బిజినెస్

నోట్ల రద్దు.. కీలక ఆర్థిక సంస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: అత్యంత కీలక ఆర్థిక సంస్కరణల్లో పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒకటి అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా అన్నారు. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డ రతన్ టాటా.. నల్లధనంపై పోరుకు నోట్ల రద్దు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మూడు ప్రధాన ఆర్థిక సంస్కరణల్లో నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒకటంటూ పేర్కొన్నారు. డీలైసెన్సింగ్, జిఎస్‌టితోపాటు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు దేశ చరిత్రలో చెప్పుకోదగ్గవని గుర్తుచేశారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు ఈ నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. ఈ క్రమంలో మోదీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి దేశ ప్రజల మద్దతు అవసరమని ట్విట్టర్ ద్వారా టాటా శనివారం పిలుపునిచ్చారు. మొబైల్, డిజిటల్ పేమెంట్స్‌పై ఇటీవల మోదీ దృష్టి పెట్టడం కూడా నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోందన్నారు.
టాటా ఇజిఎమ్‌లకు మిస్ర్తి, వాదియా
మరోవైపు సైరస్ మిస్ర్తి, ఆయన మద్దతుదారుడు నుస్లీ ఎన్ వాదియా టాటా స్టీల్, టాటా కెమికల్స్ బోర్డు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ రెండు సంస్థల చైర్మన్‌గా మిస్ర్తిని ఇప్పటికే తొలగించగా, దీనికి సహకారం కోసం వచ్చే నెల అసాధారణ సమావేశానికి (ఇజిఎమ్) టాటా సన్స్ పిలుపునిచ్చింది. టాటా సన్స్ తీర్మానంతో టాటా స్టీల్, టాటా కెమికల్స్ ఇజిఎమ్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వౌఖిక, లిఖితపూర్వక ప్రకటనలు చేయాలని మిస్ర్తి అనుకుంటున్నారు. సంస్థల భాగస్వాములనుద్దేశించి మాట్లాడతారు. టాటా స్టీల్ చైర్మన్‌గా శుక్రవారం మిస్ర్తిని తొలగించారు. అంతకుముందే టాటా కెమికల్స్ చైర్మన్‌గా మిస్ర్తిపై వేటు పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న టాటా స్టీల్, 23న టాటా కెమికల్స్ బోర్డు సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు టాటా స్టీల్, టాటా కెమికల్స్ బోర్డుల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న వాదియా.. తనను తొలగించేందుకు టాటా సన్స్ ఇజిఎమ్‌లకు పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు. అందుకు టాటా సన్స్‌కున్న అర్హత ఏమిటంటూ ప్రశ్నించారు. మిస్ర్తికి వాదియా మద్దతిస్తున్నారు. కాగా, టాటా సన్స్ చైర్మన్‌గా గత నెల 24న మిస్ర్తి ఉద్వాసనకు గురైనది తెలిసిందే. దీంతో మిస్ర్తి స్థానంలో రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్‌గా టాటా సన్స్ నియమించింది.
నిర్మల్య కుమార్‌కు లీగల్ నోటీసు
ఇదిలావుంటే మిస్ర్తి అనుచరుడు నిర్మల్య కుమార్‌కు టాటా సన్స్ లీగల్ నోటీసు ఇచ్చింది. టాటా గ్రూప్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారని, అత్యంత విశ్వసనీయమైన ఒప్పందాన్ని ఉల్లంఘించారనే కారణాలతో ఈ నోటీసును పంపింది. బేషరతుగా తమకు క్షమాపణ చెప్పాలని కూడా అందులో కోరింది. మిస్ర్తి నాయకత్వంలోని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కుమార్ ఉన్నది తెలిసిందే. మిస్ర్తి ఉద్వాసన అనంతరం ఈ కౌన్సిల్‌ను టాటా సన్స్ రద్దు చేయగా, కుమార్ టాటా గ్రూప్ నుంచి బయటకి వచ్చేశారు.
సాయి సన్నిధిలో సైరస్ మిస్ర్తి
ఇక కుటుంబ సమేతంగా సైరస్ మిస్ర్తి శనివారం షిర్డి సాయిబాబాను దర్శించుకున్నారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా షిర్డికి చేరుకున్న మిస్ర్తి.. కట్టుదిట్టమైన భద్రత నడుమ బాబాను దర్శించుకున్నారు. మీడియాను, ఫొటోగ్రాఫర్లను ఆలయ సమీపంలోకి అనుమతించలేదు. శని శింగ్నాపూర్ ఆలయానికి కూడా మిస్ర్తి వెళ్లారు. అక్కడ పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.