బిజినెస్

మార్కెట్‌లోకి ‘జిసిసి కుంకుమ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 1: అనేక రకాలైన పథకాలతో ఒకవైపు వినియోగదారులను ఆకర్షిస్తూనే మరోపక్క గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈసారి కుంకుమ తయారీకి ప్రాధాన్యతనివ్వనుంది. దీనిని తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. ఇప్పటికే అనేకసార్లు దీనిపై చర్చించడం జరిగింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులు పండించే పసుపు కొమ్ములు విరివిగా సేకరించి దీనిని పౌడర్ చేసి ప్రత్యేక ప్యాకేట్లను సిద్ధం చేయనుంది. ఈ విధంగా సిద్ధం చేసే ప్యాకెట్లను రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సరఫరా చేయనుంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య సన్నిధిలో దీనిని ఉపయోగించే విధంగా నాణ్యమైన కుంకుమ ప్యాకెట్లను సిద్ధం చేయాలని సంస్థ నిర్ణయించింది. దీనికి భారీఎత్తున కుంకుమ అవసరం ఉంటుంది. స్వామివారి ఆలయంలో ఉపయోగించే కుంకుమను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. అందువల్ల దీనిని తిరుపతికి పంపించడం ద్వారా ‘జిసిసి కుంకుమ’ను ఓ బ్రాండ్‌గా విశిష్ట పొందేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి, సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం, ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, ద్రాక్షారామం, సాలూరు, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెలసిన ప్రముఖ దేవస్థానాలతోపాటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండే పురాతాన దేవాలయాలకు విశాఖ ఏజెన్సీకి చెందిన కుంకుమను పంపించేందుకు జిసిసి చర్యలు చేపట్టింది. కుంకుమ తయారీకి అవసరమైన పసుపు కొమ్ములు విరివిగా సేకరించనుంది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే 11 గిరిజన మండలాలకు సంబంధించి చింతపల్లి, లోతుగెడ్డ జంక్షన్, లంబసింగి, జికె వీధి, సీలేరు, అరకు, పాడేరు, ముంచింగ్‌పుట్, ఏ.అన్నవరం తదితర ప్రాంతాల్లో పసుపు పంట ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా గిరిజన రైతులు పండించే పసుపు కొమ్ములు సేకరించి వీటిని వడ్డాది మాడుగులలో ఉన్న జిసిసి పరిశ్రమ ద్వారా పొడి చేయడం జరుగుతుంది. ఈ పొడిలో ఒక రకమైన రాయిని మిశ్రమంగా వాడుతారు. దీంతో ఛాయ కలిగి ఉండే కుంకుమ పొడి సిద్ధమవుతుంది. ఈ విధంగా తయారు చేసిన కుంకుమను క్యాటగిరీలుగా ప్యాకెట్ల రూపంలో కనీసం వంద గ్రాముల నుంచి సిద్ధమవుతుంది. వీటిని ముందుగా ఇచ్చే ఆర్డర్లను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలకు జిసిసి పంపిస్తుంది. అలాగే ఈ పథకం విజయవంతమైతే దేశీయ మార్కెట్‌లోకి తీసుకు వెళ్ళాలని సంస్థ ఆలోచన చేస్తుంది. ‘జిసిసి బ్రాండ్’తో త్వరలో మార్కెట్‌లోకి రానున్న కుంకుమ ప్రాజెక్ట్‌ను త్వరలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి రావేల కిషోర్‌బాబు ప్రారంభిస్తారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎఎస్‌పిఎస్ రవి ప్రకాష్ ఆంధ్రభూమికి తెలిపారు. ఐటిడిఎ, జిసిసి ఆధ్వర్యంలో చేపట్టిన కాఫీ ప్రాజెక్టుకు ప్రపంచ దేశాల్లోనే విశేష ఆదరణ లభించిందని, ఇదే తరహాలో కొత్తగా నిర్వహించే కుంకుమ ప్రాజెక్టుకు తెలుగు రాష్ట్రాల్లో తగిన విధంగా మార్కెట్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.