బిజినెస్

క్షీణించిన మారుతి సుజుకి లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 11.7 శాతం పడిపోయి 1,133.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 1,284.2 కోట్ల రూపాయలుగా ఉంది. గడచిన రెండేళ్ళలో మారుతి త్రైమాసిక లాభం పతనమవడం ఇదే తొలిసారి. అయితే హర్యానాలో జాట్ల రిజర్వేషన్ ఆందోళన అక్కడి ప్లాంట్ కార్యకలాపాలపై, తద్వారా లాభాలపై ప్రభావం చూపిందని సంస్థ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. 10,000 యూనిట్లకుపైగా ఉత్పత్తి ఆగిపోయిందన్నాయి. అలాగే నూతన మోడళ్ల మార్కెటింగ్ కోసం అధిక ప్రకటనల వ్యయం కూడా లాభాలను తగ్గించింది. ఇక నికర అమ్మకాల ద్వారా ఆదాయం ఈసారి 14,929.5 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 13,272.5 కోట్ల రూపాయలుగా ఉంది. కార్ల అమ్మకాలు ఈ జనవరి-మార్చిలో పోయినసారితో పోల్చితే 3.9 శాతం పెరిగి 3,60,402 యూనిట్లుగా ఉన్నాయి. ఇదిలావుంటే మొత్తం గత ఆర్థిక సంవత్సరం మారుతి సుజుకి లాభం 23.2 శాతం పెరిగింది. తద్వారా రికార్డు స్థాయిలో 4,571.4 కోట్ల రూపాయల లాభాన్ని మారుతి అందుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 3,711.2 కోట్ల రూపాయలతోనే సరిపెట్టుకుంది. నికర అమ్మకాలు 2015-16లో 56,350.4 కోట్ల రూపాయలుగా ఉంటే, 2014-15లో 48,605.5 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా, 2015-16కుగాను 5 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌కు 35 రూపాయల డివిడెండ్‌ను మారుతి సుజుకి ప్రకటించింది. 2014-15లో 25 రూపాయల డివిడెండ్‌ను ఇచ్చింది. ఇకపోతే గత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) కూడా అలాగే ఉంటాయని, రెండంకెల వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసాన్ని మారుతి సుజుకి ఇండియా సిఎఫ్‌ఒ అజయ్ సేథ్ వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4,400 కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతున్నట్లు చెప్పారు.