బిజినెస్

రష్యా చమురు క్షేత్రాల్లో భారత్ పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సైబీరియాలోని రష్యా చమురు క్షేత్రాల్లో భారతీయ చమురు సంస్థలు 4.2 బిలియన్ డాలర్ల (28,253 కోట్ల రూపాయలకుపైగా)తో వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. తూర్పు సైబీరియాలోని రష్యాకు చెందిన టాస్-యురైకా చమురు క్షేత్రంలో వాటాలను భారత ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్), భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ (బిపిఆర్‌ఎల్) దాదాపు 1.3 బిలియన్ డాలర్ల (సుమారు 8,750 కోట్ల రూపాయలు)తో కొనుగోలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి బుధవారం ఇక్కడ ఒప్పందాలపై ఐఒసి, ఒఐఎల్, బిపిఆర్‌ఎల్ (్భరత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనుంబంధ సంస్థ) సంతకాలు చేశాయి. టాస్-యురైకా చమురు క్షేత్రంలో 29.9 శాతం వాటాను రష్యా ప్రభుత్వరంగ సంస్థ రాస్‌నెఫ్ట్ నుంచి భారతీయ చమురు సంస్థలు 1.28 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తుండగా, ఈ మొత్తం వాటాను మూడు సంస్థలు సమానంగా పంచుకోనున్నాయి. టాస్-యురైకా చమురు క్షేత్రంలో ప్రస్తుతం రోజుకు 20,000 బ్యారెళ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్షేత్రంలో మొత్తం 137 మిలియన్ టన్నుల చమురు నిల్వలున్నాయని తేలింది. రాబోయే రెండేళ్లలో రోజుకు లక్ష బ్యారెళ్ల ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఇదిలావుంటే సైబీరియాలోని వాంకోర్ చమురు క్షేత్రంలో 23.9 శాతం వాటాను కొనుగోలు చేసేందుకూ రాస్‌నెఫ్ట్‌తో ఐఒసి, ఒఐఎల్, బిపిఆర్‌ఎల్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందుకు 2 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించనున్నాయి. మరోవైపు భారత చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి విదేశీ విభాగమైన ఒఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్ కూడా వాంకోర్ చమురు క్షేత్రంలో అదనంగా 11 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి రాస్‌నెఫ్ట్‌తో ఓ ప్రత్యేక ఎమ్‌ఒయు కుదుర్చుకుంది. 925 మిలియన్ డాలర్లతో ఈ వాటాను సొంతం చేసుకుంటోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇందులో 15 శాతం వాటాను 1.26 బిలియన్ డాలర్లకు ఒఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. రష్యాలోని రెండో అతిపెద్ద చమురు క్షేత్రం వాంకోర్. కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం రాస్‌నెఫ్ట్ సిఇఒ ఇగోర్ సెచిన్ భారత్‌కు వచ్చిన సందర్భంగా ఈ ఒప్పందాలన్నీ కుదిరాయి. రెండో రోజైన బుధవారం ఇక్కడ ఆయా సంస్థల అధికారులు ఒప్పందాలు చేసుకున్నారు. టాస్- యురైకా చమురు క్షేత్రంలో గత ఏడాది బ్రిటన్‌కు చెందిన ప్రభుత్వరంగ చమురు దిగ్గజం బ్రిటీష్ పెట్రోలియం (బిపి) 20 శాతం వాటాను రాస్‌నెఫ్ట్ నుంచి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తాజాగా భారతీయ సంస్థలు 29.9 శాతం వాటా కొనుగోలుకు రాస్‌నెఫ్ట్‌తో ఒప్పందాలు చేసుకోగా, టాస్-యురైకా చమురు క్షేత్రంలో రాస్‌నెఫ్ట్ వాటా 50.1 శాతానికి పడిపోయింది.
ఎస్సార్ ఆయిల్‌లో రాస్‌నెఫ్ట్‌కు వాటా
మరోవైపు ఎస్సార్ ఆయిల్‌లో 49 శాతం వాటాను రాస్‌నెఫ్ట్ కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి ఓ ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు బుధవారం రాస్‌నెఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లోగా ఈ లావాదేవీలు ముగిసే వీలుందని ఎస్సార్ డైరెక్టర్లు ప్రశాంత్ రుయా, రవి రుయాలతో సమావేశం అనంతరం రాస్‌నెఫ్ట్ సిఇఒ ఇగోర్ సెచిన్ విలేఖరులకు తెలిపారు.

చిత్రం... రష్యా చమురు ఉత్పాదక దిగ్గజం రాస్‌నెఫ్ట్‌తో భారత ప్రభుత్వరంగ చమురు సంస్థల ఒప్పందాల దృశ్యం