బిజినెస్

రూ. 11 వేల కోట్లివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)తోపాటు బ్రిటీష్ పెట్రోలియం (బిపి), నికో నుంచి భారీ నష్టపరిహారాన్ని కోరింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి చమురు మంత్రిత్వ శాఖ రిలయన్స్‌కు గురువారమే నోటీసులు కూడా అందించింది. శుక్రవారం తెలిసిన వివరాల ప్రకారం కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లో ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసికి చెందిన గ్యాస్‌ను గత ఏడేళ్లకుపైగా రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ (బ్రిటీష్ పెట్రోలియం, నికో)లు తవ్వి తీసుకున్నాయని జస్టిస్ ఎపి షా కమిటీ సమర్పించిన ఓ నివేదిక చెబుతోంది. ఆగస్టు 29న చమురు మంత్రిత్వ శాఖకు షా కమిటీ ఈ నివేదికను అందించింది. ఇందులో ఒఎన్‌జిసికి చెందిన గ్యాస్‌ను తీసుకున్నందుకు రిలయన్స్ తప్పక ప్రభుత్వానికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఏకసభ్య కమిటీ అభిప్రాయపడింది. ‘ఒఎన్‌జిసి క్షేత్రం నుంచి సేకరించిన గ్యాస్ అమ్మకాలతో రిలయన్స్, బిపి, నికోలకు లబ్ధి చేకూరింది.’ అని నివేదికలో షా పేర్కొన్నారు. 2009 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు ఒఎన్‌జిసి క్షేత్రం నుంచి రిలయన్స్ క్షేత్రాలకు 11.122 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వచ్చిందన్నారు. దీని విలువ ఎంతలేదన్నా 11,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని అభిప్రాయపడ్డ షా.. చౌర్యానికి పాల్పడ్డ గ్యాస్‌లో దాదాపు 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను రిలయన్స్ ఇప్పటికే చేజిక్కించుకుందని షా చెప్పారు. ఈ నేపథ్యంలో 1.55 బిలియన్ డాలర్ల (డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి విలువ ప్రకారం సుమారు 11,000 కోట్ల రూపాయలు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ రిలయన్స్‌కు చమురు మంత్రిత్వ శాఖ ఓ నోటీసును ఇచ్చింది. కాగా, ఈ నష్టపరిహారం ఒఎన్‌జిసికి దక్కకూడదని, ప్రభుత్వ ఖజానాకు చెందాలని కూడా తన నివేదికలో షా అన్నారు. ఈ విషయంలో ఒఎన్‌జిసి నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. కాబట్టి నష్టపరిహారం ప్రభుత్వానికే రావాల్సిన అవసరం ఉందన్నారు. కెజి-డి6లో ఒఎన్‌జిసి రిజర్వాయర్లు దాదాపు ఖాళీ అయిపోతే, రిలయన్స్ మాత్రం తమ డి1, డి3 క్షేత్రాల నుంచి ఇంకా ఉత్పత్తి జరుపుతూనే ఉందని, ఇందుకు కొన్ని బ్లాకులు ఒఎన్‌జిసివి కూడా ఉండటమే కారణమని షా అనడం గమనార్హం. నిజానికి తమ కెజి-డి5తోపాటు రిలయన్స్‌కు చెందిన కెజి- డి6 పొరుగున్న ఉన్న తమ క్షేత్రాల నుంచి రిలయన్స్ అక్రమంగా గ్యాస్‌ను తీసుకుంటోందని ఒఎన్‌జిసి ఎప్పట్నుంచో వాదిస్తోంది. ఈ క్రమంలో షా కమిటీ నివేదిక వెలువడగా, ఈ ఏడాది మార్చితో ముగిసిన ఏడేళ్ల కాలంలో 338.332 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల ఉత్పత్తికిగాను 1.47 బిలియన్ డాలర్లు నష్టపరిహారం మరికొంత జరిమానాను చెల్లించాలని చమురు మంత్రిత్వ శాఖ రిలయన్స్, బిపి, నికోలకు నోటీసులిచ్చింది. అయితే దీనిపై స్పందించేందుకు రిలయన్స్ అందుబాటులో లేకుండగా, బిపి ప్రతినిధి మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుంచి లేఖ అందిందని, ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.