మెయిన్ ఫీచర్

శక్తి స్వరూపిణి... శత్రు వినాశిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమాతా శ్రీ మహారాఙ్ఞ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥
అంటూ సర్వులచేత స్తుతించబడే అమ్మ ఆదిపరాశక్తి. సురాసురుల చేత అర్చించబడే అమ్మ. అఖిల భువనాలను రక్షిస్తుంది. సృష్టికర్త అయిన అమ్మను ఆశ్వీయుజమాసంలో నవనవోనే్మషంగా పూజిస్తాం. ‘‘నదీనం సాగరోగతిః’’ అన్నట్లు తల్లిని ఎన్ని విధాలుగా ఎన్ని రూపాలుగా స్తుతించినా, కీర్తించినా, అర్చించినా అవన్నీ జగాలకే మాతైన జగన్మాతకే చేరుతాయ. ఆ జగన్మాతకే ఆశ్వీయుజమాసంలో నవవిధ అలంకారాలను చేస్తాం. అమ్మను ఏవిధంగా పూజించాలో మనకు శ్రీ దేవీ భాగవతము, శ్రీదేవీ సప్తశతి, మహావిద్యా, సౌందర్యలహరి, మంత్ర మాతృకాపుష్ప మాలాస్తవం, లలితా సహస్రనామం వంటి గ్రంథాలన్నీ చెప్తాయ. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా అమ్మను ఈ శరన్నవరాత్రులలో దుర్గాదేవి విగ్రహాన్ని యధాశక్తిగా బంగారం, వెండి లేదా మట్టితో చేసి పూజామందిరంలో ఉంచి, విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారాలతో, సహస్ర నామాలతో, అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చనలతో పూజిస్తారు. అమ్మవారి లీలను స్మరించుకుంటూ అమ్మవారికి ఇష్టమైన కార్యాలనే చేస్తుంటారు.
‘‘ప్రథమం శైలపుత్రీ ............. నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గాః ప్రకీర్తితాః’’
అని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడినట్లుగా కూడా 1.శైలపుత్రి 2.బ్రహ్మచారిణీ 3.చంద్రఘంట 4.కూష్మాండ 5.స్కందమాత 6.కాత్యాయని 7.కాళరాత్రి 8.మహాగౌరి 9.సిద్ధిరాత్రి గా కూడా అమ్మను అర్చించడం అనాదిగా వస్తూనే ఉంది.
మొట్టమొదటి రోజు స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గా దేవి :
శ్రీం హ్రీం క్లీం అంటూ అమ్మను స్వర్ణకవచాలంకృతను చేస్తారు. ‘‘కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా...’’ అంటూ అమ్మను స్తుతిస్తారు. శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అయిన జగన్మాత, మూల ప్రకృతి స్వరూపంతో, త్రిమూర్త్యాత్మకము, త్రిగుణాత్మకము, త్రికాలాత్మకము, అయింది. తేజ స్వరూపిణిగాబహిర్గతమైంది. అమ్మదయార్థస్వరూపిణి. కేవలం నమస్కారంతోనే కరుణను కురుపిస్తుంది. ధర్మం ఆచరించేవారికి అండదండగా ఉండే అమ్మగా స్మరిస్తూ స్వర్ణకవచాలంకృతను చేస్తారనేది పురాణ వచనం.
రెండవరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి :
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ క్లీం కళాం భిభ్రతీం ... అంటూ అమ్మను బాలత్రిపుర సుందరీదేవిగా రెండవ రోజు పూజిస్తారు. ఈ తల్లి త్రిగుణాతీత. గుణాలకు అధీనుడై వ్యవహరించే మనిషి బాలత్రిపుర సుందరీ దేవిని పూజిస్తే సమదృష్టి అలవడుతుంది. సర్వ ప్రాణులను దయార్థదృష్టితో వీక్షించే మనోదారుఢ్యం కలుగుతుంది. శ్రీవిద్యోపాసకులందరూ మొట్టమొదట ఈ బాలమంత్రానే్న జపిస్తారు.
