బిజినెస్

యూరియా వ్యాపారాన్ని అమ్మేసిన టాటా కెమికల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 10: బహుళ వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్‌నకు చెందిన సంస్థ టాటా కెమికల్స్.. తమ యూరియా వ్యాపారాన్ని నార్వేకు చెందిన యరా ఫర్టిలైజర్స్‌కు అమ్ముతున్నట్లు బుధవారం ప్రకటించింది. 2,670 కోట్ల రూపాయలకు ఉత్తరప్రదేశ్‌లోని బర్బాలా వద్దగల తమ ఏకైక యూరియా ఉత్పత్తి కేంద్రాన్ని యరా ఫర్టిలైజర్స్‌కు విక్రయిస్తున్నామంది. దీని వార్షిక ఉత్పాదక సామర్థ్యం దాదాపు 1.2 మిలియన్ టన్నులు. మిగతా వ్యాపారాలతో పోల్చితే ప్రభుత్వ నియంతృత్వం అధికంగా ఉండే యూరియా వ్యాపారంపై అసంతృప్తితో ఉన్న టాటా గ్రూప్.. దాన్ని అమ్మేయడమే శ్రేయస్కరమని ఎప్పట్నుంచో భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే యరా ఫర్టిలైజర్స్‌కు యూరియా వ్యాపారాన్ని అమ్మేసింది. ఇదిలావుంటే తాజా లావాదేవీతో వచ్చే ఆదాయంతో ఉప్పు (టాటా సాల్ట్), పప్పు్ధన్యాలు, సుగంధద్రవ్యాలు (మార్కెట్‌లో సంపన్న్ బ్రాండ్‌లో లభిస్తున్నాయి), వాటర్ ప్యూరిఫైయర్ (టాటా స్వచ్ఛ్) వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇక రాబోయే 9-12 నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని అంచనా. కాగా, యూరియా వ్యాపార అమ్మకానికి సంబంధించి యరా ఫర్టిలైజర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని టాటా కెమికల్స్ బోర్డు బుధవారం ఆమోదించింది. ఈ మేరకు టాటా కెమికల్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. యూరియా వ్యాపారానికి సంబంధించి టాటా కెమికల్స్‌కు చెందిన ఆస్తులు, ఒప్పందాలు, రుణాలు, పత్రాలను బదిలీ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ‘మా కన్జ్యూమర్ బిజినెస్ వ్యూహాత్మక నిర్మాణంలో భాగంగానే ఈ అమ్మకం. కెమికల్ వ్యాపారంలో మా ఆధిపత్యాన్ని కొనసాగిస్తాం. రల్లీస్, మెటాహెలిక్స్ ద్వారా వ్యవసాయ అనుబంధ వ్యాపారాలనూ బలోపేతం చేయడంపై దృష్టి పెడతాం.’ అని టాటా కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ముకుందన్ అన్నారు. యూరియా వ్యాపారాన్ని మాత్రమే అమ్మేస్తున్నామని, పరాస్, టికెఎస్, దక్ష బ్రాండ్లు టాటా కెమికల్స్‌లో భాగంగానే ఇకముందూ ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ఉత్పత్తి కొనసాగుతుందని చెప్పారు. అయితే సరైన అవకాశాలు, నిలకడైన భాగస్వామ్యం లభించేదాకా పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలోగల కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ప్లాంట్‌పై పెట్టుబడులను నిలిపివేస్తున్నామన్నారు. మరోవైపు యూరియా వ్యాపారం నుంచి టాటా కెమికల్స్ బయటకు రావడంతో ఆ సంస్థ షేర్ విలువ బుధవారం ఒక్కరోజే దాదాపు 9 శాతం ఎగబాకింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్‌లో 8.77 శాతం వృద్ధితో 503.60 రూపాయల వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 509.30 రూపాయల గరిష్ఠ స్థాయినీ టాటా కెమికల్స్ షేర్ విలువ తాకింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను ప్రభుత్వం నుంచి యూరియా అమ్మకాలపై టాటా కెమికల్స్‌కు 1,479 కోట్ల రూపాయల రాయితీ వచ్చింది. తయారీ ఖర్చు, ఎమ్‌ఆర్‌పి కంటే తక్కువగా ప్రభుత్వం నిర్ణయించిన యూరియా ధరలుండటంతో మార్కెట్‌లో వాటి అమ్మకాలపై యూరియా తయారీ సంస్థలకు వచ్చే నష్టాలకుగాను ప్రభుత్వం కొంత సబ్సిడీనిస్తోంది. ఇకపోతే గత ఇరవై ఏళ్లుగా భారతీయ వ్యాపార రంగంలో కొనసాగుతున్న యరా సంస్థ.. దేశీయంగా పెట్టిన తొలి పెట్టుబడి ఇదే. టాటా కెమికల్స్ యూరియా ప్లాంట్ కొనుగోలుతో మార్కెట్‌లో సంస్థ వాటా 5 శాతం పెరుగుతుందన్న ఆశాభావాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కన్వర్ వెలిబుచ్చారు. 2015లో 13.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందిన ఈ ఓస్లో ఆధారిత సంస్థ.. 15 దేశాలు, 27 అగ్రశ్రేణి మార్కెట్లలో తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది.