బిజినెస్

లాభాల బాటలో జిసిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల సాధన దిశగా గిరిజన సహకార సంస్థ (జిసిసి) ముందడుగు వేస్తోంది. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోంది. గత రెండేళ్లలో నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, కొత్త వ్యాపార కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 2014-15లో రూ.142 కోట్ల టర్నోవర్, 2015-16లో రూ.183 కోట్ల టర్నోవర్ చేయగా, 2016-17లో రూ.367 కోట్లు లక్ష్యంగా వివిధ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. సంస్థ ద్వారా తేనె, షర్బత్, అరకు కాఫీ, సబ్బులు, కుంకుడుకాయ పొడి, పసుపు, త్రిఫల చూర్ణం, అలోవెరా సబ్బులు ఉత్పత్తి అవుతోంది. గిరిజన ప్రాంతాల్లో తేనె తయారీ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వ్యాపార విస్తరణకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి ఆన్‌లైన్ షాపులు, వాల్‌మార్ట్ వంటి ప్రముఖ రిటైల్ షాపులతోనూ ఏర్పాట్లు జరిగాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ రిటైల్ అమ్మకాల కోసం సన్నాహాలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ కేంద్రాల ఆధునికీకరణపై జీసిసి దృష్టి సారించింది. రాజమండ్రిలోని తేనె శుద్ధి, బాట్లింగ్ యూనిట్‌ను కొత్త పరికరాలతో నవీకరించింది. రూ.50 లక్షలు వెచ్చించి నూతన పరికరాలు కొనుగోలు చేసి యూనిట్‌ను మరో రూ.50 లక్షల వ్యయంతో విజయనగరంలోని సబ్బుల తయారీ యూనిట్‌లో సెమీ ఆటోమేటిక్ ఉత్పత్తిని ప్రారంభించింది. నన్నారి షర్బత్, మారేడు (బిల్వ) షర్బత్ అమ్మకాల కోసం సోడా హబ్‌లను ఆరంభించింది. జిసిసి ద్వారా 15 పెట్రోలు బంకులు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది. ప్రతి పెట్రోలు బంకు ఆవరణలో గిరిజన ఉత్పత్తుల అమ్మకాల కోసం మినీ సూపర్ బజార్లు, సోడా హబ్బుల ఏర్పాటు జరుగుతోందని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎపిపిఎస్ రవిప్రకాష్ తెలిపారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిసిసి ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగు చర్యలు చేపట్టారు. పూర్తి పారదర్శకత, ఖచ్చితత్వం కోసం జిసిసి అన్ని స్థాయిల్లో కంప్యూటరీకరణ చేపట్టింది. ఇ-టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. సుమారు రూ.5.90 కోట్ల వ్యయంతో 12 గోడౌన్లు, 35 డిఆర్ డిపోలకు 9 శాశ్వత భవనాలు నిర్మించింది. ఐటిడిఎ (పాడేరు) ఐఎపి పథకంలో నర్సీపట్నంలో రాగిపిండి తయారీ యూనిట్‌కు, కాఫీ గింజల స్టోరేజ్‌కు రూ.85 లక్షల వ్యయంతో రెండు గోడౌన్లు నిర్మించింది. నల్లమల ప్రాంతంలోని పెదదోర్నాలలో సొసైటీ కార్యాలయాన్ని ఆధునికీకరించింది.
అటవీ ఉత్పత్తులకు ధ్రువీకరణ
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్ట్ఫికెట్ పొందింది. కోవెల జిగురు, ఉసిరి పప్పు, నల్లజీడి గింజలు, కరక్కాయలు, ముషిణి గింజలు, కుంకుడుకాయలు, శీకాయి, చింతపండు, నన్నారి వేరు, సుగంధిపాల, సర్పగంధి వేళ్లు, అందుగ జిగురు ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్ట్ఫికెట్ లభించింది. ఎపెడా గుర్తింపు పొందిన ఫుడ్-సెర్ట్ సంస్థచే ట్రేడింగ్‌లోనూ, ప్రాసెసింగ్‌లోనూ ఆర్గానిక్ సర్ట్ఫికెట్ పొందింది. సేంద్రీయ అటవీ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా గిరిజనుల ఆదాయం 30 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉంది. జిసిసి ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకుంటోంది. గిరిజనుల కాఫీ పంటకు కూడా ఆర్గానిక్ సర్ట్ఫికెట్ పొందేందుకు కృషి చేస్తోంది. పాడేరు పసుపు, గిరిజన్ తేనె, అరకువ్యాలీ కాఫీకి జియో టాగింగ్ కోసం చర్యలు చేపట్టింది. అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర పథకం కింద పూర్తిస్థాయిలో అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు ప్రారంభించింది. ఈ పథకం వల్ల సుమారు 10 లక్షల మంది అటవీ ఉత్పత్తుల సేకరణదారులకు లబ్ధి చేకూరుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాడేరు ఏజెన్సీలో హుద్‌హుద్ తుపాను దరిమిలా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2015-16 నుంచి 2024-25 వరకు 14ఏళ్ల అమలయ్యే కాఫీ అభివృద్ధి పథకం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.526.16 కోట్లు. దీనికి సంబంధించి మార్కెటింగ్ బాధ్యతను జిసిసికి అప్పగించింది. రైతుల నుంచి ముడి కాఫీ సేకరణను గత డిసెంబర్ 13న ప్రారంభించి ఇప్పటివరకూ రూ.15 కోట్ల విలువైన 1400 టన్నుల ముడికాఫీని సేకరించింది. కాఫీ సేకరణలో పూర్తిస్థాయి పారదర్శకత కోసం మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాటాలు, బిల్లింగ మెషిన్లు, టాబ్‌లు వినియోగిస్తోంది. ముడికాఫీని పాడేరు ఏజెన్సీలో ఏర్పాటు చేసిన పూలింగ్ కేంద్రాల నుంచి రవాణా చేసి నర్సీపట్నంలోని ఏపిఎస్‌డిసి క్యూరింగ్ యూనిట్లో ప్రాసెసింగ్, గ్రేడింగ్ చేస్తోంది. తయారైన శుద్ధమైన కాఫీ గింజలను ఇ-వేలం ద్వారా అమ్మకాలు చేపట్టి, ఇప్పటివరకు సుమారు రూ.2కోట్ల విలువైన 200 టన్నుల కాఫీ గింజలను విక్రయించింది. ఇ-కాఫీ మార్కెటింగ్ సౌకర్యం వల్ల 20వేల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతోంది.
అరకువ్యాలీ కాఫీకి విశిష్టమైన వాసన, రుచి ఉంది. రైతులు పండించే ఈ కాఫీ వ్యాపారస్థుల ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతోంది. అద్భుతమైన కాఫీ రుచిని రాష్ట్ర వినియోగదారులకు అందించేందుకు జిసిసి అరకు వ్యాలీ కాఫీ బ్రాండు పేరుతో కాఫీ పొడిని తయారుచేసి మార్కెట్‌లో విడుదల చేసింది. అరకు కాఫీగా పేరొందిన ఈ కాఫీ మార్కెట్లోకి వస్తూనే రూ.10 లక్షల ఆర్డర్ పొందడం విశేషం. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచస్థాయి ట్రేడ్ సమ్మిట్‌లోనూ, ఇంటర్నేషనల్ ఫ్లీట్‌లోనూ, విజయవాడలో జరిగిన భారత గిరిజన సమావేశంలోనూ అరకు వ్యాలీ కాఫీకి మంచి గుర్తింపు, ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో జిసిసి అరకు వ్యాలీ కాఫీని ప్రపంచ స్థాయి వినియోగదారుల మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
నూతన సాంకేతిక ప్రక్రియలను అందిపుచ్చుకుంటున్న జిసిసి 2016-17 సంవత్సరంలో రూ.367 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందడుగు వేస్తోంది.