మూడవ రోజు గాయత్రీ దేవి: ఈ వేదమంత్రాలకు మూలరూపిణి. గాయత్రీ మంత్రం రోజూ పఠించినవారికి, ఈ తల్లి దివ్యశక్తి అనుభవైక్యమే. ‘‘ఓం భూర్బువః ..................’’- అన్న మంత్రాన్ని రోజూ మూడుసార్లు త్రిసంధ్యలల్లో ప్రాణాయామం చేస్తే, బుద్ధి వికసిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అనుకొన్న కార్యాలు అన్నీ నెరవేరుతాయ. ఆ సంధ్యాదేవతే - గాయత్రి మాత. సద్బుద్ధిని, దీర్ఘాయుష్షుని సత్సాంతానాన్ని, గోసంపదను, కీర్తిప్రతిష్ఠలను, బ్రహ్మవర్చస్సును ప్రసాదించి, అంత్యమున మోక్షమును అనుగ్రహించే తల్లి కూడా గాయత్రీ మాతేనని అధర్వణ వేదం చెబుతోంది.
నాల్గవరోజు అన్నపూర్ణాదేవి
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే ....... అంటూ నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ అని తల్లిని తలిస్తేచాలు ఆ అన్నపూర్ణాదేవి ఇహానికి పనికివచ్చే అన్నానే్న కాదు పరానికి పనికి వచ్చే జ్ఞానభిక్షను కూడా ప్రసాదిస్తుంది. ఈ తల్లి యేనాడు ఆకలితో అలమటించే వ్యాసునికోసం గరిట పట్టుకుంది. ఆ తల్లినే ఈ శరన్నవరాత్రుల్లో అన్నపూర్ణగా భావించి పూజిస్తారు.
‘‘తస్మద్వా ఏతస్మాదాత్మనః .............. ఏష పురుషోన్నరసమయః’’ అన్నరసంతోనే నిండిఉండే ఈ సృష్టి యావత్తు అన్నపూర్ణాదేవి స్వరూపమే. ఎవరైతే తమకు ఉన్నదానిలో అన్నదానాన్ని చేస్తారో వారి సకల పాపరాశిని భస్మీపటలం చేస్తుందీ తల్లి. వారి గృహాలను నిత్యకల్యాణ పచ్చతోరణంగా సంపూర్ణఆయురారోగ్యాలతో భాసింపచేస్తుంది.సూర్యునిలోని శక్తే ఈ తల్లి కనుక సూర్యుని ప్రణామం ఆచరించి భోజ్యపదార్థాన్ని సూర్యునికి నివేదన చేసి ఆ తరువాత భుజించమంటుంది శాస్త్రం. అమ్మను అన్నపూర్ణగా భావించి స్తుతిస్తే జ్ఞానామృతాలు లభ్యవౌతాయ.
అయదవ రోజు మహాలక్షిదేవి అలంకారం :
విష్ణుపత్నీం ప్రసనాక్షీం నారాయణ సమాశ్రీతాం .............అని లక్ష్మీ దేవిని సర్వులూ అర్చిస్తారు. ఓం, శ్రీం హ్రీం ఐం అనే బీజాక్షరములతో సర్వ లోకములు ఉపాసిస్తాయ. పదునెనిమిది చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం కమలము, ధనస్సు, కలశము, దండం, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము ఘంట, మద్య పాత్రము, శూలం, పాశం, సుదఠ్శన చ్రకము, ధరించి ప్రవాళ మణి వర్ణంతో తామరపూవుపై చిరునవ్వుతూ పలకరించే స్ర్తి మూర్తియే మహాలక్ష్మి. శుద్ధ సత్వస్వరూపిణి అయన జగజ్జనని విష్ణు భగవానుని హృదయేశ్వరి.
