బిజినెస్

మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 7: కృష్ణా జిల్లాలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత ముమ్మరం కానున్నందున మచిలీపట్నం కేంద్రంగా మరో ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వరంగ చమురు ఉత్పాదక దిగ్గజాలైన ఒఎన్‌జిసి, గెయిల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఒఎన్‌జిసి, గెయిల్ అధికారులు చంద్రబాబు నాయుడును మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో కలిశారు.
నాగాయలంక ప్రాంతంలో ఎల్‌పిజి ప్లాంట్ ప్రతిపాదన ఉందని గెయిల్, ఒఎన్‌జిసి అధికారులు ఈ సందర్భంగా సిఎంకు తెలియచేశారు. కాగా, రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేర చమురు నిక్షేపాలు ఉన్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేయాలని చంద్రబాబు అధికారులను కోరారు. రాష్ట్రంలో వౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రహదారి విస్తరణ, జల రవాణా, విమాన రవాణాను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
భవిష్యత్‌లో ఇక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా సరుకు రవాణాకు వీలుగా పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాగా, కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్ పరిధిలో 933 కిలోమీటర్ల పొడవునా గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టామని, అందులో 617 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయని, మిగిలిన 316 కిలోమీటర్ల పైపు లైన్ పనులు త్వరలోనే మొదలు పెడతామని గెయిల్ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పా రు. రాష్ట్రంలోని పాశర్లపూడి, మోరి, నరసాపురం, మండపేట, గోపవరం ప్రాంతాల్లో ఒఎన్‌జిసి నిర్వహణలో సహజ వాయు నిర్జలీకరణ కేంద్రాలు ఉన్నాయని, కేశనపల్లి, యండమూరు, తాటిపాక, కెపిడిఎ ప్రాంతాల్లో మరో నాలుగు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలియచేశారు.
రిమోట్‌తో ప్రమాదాల నియంత్రణ
గ్యాస్ పైపు లైన్లకు సంబంధించి తీసుకున్న సురక్షిత చర్యల గురించి కూడా అధికారులు సిఎంకు వివరించారు. మెయిన్ పైప్ లైన్ వాల్వులను రిమోట్ సహాయంతో నియంత్రించే వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్టు అధికారులు చెప్పారు.
లీక్ డిటెన్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒఎన్‌జిసి 67 చమురు బావులలో వెలికితీత పనులు చేపట్టనున్నట్టు అధికారులు సిఎం చంద్రబాబుకు తెలిపారు. అయతే గోదావరి జిల్లాల్లో వరి పండించే భూములను చేపల చెరువులుగా మార్చే ప్రక్రియ జోరుగా సాగుతున్నందున క్షేత్ర స్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఒఎన్‌జిసి అధికారులు సిఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇక చంద్రబాబు మాట్లాడుతూ విశాఖలో నెలకొల్పనున్న పెట్రోలియం విశ్వవిద్యాలయానికి సహకారం అందించాలని ఒఎన్‌జిసి, గెయిల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఎనర్జీ, వాటర్, లాజిస్టిక్, హాస్పిటాలిటీ, స్పోర్ట్స్ వర్శిటీల్లో ఈ రెండు సంస్థలు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి అయ్యర్, చీఫ్ మేనేజర్ సిహెచ్‌కెఎన్‌వి కన్నారావు, ఒఎన్‌జిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి సన్యాల్, జిజిఎం టిఎస్ రావు, జిఎం పివి సతీష్ కుమార్, డిజిఎం ఎస్‌ఎస్‌రెడ్డి, డిజిఎం (ప్రొడక్షన్) ఐవిఎస్‌ఎస్ దత్తు తదితరులు పాల్గొన్నారు.

గెయిల్, ఒఎన్‌జిసి అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు