బిజినెస్

విదేశీ యాత్రికులు, ఎన్నారైలకు ప్రత్యేక దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: విదేశీ పర్యాటకులకు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యాటక సంస్థను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సీఎంఓలో పర్యాటక శాఖాధికారులు భేటి అయినప్పుడు ఆయనపై విధంగా సూచించారు. వారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు శ్రీవారి దర్శనం ద్వారా మనోభీష్టం నెరవేర్చుకుని వెళ్లే విధంగా సహకరించాలన్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో మాట్లాడాలని ఆయన ఆదేశించారు. రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించిన తర్వాత బౌద్ధ పర్యాటకుల సంఖ్య మెరుగుపడుతోందని, వీరి కోసం బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, చారిత్రక ప్రదేశాలతో బౌద్ధ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. ‘ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటిఓ)తో కలిసి రాష్ట్ర టూర్ ఆపరేటర్స్‌తో ఒక సమావేశం నిర్వహించాలన్నారు. ఐఏటిఓ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యాటక అధికారులను కోరారు. వీరిని సమన్వయం చేసుకుంటూ పర్యాటకులకు సదుపాయాల కల్పనలో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. 2017లో ఒడిశాలో ఐఏజిఓ నేషనల్ కాన్ఫరెన్స్ జరుగనుందని, అందువల్ల ఐఏటిఓ నేషనల్ కాన్ఫరెన్స్‌ను 2018లో మన రాష్ట్రంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. పర్యాటక నిర్వాహకులను రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లి ఆయా ప్రాంతాల వైశిష్ట్యాన్ని, చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించాలని కోరారు. రాష్ట్రంలో పర్యాటక సంస్థలు, పర్యాటక గైడ్స్‌ను భాగస్వాములను చేస్తూ టూరిజం అండ్ హాస్పిటాలిటీ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి అంతకు ముందు తనను కలిసిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ ఆపరేటర్స్ (ఐఏటిఓ) అధ్యక్షుడు ప్రణబ్ సర్కార్, ఐఏటిఓ ఉపాధ్యక్షుడు రాజీవ్ మెహ్రాలతో మాట్లాడుతూ అమరావతిలో పర్యాటకాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. తమది జాతీయ సంస్థ అని, ఇందులో 1,500 మంది సభ్యులున్నారని, అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని ఐఏటిఓ అధ్యక్షుడు ప్రణబ్ సర్కార్ ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం గిరిజా శంకర్, తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా తదితరులు పాల్గొన్నారు.

గల్లీగల్లీకి ఎస్‌బిహెచ్ సేవలు
మొబైల్ ఎటిఎంతో నగదు పంపిణీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 23: వినియోగదారుల సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. గల్లీగల్లీకి ఎస్‌బిహెచ్ సేవలందించే కార్యక్రమాన్ని బుధవారం ఎస్‌బిహెచ్ డైరెక్టర్ శంతను ముఖర్జి ప్రారంభించారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో మొబైల్ క్యాష్ వాహనాలను ఏర్పాటు చేసినట్టు ముఖర్జి తెలిపారు. మొబైల్ ఎటిఎంతో 2,000 రూపాయల వరకు నగదు తీసుకోవచ్చు. నిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ ఎటిఎం ద్వారా 50 రూపాయల నోటును అందిస్తుండటం విశేషం.

గర్వేర్ లాభం రూ. 26 కోట్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 23: గర్వేర్ వాల్ రోప్స్ సంస్థ ఈ జూలై-సెప్టెం బర్‌లో 26 కోట్ల రూపాయల నికర లాభాలను అందుకుంది. నిరుడు 15.4 కోట్ల రూపాయలతోనే సరిపెట్టు కుంది. నికర అమ్మకాలు 8.4 శాతం పెరిగాయ. విలువ ఆధారిత ఉత్పత్తులతో మంచి లాభాలను గడిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
హెచ్‌సిఎల్‌తో ఒమాంటెల్ ఎంఓయూ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 23: హెచ్‌సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌తో సుల్తానేట్‌కు చెందిన ఓమాంటెల్ అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ ఎంఓయూ వల్ల విలువైన ఐటిసేవలను పొందుతున్నట్లు ఒమాంటెల్ సిఇఒ తలాల్ సయ్యద్ ఆల్ మమారి తెలిపారు.
‘టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 23: విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసే విధంగా టెక్నాలజీని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్ అన్నారు. దీనికి విద్యుత్ నియంత్రణ మండళ్లు సహకరించాలన్నారు. బుధవారం సిఐఐ, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ కార్యాలయం ఉమ్మడిగా క్లీన్ పవర్ ఎనర్జీ అనే అంశంపై సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్మాయిల్ ఖాన్ మాట్లాడుతూ ఇంధన రంగం, ప్రభుత్వం ఉమ్మడిగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ విద్యుత్ సంస్థలు తీసుకుంటున్న చర్యలను వివరించారు. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలన్నారు. దీనివల్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అన్ని ప్లాంట్లు గ్రిడ్‌కు అనుసంధానం చేయాలన్నారు. బ్రిటీష్ హై కమిషన్ కార్యాలయం డిప్యూటీ కమిషన్ ఆండ్య్రూ మెక్ అలిస్టర్ మాట్లాడుతూ 2016-21 మధ్య క్లీన్ ఎనర్జీ సాధనకు తమ దేశం 5.8 బిలియన్ పాండ్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ నిధులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇస్తామన్నారు. భవిష్యత్తులో కాలుష్య రహిత విద్యుత్ లక్ష్యాలను సాధించేందుకు భారత్‌కు మంచి అవకాశాలున్నాయని, సాంకేతికంగా భారత్‌కు విద్యుత్ రంగంలో సహకరించేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉందన్నారు. 2025 నాటికి తమ దేశంలో థర్మల్ ఎనర్జీ ఉండదని, పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.