బిజినెస్

ఎదురుచూపులు.. ఇంకెన్నాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 26: ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో మేటిగా నిలుస్తున్న ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం పట్టణాలను ‘ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్సీ’ పథకానికి ఎంపికచేసిన కేంద్రం.. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఇందుకు సంబంధించిన నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఇలా ఎంపికైన ప్రాంతాల్లో ఆక్వా రంగ అభివృద్ధికి అవసరమైన వౌలిక సదుపాయాలు మెరుగుపర్చడానికి కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయి. అయితే భీమవరం, విశాఖకు మాత్రం ఇంతవరకు నిధులు విడుదలకాలేదు. దేశంలో ఎక్కడైనా ఏదైనా రంగం నుంచి ఉత్పత్తులు, ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం వస్తుంటే దానిని ప్రోత్సహించడానికి ఆయా ఉత్పత్తులు, ఎగుమతులు జరిగే ప్రాంతాలను భారత ప్రభుత్వం ‘ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్సీ’ పథకానికి ఎంపిక చేస్తుంది. ఆయా ఉత్పత్తులు, ఎగుమతులను మరింతగా పెంచడానికి అవసరమైన వౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తుంది. దేశంలో ఇప్పటివరకు 33 పట్టణాలను ఈ విధంగా ఎక్స్‌పోర్టు ఎక్స్‌లెన్సీ పథకానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా రాష్ట్రం నుండి ఏటేటా వేల కోట్ల రూపాయల ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతులు జరుగుతున్న విశాఖపట్నం, భీమవరం పట్టణాలను 2015లో ‘ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్సీ’ పథకం కింద గుర్తించింది. ఆక్వా రంగంలో వౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ రెండు ప్రాంతాలకు సుమారు రూ. 300 కోట్ల వరకు నిధులు విడుదలవుతాయని అప్పట్లో అంతా భావించారు. ఆక్వా ఉత్పత్తుల అభివృద్ధికి అత్యంత కీలకమైన హేచరీల ఏర్పాటు, ఆక్వా సాగు చెరువులకు అవసరమైన నీటిని అందించడానికి కాలువలను అభివృద్ధిపరచుకోవడం, ఉత్పత్తుల రవాణాకు అవసరమైన రహదారి వ్యవస్థను మెరుగుపరచుకోవడం, ఉత్పత్తుల నిల్వకు అవసరమైన కోల్ట్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకోవడం, వీటి నిర్వహణకు ప్రత్యేక విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం తదితరాలు ఈ నిధులతో చేపట్టే అవకాశముంది. ఇన్నాళ్లూ అరకొర వసతులతో సొంత పరిజ్ఞానంతో ఆక్వాసాగు చేస్తున్న రైతాంగం ఎక్స్‌లెన్సీ నిధులతో తమ తమ ప్రాంతాలకు మహర్దశ పడుతుందని భావించింది. అయితే ఏడాది గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దేశంలో ఏటా సుమారు రూ. 35 వేల కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధాన వాటా ఆంధ్రప్రదేశ్‌దే. ఒక్క పశ్చిమగోదావరి జిల్లా నుండే సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి 2014-15లో 2.95 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవగా, 2015-16 నాటికి 4.91 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇప్పటికే ఈ రంగం నుండి రెండు అంకెల వృద్ధిరేటు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్సీ నిధులు విడుదలై, వౌలిక సదుపాయాలు అభివృద్ధిచెందితే ఉత్పత్తులు మరింతగా పెరుగుతాయని రైతులు, ఎగుమతిదారులు పేర్కొంటున్నారు. 2004లో కూడా భీమవరం ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్సీ పథకం కింద ఎంపికైనా అనివార్య కారణాలవల్ల నిధులు విడుదల కాలేదు. ఈసారి కూడా ఏడాదైనా నిధుల మంజూరు జరగకపోవడంతో అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, నిధులు మంజూరు చేయించడంలో రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని ఈ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికే చెందిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా ఎక్స్‌పోర్టు ఎక్స్‌లెన్సీ నిధుల విడుదలకు కృషి చేయాలని రైతులు, ఎగుమతిదారులు కోరుతున్నారు.