భక్తి కథలు

యాజ్ఞసేని-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవస్థ్రరాజైన సేనాబిందువు సైన్య సమేతంగా కాంపిల్యం చేరాడు. సుకేతుడు తన కుమారుడైన సువర్చసుడితో కలిసి వచ్చాడు (సుకేతుడు శిశుపాలుని మనుమడు. దృష్టకేతుడు సుకేతుని కొడుకు).
పుళింద దేశపు రాజులైన సుమిత్రుడు, సుకుమారుడు వచ్చారు. వృకుడు, సూర్యతేజుడు, సత్యధృతి అనే రాజులు కూడా సైన్య సమేతులై వచ్చారు. రోచమానునడు (అశ్వమేధాదిపతి) అనే ఒక క్షత్రియ రాజు ఏతెంచాడు. అనూప దేశపు రాజైన నీలుడు, సింహపుర రాజైన చిత్రాయుధుడు, మగధ రాజైన దండుడు (దండధారుని తమ్ముడు) కాంపిల్యంలో ప్రవేశించారు.
మద్ర దేశాధిపతి, నకుల సహదేవులకు మేనమామ అయిన శల్యుడు తన కుమారులైన రుక్మాంగద, రుక్మథరులతో పరివారంతో పటాటోపంతో వెల్లివిరిసేటట్లుగా వచ్చాడు.
కౌరవుడైన సోమదత్తుడు తన కుమారులైన భూరి, భూరిశ్రవుడు, శలుడు, శ్రుతసేనుడు అనే వారితోకలిసి వచ్చాడు.
పురుకుత్స దేశాధిపతి, పౌరవుడైన దృఢధ్వనుడు. కాంభోజ దేశాధిపతి అయిన సుదక్షిణుడు తమ తమ పరివారంతో వచ్చారు.
ప్రాగ్జ్యోతిష పురాధీశుడైన భగదత్తుడు పరివారంతో వచ్చాడు.
కళింగ దేశాధిపతి అయిన కాళింగ తామ్రలిప్తుడు పరివారంతో వచ్చాడు.
పత్తనాధిపతి, ఉశీనరదేశాధిపతి అయిన శిబి (ఔశీనరుడు), కోసల దేశపు రాజు మృహద్బలుడు, సంకర్షణము అనే దేశపు రాజైన సంకర్షణుడు, కారూప దేశాధిపతి వచ్చారు.
యదుకులాంబుధి చంద్రుడు అయిన శ్రీకృష్ణువాసుదేవుడు తన కుమారులైన ప్రద్యుమ్నుడు (రౌక్మిణేయుడు), చారుదేష్ణుడు, సాంబుడు (జాంబవంతేయుడు) మనుమడైన అనిరుద్ధుడు వెంటరాగా, బలరాముడు తమ్ముడైన శ్రీకృష్ణునితో కలిసి వచ్చాడు.
యదువృష్ణి భోజాంధక వంశశ్రేష్ఠులైన సంకర్షణుడు, గదుడు, సారణుడు, అక్రూరుడు, సాత్యకి (యుయుధానుడు), పృథువు, విపృథురడు, విదూరథుడు, కంకుడు, గవేషణుడు, భోజపతి అయిన కృతవర్మ, యాదవ రాజులైన చేకితానుడు మరియు సుషేణుడు, వృష్ణివంశీయపుడైన వార్దక్షేమి తమ తమ పరివారంతో వచ్చారు.
శంకుడు, ఆశావహుడు, శమకుడు, సారమేజయుడు అనే రాజులు వచ్చారు.
వీరులైన వాతపతిఝిల్ల, పిండారకుడు, విక్రాంతుడు, సత్యవ్రతుడు మొదలైన వారు వచ్చారు. భగీరథుడు అనే ఒక రాజు, కేకయదేశపు ప్రభువు అయిన బృహత్‌క్షత్రుడు తమ పరిమిత సైన్యాలతో వచ్చారు.
సింధు దేశాధిపతి అయిన బృహద్రధుడు తన కుమారుడైన జయద్రథ్రుడితో (సైంధవుడు) కలిసి వచ్చాడు. శంతన మహారాజు తమ్ముడైన బాహ్లికుడు తన కుమారుడైన సోమదత్తుడితో, మనుమలైన భూరి, భూరిశ్రవుడు, శలుడు (సోమదత్తుని కుమారులు) అనేవారితోకలిసి వచ్చాడు. అంబష్ఠదేశాధిపతి అయిన శ్రుతాయువు సైన్య సమేతుడై వచ్చాడు.
శకుని (గాంధార రాజు సుబలుని కొడుకు) కుమారుడైన ఉలూకుడు మరియు వత్స దేశాధిపతి స్వయంవరంలో పాల్గొనటానికై వచ్చారు. చిత్రాంగద, శభాంగదుడు అనే రాజులు వచ్చారు.
మగధ దేశాధిపతి అయిన జరాసంధుడు తన కుమారుడైన సహదేవునితో మనుమడైన మేఘసంధితో కలిసి సైన్య సమేతుడై వచ్చాడు.
చేది భూపాలుడు (జరాసంధునికి సైన్యాధిపతి) బలరామ శ్రీకృష్ణులకు మేనల్లుడు అయిన శిశుపాలుడు తన పరివారంతో పటాటోపం ప్రదర్శిస్తూ వచ్చాడు.
ఇలా అఖిల జలధి వేలావలయిత మహీతలంబునగల సార్వభౌములు, చక్రవర్తులు, రాజులు అందరూ తమ తమ దేశ ధ్వజాలు రెపరెపలాడుచుండగా పరిమిత సైన్యలతో పటాటోపం వెల్లివిరియగా వచ్చారు.
వీరుగాక ఋషులు, మహాత్ములు వచ్చారు.
మహర్షి, సాత్యవతేయుడు, పూజనీయుడు, సమస్త దేశాధీశుల చేత పూజింపబడువాడు, వేదవ్యాసుడు అని కీర్తింపబడే కృష్ణద్వైపాయనుడు తన శిష్య బృందంతో వచ్చాడు.
వచ్చినవారినందరినీ వారి వారి అర్హతకు తగిన విధంగా కొడుకులతో కూడిన ద్రుపద మహారాజు పూజించాడు.
స్వయంవరాన్ని చూడాలనే కోరికతో పౌరులందరూ సముద్రఘోషవలె కలకలం చేస్తూ గుంపులు గుంపులుగా వచ్చారు.

16
స్వయంవర వేదిక
నగరానికి ఈశాన్య భాగంలో సమతులమైన శుభప్రదేశంలో స్వయంవర మంటపం సర్వాంగ సుందరంగా నిర్మింపబడింది. ఆ మంటపాన్ని ఎన్నో ఎతె్తైన భవనాలు అన్ని దిక్కులా చుట్టిముట్టియున్నాయి.
వచ్చిన రాజులందరూ ఆశీనులు కావటానికి మంటపం యొక్క ఈశాన్య భాగంలో ఏర్పాటుచేయబడింది.
తోరణాలు కట్టిన ద్వారాలతో వెలుపలి వాకిళ్ళతో విచిత్రమైన చాందినీ, వీటితో మంటపం అలంకరింపబడింది.
వివిధ మంగళ వాద్య ఘోషలతో, సుగంధభరితమైన అగరుధూపాలతో, మంచి గంధపు నీటి చిలకరింపులతో పూలమాలల వరుసలతో మంటపం శోభాయమానంగా ప్రకాశిస్తున్నది.
- ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము