మంచి మాట

భక్తి రీతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక జగత్తు అంతా భక్తి చుట్టూ పరిభ్రమిస్తూ యుంటుంది అంటే అతిశయోక్తి లేదు. భక్తి అంటే భిన్న అభిప్రాయాలు యున్నప్పటికీ అంతిమ లక్ష్యం మోక్షము. ఒక మూల ముక్కు మూసుకుని కూర్చొని లౌకిక విషయాలకు అతీతంగా ఉంటూ స్మరణ చేయుట భక్తి అని పెక్కుమంది అభిప్రాయం. కానరాని కానలలో భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుట భక్తి అని మరికొందరి అభిప్రాయం. కాని భక్తికి పరిమితి లేదు. ప్రదేశమూ లేదు. ధ్యానం, తపం, అర్చనం అనునవి భక్తి సాధనకు పనిముట్లు మాత్రమే.
ప్రపంచం అంతా ఒకే రకం అయిన భావనలుగల వారు ఎలా ఉండరో, ఒకేరకం అయిన భక్తి భావములు గలవారు యుండరు. సాక్షాత్ పరమేశ్వరులే భక్తి నవరీతులు అని నుడివినారు. జ్ఞాని అయిన వారందరూ భక్తులు కాలేరు. భక్తి అనేది అభీష్ట సిద్ధికి మాత్రమే గాక సర్వకాల సర్వావస్థలయందు పాటించగలగాలి.
నవవిధ భక్తులయందు ముందుగా చెప్పుకోదగినది శ్రవణ భక్తి. భగవంతునికి సంబంధించిన విషయములు విన్నంత మాత్రముననే ముక్తి లభించును. శాపము కొని తెచ్చుకున్న పరీక్షన్మహారాజు కేవలం వారం రోజులపాటు భాగవత శ్రవణము వలన విష్ణు లోకము పొందెను.
ఇక రెండవది కీర్తన. కీర్తన ద్వారా భగవంతుని కటాక్షము పొందుట వ్యాస మహాముని సుతుడయిన శుక మహర్షి కీర్తనా భక్తికి ఆద్యుడు. రామదాసు, త్యాగరాజు, నందనార్, ఏకనాథులవారు, తుకారం, మీరాబాయి వంటి భక్తాగ్రేసురులందరూ ఈ కోవకు చెందినవారే. వీరందరూ భగవంతుని దివ్యత్వమును కీర్తించుట ద్వారా కైవల్యమందినారు. ఇక మూడవది నామస్మరణ. భక్తాగ్రేసరుడు అయిన ప్రహ్లాదుడు కేవలము నారాయణ మంత్రమును విడువక జపించుట వలన అనంత కష్ట నష్టమలు అవలీలగా అధిరోహించి అనంత కీర్తిని గడించెను. పాండవులలో మహాబలుడు అయిన భీమసేనులవారు సదా విడువక మనమున కృష్ణనామము జపించుటవలన అజేయుడయినాడు. మనకు సమయము చిక్కినపుడల్లా భగవంతుని స్మరిస్తే ఎన్నో వత్తిడులనుంచి దూరంగా యుండగలుగుతాము. ఇక నాలుగవది సేవనము. పాలకడలిపై పవళించియున్న శ్రీ మహావిష్ణువుకు సదా పాదసేవ చేసే శ్రీ మహాలక్ష్మి సేవా భక్తికి ఉదాహరణ. కన్నప్ప కూడా ఈ శ్రేణి భక్తుడే. దేవతామూర్తులకు పులకాపు చేయుట, అలంకరణ చేయుట అనేవి సేవా భక్తికి ఉదాహరణలు. ఊరేగింపు చేయడం, పల్లకి మోయడం, రథం లాగడం వంటివికి దీనికి ఉదాహరణలు.
ఇక అయిదవది దాస్యభక్తి. హనుమంతుడు దాస్యభక్తికి తార్కాణం. భగవంతునికి ఏ పనులు అయితే ఇష్టమో ఆ పనులు మాత్రమే చేయడం. ఈ ప్రపంచమంతా భగవంతుడు, భగవన్నామునకు మించిన శక్తి మరొకటి లేదని భావించుట దాస్య భక్తికి పరాకాష్ఠ. అర్చన ఆరవది. నియమ నిష్ఠలతో విధి విధానములతో భగవంతునికి భక్తి కనపరచడము. అర్చన షోడశోపచారములు, యాగాలు, కర్మలు, క్రతువులు ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు. అర్చనా విధ భక్తిని అనుసరించిన వారిలో పృథు చక్రవర్తి గణనీయుడు. ఇక ఏడవది వందనం. ఈ భక్తి రీతిలో అక్రూరుడు శ్రేష్ఠుడు. భగవంతునికి ఒంటి చేత్తో పెదవులతో శబ్దం చేస్తూ వందనం చేయుట మంచిది కాదు. ఆపాదమస్తకము నేల ఆనించి సాష్టాంగ నమస్కారం చేసినపుడే అది వందనం.
ఇక ఎనిమిదవది సఖ్యభక్తి. భగవంతుడు విడువక తమతోనే యున్నట్లు, భగవంతుని ప్రేరణవలన మాత్రమే తాము పనులు నిర్వహించునట్లు అన్నిటా తాము నిమిత్తమాత్రులమని భావించుట సఖ్యభక్తి. దీనికి ప్రబల ఉదాహరణ పాండవ మధ్యముడు అర్జునుడు. రాధ, విభీషణుడు, సుగ్రీవుడు ఈ కోవకు చెందినవారే. ఇక తొమ్మిదవది ఆఖరుది ఆత్మనివేదన. భగవంతుని కొరకు తనను తాను వెనుక ముందూ చూడకుండా అర్పించుకోవటం. ఆత్మ నివేదనా భక్తి అనగానే మొదటగా గుర్తువచ్చేది బలి చక్రవర్తి. రామనామము అపభ్రంశముగా పలికినప్పటికి ఆత్మ నివేదనా భక్తి కలిగి ఉన్నందువలననే బోయ వాల్మీకి అయినాడు.

-వేదగిరి రామకృష్ణ