బిజినెస్

ఆర్థిక లావాదేవీలన్నీ వెలికితీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 28: ఆరేళ్ల క్రితం నాటి అందరి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రికార్డులను బయటకు తీసి, ఇప్పుడు చేస్తున్న డిపాజిట్లతో పోల్చి లెక్కలు కడతామని విశాఖ జోన్-2 ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సి ఓంకారేశ్వర్ స్పష్టం చేశారు. ఏ ఖాతాదారుడైనా సరే అతడికున్న అన్ని ఖాతాలు, షేర్ల లావాదేవీలు, డీమ్యాట్ అకౌంట్స్, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు, అపార్టుమెంట్లు, భవనాలు, బంగారం క్రయ, విక్రయాలు తదితర అన్ని రకాల లావాదేవీలు, డిపాజిట్లు, రుణాల చెల్లింపులు అన్నింటికీ తగిన లెక్కలు చూపాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రతి ఖాతాదారుడు వారి ఆదాయ వనరులకు సంబంధించి లెక్కలన్నిటినీ చెప్పాల్సి ఉంటుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సోమవారం ఓంకారేశ్వర్ విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కరెన్సీ రద్దు చర్య భవిష్యత్‌లో మంచి ఫలితాలనిస్తుందని అన్నారు. ఉగ్రవాదుల వద్ద 7 వేల కోట్ల రూపాయలు, తీవ్రవాదుల వద్ద మరో 700 కోట్ల రూపాయలు, వివిధ వర్గాల అక్రమార్కుల వద్ద నల్లధనం కోట్లలో పేరుకుపోయిందని ఈ రద్దుతో వారందరికీ ప్రధాని మోదీ చెక్ పెట్టారన్నారు. నగదు మార్పిడి చేసుకోవడానికి సామాన్యుడు పడుతున్న కష్టాలు తాత్కాలికమేనని అభిప్రాయపడ్డారు. కాకినాడకు చెందిన ఓ వస్త్ర వ్యాపారి తన వద్ద పనిచేస్తున్న 90 మంది ఉద్యోగులను బ్యాంకుల వద్ద క్యూలో నిలబెట్టి నగదు మార్పిడి చేసుకున్న వైనం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వాటిని కూడా తమ శాఖ వర్గాలు పసిగట్టాయని, నల్లధనం ఏ రూపంలో ఉన్నా బయటకు తీస్తామని హెచ్చరించారు. ఒక్క కాకినాడలోనే సుమారు 200 కోట్ల రూపాయల నల్లధనం ఉందని, ఓ కో-ఆపరేటివ్ సొసైటీలో 500 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉంటే, అందులో 400 కోట్ల రూపాయలకు లెక్కలు లేవని తెలిపారు. తమ శాఖ అధికారులు రాష్ట్రంలో దాడులు జరుపుతున్నారని, నెల్లూరులో బంగారం వర్తకులను అదుపులోకి తీసుకుని నల్లధనానికి సంబంధించి విచారణ జరుపుతున్నామన్నారు. అయతే వీరి పేర్లు మాత్రం ఇప్పుడు బయట పెట్టబోమన్నారు. కాగా, 2017 ఏప్రిల్ నుండి వస్తు వినిమయ బిల్లు అమల్లోకి రానుందని, అప్పటి నుండి అన్ని లావాదేవీలు నగదు రహితంగానే జరుగుతాయన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్, చెక్కుల చెల్లింపుల రూపాల్లోనే లావాదేవీలు జరుగుతాయని వివరించారు. ప్రస్తుతం 14.50 లక్షల కోట్ల రూపాయల విలువైన పాత 500, 1,000 రూపాయల నోట్లున్నాయని, మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన 100 నుండి 10 రూపాయల వరకు కరెన్సీ ఉందన్నారు. రద్దయిన 14.50 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ స్థానంలో కేవలం 5 లక్షల కోట్ల రూపాయల కొత్త నోట్లు మాత్రమే వస్తాయని వివరించారు. ఇప్పటివరకు బ్యాంకులకు సుమారు 8 లక్షల కోట్ల రూపాయల మేర డిపాజిట్ల రూపంలో సమకూరిందన్నారు. గత 20 సంవత్సరాల కాలంలో పెద్ద నోట్లు 80 శాతం వరకు పెరిగాయని, బ్యాంకు ఖాతాలో రెండున్నర లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని, ఈ మొత్తానికి పన్ను ఉండదని చెప్పారు. నల్లధనం ఉన్నవారు పన్నులు చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నాలుగు మార్గాల ద్వారా అవకాశం కల్పించినప్పటికీ అనేక మంది చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. అయతే బ్యాంకుల్లో జమ చేసిన డిపాజిట్ల పూర్తి వివరాలను డిసెంబర్ 31వ తేదీ తరువాత వెల్లడిస్తారని ఓంకారేశ్వర్ చెప్పారు. మరోవైపు బినామీల చట్టం అమల్లోకి వచ్చిందని, ఈ చట్టం ద్వారా ఎవరైతే బినామీ ఆస్తులను కలిగి ఉంటారో ఆ ఆస్తులన్నీ కేంద్రానికే చెందుతాయని హెచ్చరించారు. 125 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఆదాయ పన్ను శాఖకు 40 వేల మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ కమీషనర్ సివిఎ రామారావు తదితరులు పాల్గొన్నారు.