బిజినెస్

వడ్డీరేట్ల కోతల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 9: కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. వర్షాలు సమృద్ధిగానే కురుస్తున్నప్పటికీ, ద్రవ్యోల్బణం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి వెళ్లలేదు. మంగళవారం ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరగగా, ఇది రాజన్‌కు ఆఖరి ద్రవ్యసమీక్ష. వచ్చే నెల 4తో ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అక్టోబర్‌లో జరిగే నాలుగో ద్రవ్యసమీక్షకు కొత్త గవర్నర్ రానున్నారు. ఇకపోతే అంచనాలకు తగ్గట్లే రాజన్ ఆఖరి సమీక్ష కొనసాగగా, వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న తీరును ఆయన ఆక్షేపించారు. ద్రవ్యసమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన రాజన్.. తాము బ్యాంకులకు అందించిన ప్రయోజనాల్లో కొంతే ఖాతాదారులకు బ్యాంకర్లు అందిస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా, రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చిన రుణాలపై ఆర్‌బిఐ తీసుకునే వడ్డీరేటు) ఐదేళ్ల కనిష్టం వద్ద 6.50 శాతంగా ఉంటే, రివర్స్ రేపో రేటు (ఆర్‌బిఐ వద్ద బ్యాంకులు చేసిన డిపాజిట్లకు ఆర్‌బిఐ బ్యాంకులకు చెల్లించే వడ్డీరేటు) 6 శాతంగా ఉంది. నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్) కూడా అలాగే 4 శాతం వద్ద ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనా సైతం ఎలాంటి మార్పులు లేకుండా 7.6 శాతంగానే ఉంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను భారత్ అధిగమించి వృద్ధిపథంలో సాగగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఇక వచ్చే ఏడాది మార్చి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతాన్ని సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది ఆర్‌బిఐ. ఇదిలావుంటే ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా, వృద్ధిరేటును కూడా పణంగా పెట్టి ద్రవ్యవిధానాన్ని పాటిస్తారనే విమర్శలను ఎదుర్కొన్న రాజన్.. తన నిర్ణయాలు సమీప భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయని అన్నారు. అలాగే అక్టోబర్ 4న జరిగే నాలుగో ద్రవ్యసమీక్ష నుంచి వడ్డీరేట్లను ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. వడ్డీరేట్లపై నిర్ణయాన్ని కమిటీ మరింత విశ్వసనీయంగా, స్వతంత్రంగా తీసుకుంటుందన్నారు. ఇక దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల గురించి రాజన్ మాట్లాడుతూ ఇప్పటిదాకా నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ లేదా మొండి బకాయిలు) ప్రక్షాళన బాగానే జరిగిందన్నారు. మొండి బకాయిలతో ప్రమాదం కాస్త తగ్గిందన్నారు. కాగా, ఆర్‌బిఐ గవర్నర్‌గా తన మూడేళ్ల పదవీకాలంపై మాట్లాడుతూ చాలా బాగా గడిచిందన్నారు. తాను సంతృప్తిని పొందనన్నారు. తన ద్రవ్యవిధానంపై కొందరు చేస్తున్న విమర్శల నేపథ్యంలో రాబోయే 5-6 సంవత్సరాల్లో తాను తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయని అన్నారు. నిజానికి మరోసారి గవర్నర్‌గా కొనసాగాలని ఉందని రాజన్ తన మనసులో మాటను పరోక్షంగా బయటపెట్టినప్పటికీ, విమర్శలు, ఆరోపణల మధ్య తాను కొనసాగలేనని ప్రకటించినది తెలిసిందే. రాజన్‌కు మద్దతుగా పారిశ్రామిక, వ్యాపార రంగాలు నిలిచినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరో కొత్త గవర్నర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కాగా, రాబోయే నూతన ఆర్‌బిఐ గవర్నర్‌కు తాను ఎలాంటి వివాదాలు లేకుండా స్వాగతం పలుకుతానని రాజన్ అన్నారు. పదవీ విరమణ తర్వాత తాను అధ్యాపక వృత్తిలోకే వెళతానని స్పష్టం చేశారు. ఈ మూడేళ్లలో చోటుచేసుకున్న మార్పులను అర్థం చేసుకుని పరిశోధనలు ప్రారంభిస్తానని చెప్పారు.

ఎవరేమన్నారు

‘వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయన్న అంచనాకు తగ్గట్లే ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష సాగింది. రుణాలు పెరిగితే వడ్డీరేట్లు తగ్గడం మొదలవుతుంది.’
- ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
‘వర్షాలు బాగా పడుతుండటంతో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెపో రేటు 50-100 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని భావిస్తున్నాం.’
- రాణా కపూర్ (యెస్ బ్యాంక్)
‘ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రతికూల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. అప్పుడు వడ్డీరేట్లూ దిగివస్తాయి.’
- శాంతీ ఏకాంబరం (కొటక్ మహీంద్ర బ్యాంక్)
‘ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ఊహించినట్లుగానే ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది.’ - మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్
‘వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది. కాబట్టి రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను ఆర్‌బిఐ తప్పక తగ్గిస్తుంది.’
- మహేశ్ గుప్తా (పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్)
‘కావాల్సినంత ద్రవ్యలభ్యత కోసం అవలం భిస్తున్న విధానాలను స్వాగతిస్తున్నాం. విధాన నిర్ణయాలను కొనసాగించడాన్ని అభినందిస్తున్నాం.’
- ఐసిఐసిఐ ఎండి చందా కొచ్చర్
‘ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి. మున్ముందు వడ్డీరేట్లు తగ్గుతాయి.’
- ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా
‘ఎగుమతులు పుంజుకోవాలంటే ఎగుమతిదారులకు ఆర్థిక దన్ను లభించాలి. వడ్డీరేట్లు తగ్గితేనే బ్యాంకుల రుణాలు చౌకగా లభిస్తాయి.’
- ఇఇపిసి ఇండియా చైర్మన్ టిఎస్ భాసిన్
‘ద్రవ్యోల్బణం, వృద్ధిరేటును పరిగణనలోకి తీసుకుని వడ్డీరేట్లపై నిర్ణయాలు తీసుకోవాలి. ఆ దిశగా మార్పులు చాలా అవసరం. మున్ముందు ఆ ఆశ నెరవేరుతుందని అనుకుంటున్నాం.’
- పారిశ్రామిక సంఘం అసోచామ్