బిజినెస్

ఆయిల్ మాఫియా అడ్డా... కాకినాడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 20: వంట నూనె మొదలుకొని వాహనాలకు వాడే ఇంధనం వరకు సర్వం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆయిల్ మాఫియా ఆడుకుంటోంది. ముఖ్యంగా నాణ్యతలేని వంటనూనెలతో ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతోంది. అటు కల్తీ పెట్రోల్, డీజిల్ కారణంగా వాహనాలకు, పర్యావరణానికీ ముప్పు తప్పడం లేదు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరం కేంద్రంగా ఆయిల్ మాఫియా కొనే్నళ్లుగా చెలరేగిపోతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అండదండలతో ఆయిల్ మాఫియా కల్తీ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఈ కల్తీ నూనెలు ఎగుమతి చేస్తూ కోట్లు దండుకుంటోంది మాఫియా. కాకినాడ కేంద్రంగా సుమారు 10 సంస్థలు వంటనూనెలు శుద్ధిచేసి ప్యాకింగ్ చేస్తున్నాయి. చాలాకాలంగా ప్రభుత్వం.. పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్టవ్య్రాప్తంగా చౌక ధరల దుకాణాలకు కాకినాడలో తయారయ్యే ఈ వంటనూనెలనే కొనుగోలుచేసి, సరఫరా చేస్తోంది. విదేశాల నుండి నౌకల ద్వారా వచ్చే ముడి నూనె, వనస్పతి, పామాయిల్, సన్‌ఫ్లవర్ తదితరాలను స్థానికంగా శుద్ధి చేస్తుంటారు. అయతే కొన్ని ఆయిల్ సంస్థలు పెద్ద ఎత్తున వంటనూనెలను కల్తీ చేస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ వేరుశనగ నూనె ప్యాకెట్లలో భారీగా కల్తీ జరుగున్నట్టు తెలుస్తోంది. వేరుశనగ నూనెలో దాదాపు 80 శాతం కాటన్ నూనె కలిపి ప్యాకింగ్ చేస్తున్న ఉదంతం బయటకొచ్చింది. వంటనూనెలకు సంబంధించి అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ శాఖ మార్క్ (అగ్‌మార్క్) తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆ మార్క్ మాత్రమే కనిపిస్తుంది తప్ప సదరు శాఖ నుండి అక్రమార్కులు ఏ విధమైన అనుమతులు తీసుకోవడం లేదని అధికారుల దాడుల్లో బట్టబయలయ్యింది. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను శుద్ధిచేసే సమయంలోనూ పలు సంస్థలు కల్తీ చేస్తున్నట్టు సమాచారం. ఫలితంగా కల్తీ వంటనూనెలు మార్కెట్‌లోకి వస్తుండటంతో ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం ఏర్పడింది. కల్తీ నూనెల కారణంగా ప్రాణాంతక రోగాల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ తీరంలోని వలసపాకల, వాకలపూడి, సూర్యారావుపేట, అచ్చంపేట, ఎడిబి రోడ్డు, గొడారిగుంట తదితర ప్రాంతాల్లో ఈ నకిలీ ఆయిల్ మాఫియా కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయ. మూడున్నర సంవత్సరాల క్రితం ఎపిఐఐసి కాలనీలోని ఓ చమురు సంస్థలో అనుమతిలేని అక్రమ నిల్వలు వెలుగుచూశాయి. కోటి రూపాయల విలువైన ఈ అక్రమ నిల్వలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మళ్ళీ దాడులు జరిగిన దాఖలాల్లేవు. ఒక యూనిట్ కోసం అనుమతి తీసుకోవడం, దాని పేరుతో రెండు మూడు ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఏ విధమైన అనుమతుల్లేకుండా కంపెనీలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇదిలావుంటే కాకినాడ తీరం కేంద్రంగానే పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్‌నూ అక్రమార్కులు కల్తీ చేస్తున్నారు. కాకినాడ నుండి యానాం వరకు గల బంకుల్లో చాలావరకు అక్రమ వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి. పెట్రోలులో నాఫ్తా, డీజిల్‌లో నీలి కిరోసిన్‌ను కలిపేస్తున్నారు. విదేశాల నుండి కాకినాడ పోర్టుకు వచ్చే నౌకల ద్వారా స్థానిక మాఫియా నాఫ్తాను ట్యాంకర్లలో సేకరించి, రహస్య స్థావరాలకు తరలిస్తోంది. అక్కడి నుండి నేరుగా బంకులకు ట్యాంకర్లను తీసుకువచ్చి పెట్రోలులో కలుపుతున్నారు. నాఫ్తా కలిపిన పెట్రోల్ వలన వాహనాల ట్యాంకులు పేలి, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ మాఫియా చెలరేగిపోతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేదలకిచ్చే నీలి కిరోసిన్‌ను కారుచౌకగా సేకరించి, డీజిల్‌లో కలిపేస్తున్నారు. ఈ తంతు చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ వస్తుండటం గమనార్హం. అనేక బంకుల్లో కల్తీ జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఇటీవల పోలీసులు కాకినాడ తిమ్మాపురంలోని శ్రీ లక్ష్మీ ఏజన్సీ అనే బంకును సీజ్ చేసి, నిర్వాహకులను అరెస్టు చేశారు. అయితే సదరు బంకు నిర్వాహకుడికి అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసేందుకు సైతం జంకాల్సి వచ్చింది. మొత్తానికి తమ చుట్టూ రాజకీయ రక్షణ గోడను నిర్మించుకున్న చమురు మాఫియా.. తమ అక్రమ దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా సుభిక్షం చేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాగర తీరంలోని ముడి చమురు శుద్ధి, వంట నూనెల ప్యాకింగ్ సంస్థలు