ఆరవ రోజుశ్రీలలితా త్రిపుర సుందరీ దేవి :
శ్రీచక్రంలో చిన్మయానంద బిందువుగా నివసించే ఈ తల్లి మానవునిలో సహస్రార చక్రాన్ని తన నివాసంగా చేసుకొంది. సగుణోపాసనలో స్ర్తి రూపాన్ని తల్లిగా భావించి అర్చించటం ఉపాసకులకే కాక సామాన్యులకు సైతం ఎంతో సులభం. ఆ రూపమే శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి.
పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్య శ్రవణకీర్తనా .... అంటూ ఈతల్లిని స్ర్తీలందరూ ఆసక్తిగా పూజిస్తారు. వారి మాంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని సంరక్షించే దేవతగా భావిస్తారు. వేయిసార్లు మననం చేసే శివవిష్ణునామాలకంటే కూడా ఒక్కసారి అమ్మను తలుచుకుంటే చాలు. తల్లిని తలిచినవారికి పునర్జన్మలేనేలేదు.మల్లెలు, తులసీదళాలు, కలువపూలు, కడిమిలు,బిల్వపత్రములు, మొల్లలు పొగడలు, పచ్చగోరింట, మొగలిపూలు, విష్ణు క్రాంత, జిల్లేడు, మాధవీ పుష్పాలు ఇవేకాక ఈ ఋతువులో పూచే పూలను తెచ్చి అమ్మను సహస్ర నామంతో అర్చించినవారి పుణ్యఫలంఇబ్బడిముబ్బడిగా లభిస్తుందని అగస్త్య ఉవాచ. ‘‘చింతామణి గృహాంతస్థా’’ అన్న నామాన్ని పరిపూర్ణమైన ఏకాగ్రతతో విశ్వాసంతో పఠించినవారికి చింతితార్థములన్నీ ప్రాప్తిస్తాయి.
ఏడవరోజు శ్రీ సరస్వతీ దేవి :
యా కుందేందు తుషార హార ధవళా యా .......................... మండిత కరా... అంటూ ఆదిపరాశక్తేనే సరస్వతిగా సంభావిస్తారు. సప్తమి తిథి. సప్తమినాడు పూజించే శక్తి -సరస్వతి. సర్వ ప్రాణుల్లో శక్తిరూపంలో ఉండే వాగ్రూపియైన తల్లినే తెల్లని హంసవాహనంలో పద్మాసనస్థితయై, శే్వతాంబరధారియై, వీణాపాణియై అలరారుతుంది. ఈ తల్లి పుస్తక, అభయ, స్ఫటికమాల ధరించిన చతుర్భుజ. విద్యామణి. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి. ఆ పరమేశ్వరి బుద్ధి ప్రదాత. చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే ఏడు రూపాలలో ఈ అమ్మ ఉంటుందని మేరు తంత్రంలో ప్రస్తావించారు. ‘ఉక్తి’. వాక్కు, సూక్తి అనేవి- సత్య సౌందర్య శివరూపాలు. ఈ మూడింటి స్వరూపమే మహాసరస్వతి. సరస్వతి ద్వాదశ నామాలు భారతీ, సరస్వతీ, శారదాదేవి, హంసవాహనా, జగతీఖ్యాతం, వాగేశ్వరీ, కౌమారీ, బ్రహ్మచారిణీ, బుద్ధిదాత్రీ, వరదాయినీ, క్షుద్రఘంటా, భువనేశ్వరి. ఈ నామాలను నిత్యం పఠించేవారికి సర్వసిద్ధులు ప్రసాదించి, బ్రహ్మరూపియైన సరస్వతీ దేవి వారి నాలుక ముందు భాగంలో నివసిస్తుందనేది శాస్త్ర వచనం.
ఎనిమిదవ రోజు దుర్గాదేవి :
నమో దేవి దుర్గే శివే భీమ నాదే సదాసర్వసిద్ధి ప్రదాతృస్వరూపే
విభూతిఃసతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
అంటూ దుర్గను పూజిస్తే దుర్గమాలను అంతం చేసేస్తుంది. దుర్గుడను రాక్షసుని వధించిన కారణాన దుర్గ అయింది. దుర్గా నామమే ఒక మహామంత్రం. దుఃఖాలనుంచి, దుష్కర్మలనుండి కాపాడి దుర్గతు లను దూరం చేసి తన దగ్గరకు చేర్చుకునే తల్లిని అష్టమినాడు అసురుల్ని దునుమాడిన దుర్గగా ఆరా ధిస్తారు. స్ర్తిలోని వీరత్వానికి ప్రతీక దుర్గాస్వరూపం. దశవిధదోషాలు హరింపచేసే తల్లి దుర్గదేవి.
తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని :
మహేశ్వరీ మహాకాశీ మహాగ్రాసా మహాశనా .......అంటూ పూజించే ఈ మహిషాసుర మర్ధిని దానవులను దునుమాడడంలో అగ్రగణ్యురాలు. అధర్మాని కాలరాచి ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తుంది. శరన్నవరాత్రుల్లో తొమ్మిదోరోజు తల్లి మహిషాసుర మర్దినిగా కీర్తిస్తూ ప్రతి స్ర్తిని మాతృస్వరూపంగా భావించి ఆదిపరాశక్తిగా గౌరవించడం భారతీయ సంప్రదాయం. ఈతల్లిని వేడుకున్నవారికి ధర్మాచరణలో ఆటంకాలు కలుగవు. ఈతల్లినిఆరాధించినవారికి అపమృత్యువుదూరవౌతుంది. ఆధ్యాత్మిక విజ్ఞానం లభిస్తుంది. మనిషిలో దైవీ శక్తులు ప్రచోదితవౌతాయ. అమరులైన గంధర్వులు సిద్ధులు యక్షులు మొదలగు వారే కాక దానవులు సైతం ఈమెను సేవించి తమ కోర్కెలు సిద్ధింపజేసుకున్నట్లు పురాణాలు చెప్తాయ.
పదవ రోజు రాజరాజేశ్వరీ దేవి
నమశ్శివాభ్యాం నవవనాభ్యాం .........నవో నమః శంకర పార్వతీభ్యామ్ అంటూ శివశక్తుల కలయిక గా శ్రీరాజరాజేశ్వరీ దేవిని శరన్నవరాత్రుల్లో పూజిస్తారు. ఈ తల్లిని కొలిచిన వారికి సామ్రాజ్యసిద్ధి కలుగుతుంది. ఈ తల్లిని ఆశ్రయించిన వారిలో లోభం మచ్చుకైనా కానరాదు. అందుకే ఈతల్లి సామ్రాజ్యంలో కేవలం ధర్మవర్తనులకు, త్యాగశీలురకు మాత్రమే చోటు వుంటుందంటారు. త్రిలోకాలూ ఈతల్లి భక్తులకు వశీభూతాలు అవుతాయి. సర్వశక్తిస్వరూపిణి అయిన అమ్మను సురాసురులు, యక్షగంధర్వ కిన్నర కింపురుషాదులతో పాటుగా సిద్ధులు, సాధ్యులు, మునులు, సంన్యాసులు కూడా పూజిస్తారు. పుణ్యసంపాదనాసక్తులైన మానవులు పట్టువిడవక పూజించేది రాజరాజేశ్వరీ దేవినే.
ఇట్లా శరన్నవరాత్రుల్లో ఆదిపరాశక్తిని తొమ్మిది అవతారాల్లో పూజించి పదవరోజు ఆ తల్లినే శ్రీ రాజరాజేశ్వరిగా స్తుతిస్తారు. సకల సృష్టికి కార్యకారణరూపిణి యైన తల్లి దుష్టులపై విజయఢంకా మోగించి అఖిల లోకాల చేత కీర్తించబడుతుంది. అపరాజిత దేవిగా కూడా పూజలందుకునేది ఈ తల్లినే. సర్వసృష్టిని సస్యశ్యామలంగా చేసే దేవి కనుక శాకంబరీదేవిగా కూడా సంభావించబడుతుంది. ‘వాగర్థముల’ వంటివైన శివశక్తుల కలయకే శ్రీ రాజరాజేశ్వరీ స్వరూపం.

- రాయసం లక్ష్మి