బు గుంజుతారు’’ అన్నాడు ప్రకాశరావు.
‘‘ఔనమ్మా! మావయ్య చెప్పింది నిజమే. కార్పొరేట్ హాస్పిటల్స్ వారు అవసరం వున్నా లేకపోయినా రకరకాల టెస్టు చేయించడం, ఆపరేషన్లు చేయడం, లక్షల్లో బిల్లులు వేసి జనాన్ని పీడించడం గురించి పేపర్లో న్యూస్ వస్తోంది కదా. వాళ్ళదంతా పక్కా బిజినెస్’’ చెప్పాడు రాజేష్.
సరయు పిల్లల్ని చూసుకుంటూ మురిసిపోతోంది. రాజేష్ పాపను ఎత్తుకుని ‘‘అమ్మా..! పాప అచ్చం సరయులాగే వుంది. అదే గుండ్రటి ముఖం, పచ్చటి రంగు...!’’ అన్నాడు.
‘‘అది పచ్చగా వుంది సరే! వీడేంట్రా నల్లగా వున్నాడు’’ అన్నది మనవడిని ఎత్తుకున్న కనకదుర్గ.
‘‘చెల్లెమ్మా! వాడు మీ అబ్బాయి పోలికమ్మా!’’ అన్నాడు ప్రకాశరావు నవ్వుతూ.
‘‘నల్లగా వుంటేనేం అన్నయ్య గారూ.. నలుపులో నారాయణుడున్నాడు.. కృష్ణుడు నలుపు, రాముడు నలుపు’’ ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నది కనకదుర్గ.
‘‘బ్లాక్ అండ్ వైట్ అమ్మా! ఇద్దరూ ఒకే రంగులో వుంటే ఏం బాగుంటుంది?’’ అని జోక్ వేశాడు రాజేష్.
‘‘రివర్స్ అయి వుంటే తెలిసేది అబ్బాయి సంబరం!’’ అన్నది సరయు.
‘‘వాట్?’’
‘‘అమ్మాయి నల్లగా, అబ్బాయి తెల్లగా వుండి వుంటే..?’’
‘‘నో ప్రాబ్లమ్! నా కూతురు నల్ల బంగారం...!’’ అని గలగలా నవ్వాడు రాజేష్.
కవలలు పుట్టడం, అందులోనూ ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అవడంతో రెండు కుటుంబాలూ సంతోషంగా వున్నాయి. బారసాల తర్వాత మూడో నెల వచ్చాక పిల్లల్ని తీసుకుని అత్తగారింటికి వచ్చింది సరయు.
***
‘‘సరయు... సరయు... ఈ రోజు ఆదివారం అని ఎక్కడికో వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టకు’’ అన్నాడు రాజేష్ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ.
‘‘నేనేం పెట్టడం లేదు. మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?’’ అడిగింది సరయు.
‘‘నేనేం ప్లాన్ చెయ్యడం లేదు. డాక్టర్ ఫాతిమా సాయంకాలం మనింటికి వస్తున్నారు.’’
‘‘డాక్టర్ ఫాతిమానా?’’
‘‘అప్పుడే మర్చిపోయావా? నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసింది ఆ డాక్టరే కదా? నువ్వు పుట్టింటికి వెళ్ళేవరకూ ఆమె దగ్గరికే వెళ్ళేవాళ్ళం గదా!’’’
‘‘అయ్యో! ఎలా మర్చిపోతానండీ! చాలా మంచి డాక్టర్.’’
‘‘నీకు డెలివరీ అయిందనీ, కవలలు పుట్టారనీ, బ్లాక్ అండ్ వైట్ బాబు, పాప అని నేను చెప్పగా బోలెడు సంతోషపడింది. నేను తీసుకెళ్లిన స్వీట్స్ హాస్పిటల్లో లేడీస్ వార్డులో పంచి పెట్టింది. ‘బ్లాక్ అండ్ వైట్’ అంటూ తెగనవ్విందిలే! మీ ఆవిడ వచ్చాక ఒకసారి మీ ఇంటికివచ్చి బ్లాక్ అండ్ కిడ్స్‌ని చూస్తా అన్నది.’’
సరయు ఏమీ మాట్లాడకుండా గంభీరంగా వుండిపోయింది. భర్త ఏదో చెబుతున్నా ఏమీ మాట్లాడలేదు.
‘‘ఆమె ఎంతో ప్రేమగా పిల్లల్ని చూడ్డానికి మనింటికి వస్తున్నది. మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. సరయు నువ్వు చెప్పు?’’ అడిగాడు రాజేష్.
‘‘ఆడవాళ్ళకు ఏం గిఫ్ట్ ఇస్తాం? పట్టు చీర తీసుకురండి’’.
‘‘డాక్టర్ ఫాతిమా ఎప్పుడూ తెల్లకోటు వేసుకుని వుంటుంది గదా! మనం తెల్లకోటు ఇస్తే?’’
‘‘్ఛ.. బాగోదు. తెల్లకోటు కింద చీరలే కడుతుంది డాక్టర్.’’
‘‘సరే! సరే! నువ్వు చెప్పినట్టు పట్టుచీర తెస్తాలే!’’ అన్నాడు రాజేష్.
ఆ రోజు సాయంకాలం డాక్టర్ ఫాతిమా రాజేష్ ఇంటికి వచ్చింది. అతని తల్లి కనకదుర్గ ఫలహారం, కాఫీ ఇచ్చి మర్యాద చేసింది. సరయు ఆమెకు పట్టుచీర ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసింది.
‘‘అయ్యో! ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా! ఆల్రెడీ మీ నుంచి ఫీజు గుంజానుగా!’’’ అన్నది డాక్టర్ ఫాతిమా నవ్వుతూ.
