బిజినెస్

రెపో రేటు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 6: అందరి అంచనాలకు తగ్గట్టుగానే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు తీసుకుంది. గురువారం నిర్వహించిన ద్రవ్యపరపతి విధానం సమీక్షలో ఆర్‌బిఐ తన కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును యథాతథంగానే అంటే 6.25 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులకు ఆర్‌బిఐ చెల్లించే వడ్డీరేటు)ను మాత్రం 0.25 శాతం అంటే 6 శాతానికి పెంచింది. మరో వైపు ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లపై ఆర్‌బిఐ చెల్లించే వడ్డీ రేటు అయిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్)ను 0.25 శాతం అంటే 6.5 శాతానికి తగ్గించింది. మార్కెట్లో లిక్విడిటీ (ద్రవ్య చెలామణి)ని కట్టడి చేసేందుకే ఆర్‌బిఐ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు కూడా ఆర్‌బిఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు 2016-17 సంవత్సరంలో ఉండిన 6.7 శాతంనుంచి 7.4 శాతానికి పెరగవచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది.
అయితే ద్రవ్యోల్బణం, ఆర్థిక రంగానికి సంబంధించి మూడు విషయాల్లో ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎల్ నినో ప్రభావం కారణంగా నైరుతీ రుతు పవనాలు విఫలం అయ్యే అవకాశం, ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణంపై దాని ప్రభావం అని ఆర్‌బిఐ తెలిపింది. ఇక రెండో ఆందోళన కలిగించే అంశం వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలు విషయం కాగా, మూడవది ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలు వల్ల ఎదురయ్యే సమస్యలని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ అభిప్రాయ పడింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్యోల్బణం ప్రథమార్థంలో సగటున 4.5 శాతంగా, ద్వితీయార్ధంలో 5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసినట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఒక వేళ ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసినట్లుగా ఇంటి అద్దె అలవెన్సును పెంచిన పక్షంలో రాబోయే 12-18 నెలల కాలంలో ద్రవ్యోల్బణం ఒకటినుంచి ఒకటిన్నర శాతం దాకా పెరిగే అవకాశముందని కూడా ఆర్‌బిఐ తెలిపింది. అలాగే జిఎస్‌టి అమలు తర్వాత తలెత్తే పరిణామాలు, ప్రభుత్వ ద్రవ్య లోటు, వ్యవసాయ రుణాల మాఫీలాంటివి సైతం ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం కావచ్చని అభిప్రాయ పడింది.
ఇక సానుకూల అంశాల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతుండడం, దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలపైన దాని ప్రభావం కారణంగా వాటి ధరలు తగ్గడంవల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గవచ్చని ఆర్‌బిఐ అభిప్రాయ పడింది. ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉండడం దృష్ట్యా ఆహార ధాన్యాల సేకరణ పెరగడం, ఫలితంగా బఫర్ నిల్వలు పెరిగి ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉందని కూడా కమిటీ అభిప్రాయ పడింది.