‘‘ఇది గిఫ్ట్ మేడమ్! మా ‘బ్లాక్ అండ్ వైట్’ తరఫున..’’ అని నవ్వాడు రాజేష్.
‘‘మీ బ్లాక్ అండ్ వైట్ కిడ్స్ హెల్తీగా వున్నారయ్యా! పాలు చాలకపోతే సప్లిమెంట్ ఫుడ్ ఇవ్వండి ఆరో నెల నుంచి’’ చెప్పింది డాక్టర్ ఫాతిమా. ‘‘దేవుడి దయవల్ల మా కోడలు ఇచ్చే పాలు సరిపోతున్నాయి డాక్టర్ గారూ!’’ అన్నది కనకదుర్గ.
‘‘గుడ్...!’’ అన్నది డాక్టర్.
‘‘సరయూ.. నిజం చెప్పు? ఈ పాప ఎవరికి పుట్టింది?’’ సీరియస్‌గా అడిగింది డాక్టర్ ఫాతిమా ఒంటరిగా వున్న సమయం చూసి. ఆ ప్రశ్నకు ఒక్కసారి ఉలిక్కిపడింది సరయు!
‘‘నాకు తెలుసు. నువ్వు పుట్టింటికి డెలివరీకి వెళ్ళేవరకు ట్రీట్ చేసింది నేనే కదా. స్కానింగ్‌లో బాబు పుడతాడని మాకు తెలుసు. శిశువు ఆరోగ్యంగా పెరుగుతున్నాడని కూడా చెప్పాను. కానీ, నిబంధనల ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆడో, మగో అన్న విషయం చెప్పకూడదని నీకు అసలు విషయం చెప్పలేదు. మీ ఆయన కవలలు పుట్టారని చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఐతే- అతనితో నేను అనుమానం వ్యక్తం చేయలేదు. ఇందులో ఏదో రహస్యం వుందని నాకు అనిపించింది. అదేదో నీ ద్వారా తెలుసుకోవాలనే వచ్చాను. చెప్పు సరయు..! ఈ పాప నీకు పుట్టలేదు. ఇంతకీ ఎవరి పాప?’’ నిలదీసింది డాక్టర్ ఫాతిమా!
‘‘డాక్టర్.. ప్లీజ్.. ఈ సంగతి ఎవరికీ చెప్పకండి’’ అభ్యర్థిస్తూ అన్నది సరయు.
‘‘నో..నో.. నేనెందుకు చెప్తాను? నువ్వు నన్ను అనుమానించకు. తెలుసుకోవాలనే కుతూహలంతోనే పాప గురించి అడుగుతున్నాను. నీకు ఇష్టం లేకపోతే వద్దు.’’
‘‘చెప్తాను డాక్టర్.. నేను డెలివరీకి డాక్టర్ దమయంతి గారి జనతా నర్సింగ్ హోమ్‌లో చేరాను. ఆమె పేదవారి డాక్టర్ అని విశాఖపట్నంలో పెద్ద పేరుంది. నేనున్న రూమ్‌లోనే పక్క బెడ్‌లో చేరింది చరిత అనే అమ్మాయి. డెలివరీకి అడ్మిట్ అయిన దగ్గర్నుంచి ఎందుకో దిగులుగా కనిపించింది. అప్పుడప్పుడు ఏడుస్తుండేది. నేను ఓదార్చి కారణం అడిగాను. ఆమె సలీం అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను ఆమెతోపాటు సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. రెండు కుటుంబాలకూ వీరి పెళ్లి ఇష్టం లేక దూరంగా పెట్టారు. చరిత ప్రెగ్నెంట్ అయ్యాక సలీం యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇప్పుడు తను దిక్కులేనిదైంది. ఒంటరిగా పసిపిల్లతో చాలీచాలని జీతంతో ఎట్లా బతకాలి? అని దిగులుపడుతోంది. నేను ఆమెను ఓదార్చి తనను హైదరాబాద్ తీసుకెళ్తాననీ, మా వారి కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించి ఆదుకుంటానని ధైర్యం చెప్పాను. చరిత సంతోషించింది. నన్ను ‘దేవుడిచ్చిన అక్క’ అంటూ పొగిడింది. అయితే దురదృష్టం- చరిత ఆడపిల్లను కని చనిపోయింది. అప్పుడే నాకు డెలివరీ అయి పిల్లాడ్ని కన్నాను. చరితకు పుట్టిన ఆడపిల్లను అనాథాశ్రమంలో చేరుస్తామని డాక్టర్ దమయంతి చెప్పింది. ఆ పిల్లను కూడా నేనే కన్నాననీ, కవలలు పుట్టారని రికార్డు చెయ్యమనీ, ఆ పిల్లను నేను పెంచుతానని అన్నాను. అందుకు డాక్టర్ దమయంతి సంతోషించింది. అదీ జరిగింది డాక్టర్! ఈ సంగతి ఎవరికీ తెలియదు ఇప్పటివరకు. మీకే చెప్తున్నాను’’ కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సరయు.
‘‘వెల్‌డన్ సరయు! యు ఆర్ గ్రేట్. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. నువ్వు జరిగిందంతా కడుపులో దాచుకో. నువ్వు చెప్పింది ఏమీ నేను వినలేదు. ఓ.కె..!’’ అన్నది డాక్టర్ ఫాతిమా!
‘‘్థంక్యూ డాక్టర్!’’ చెప్పింది సరయు.
*

సిహెచ్. శివరామ ప్రసాద్ (వాణిశ్రీ)
సెల్ నెం: 93900 85292

-వాణిశ్రీ