బిజినెస్

ఎస్‌బిఐకి మొండి బకాయిల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 12: దేశీయ బ్యాంకింగ్‌రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారీగా క్షీణించింది. 1,046 కోట్ల రూపాయలుగానే నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో లాభం 4,714 కోట్ల రూపాయలుగా ఉంది. పెరిగిన మొండి బకాయిలే లాభాల్లో క్షీణతకు ప్రధాన కారణం. నిరుడు ఏప్రిల్-జూన్‌లో 3,358.58 కోట్ల రూపాయలుగా ఉన్న నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు లేదా ఎన్‌పిఎ).. ఈ ఏడాది ఏప్రిల్- జూన్‌లో 6,340 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అందుకే ఆదాయం పెరిగినా ఫలితం లేకపోయింది.
ఈ మూడు నెలల్లో బ్యాంక్ ఏకీకృత ఆదాయం 69,415 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు ఇదే సమయంలో 63,164.5 కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలియజేశారు.
ఇకపోతే స్టాండలోన్ ఆధారంగా చూస్తే ఈసారి ఎస్‌బిఐ లాభం 32 శాతం పడిపోయి 2,520.9 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు 3,692.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం మాత్రం 44,730.87 కోట్ల రూపాయల నుంచి 48,928.6 కోట్ల రూపాయలకు పెరిగింది. మరోవైపు ఎస్‌బిఐ స్థూల నిరర్థక ఆస్తుల విలువ ఏడాది కాలంలో దాదాపు రెండింతలకు పెరగడం గమనార్హం.
ఈ ఏడాది జూన్ 30 నాటికి 1,01,541 కోట్ల రూపాయలుగా ఉంటే, నిరుడు జూన్ 30 నాటికి 56,420.77 కోట్ల రూపాయలుగా ఉంది. నికర నిరర్థక ఆస్తుల విలువ కూడా 28,669.14 కోట్ల రూపాయల నుంచి 57,420.98 కోట్ల రూపాయలకు పెరిగింది. కాగా, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలోనూ ఎస్‌బిఐ లాభం.. మొండి బకాయిల కారణంగా పడిపోయినది తెలిసిందే.
ఏప్రిల్-జూన్‌లోనూ మొండి బకాయిల ప్రభావం బ్యాంక్ లాభాలపై ఉంటుందని అప్పుడే బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు కూడా. ఇకపోతే జనవరి-మార్చిలో మరో పదికిపైగా ప్రభుత్వరంగ బ్యాంకులు ఏకంగా భారీ నష్టాలకు గురయ్యాయి. భారత బ్యాంకింగ్ వ్యవస్థను, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే మొండి బకాయిలు ప్రశ్నార్థం చేస్తుండటంతో అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), ఇటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. మొత్తానికి బాసెల్-3 నిబంధనల ప్రకారం తగినంత మూలధనం లేక సతమతమవుతున్న బ్యాంకులను మొండి బకాయిలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

శుక్రవారం ముంబయలో ఆర్థిక ఫలితాలను
ప్రకటిస్తున్న ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య

తగ్గిన ఐఐపి..
పెరిగిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ, ఆగస్టు 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల జూలైలో 23 నెలల గరిష్ఠాన్ని తాకితే, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) సూచీ అంతకుముందు నెల జూన్‌లో 2.1 శాతానికి పడిపోయింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం అధిక ఆహార ధరలతో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.07 శాతానికి ఎగిసింది. నిరుడు జూలైలో ఇది 3.69 శాతంగా ఉండగా, ఈ ఏడాది జూన్‌లో 5.77 శాతంగా ఉంది. ఈ క్రమంలో జూలైలో ఇది మరింతగా పెరగడం ఆందోళనకర పరిస్థితులను తలపిస్తోంది. ఇక పారిశ్రామికోత్పత్తి నిరుడు జూన్‌లో 4.2 శాతంతో బలమైన వృద్ధిని ప్రతిబింబిస్తే, ఈ జూన్‌లో వృద్ధిరేటు కేవలం 2.1కి పరిమితమైంది. ద్రవ్యోల్బణం క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లడం లేదు. తాజా గణాంకాలు వడ్డీరేట్ల తగ్గుదలకున్న అవకాశాలను మరింత జటిలం చేస్తుండగా, బ్యాంకుల నుంచి తగినంత సాయం అందాలంటే వడ్డీరేట్లను తగ్గించాలని ఐఐపి గణాంకాల నేపథ్యంలో వ్యాపార, పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెనె్సక్స్ 293, నిఫ్టీ 80 పాయింట్లు వృద్ధి
ముంబయి, ఆగస్టు 12: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 292.80 పాయింట్లు పెరిగి 28,152.40 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 80 పాయింట్లు అందుకుని 8,672.15 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో ప్రధానమైన చైనా, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు లాభపడ్డాయి. సింగపూర్ సూచీ మాత్రం నష్టపోయింది.
ప్రభుత్వ బాండ్ల వేలం
న్యూఢిల్లీ: మరోవైపు మంగళవారం బిఎస్‌ఇలో విదేశీ మదుపరులకు 9,358 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనున్నారు. సోమవారం పంద్రాగస్టు కారణంగా మార్కెట్లకు సెలవు. దీంతో మంగళవారం సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నాం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది.
దేశీయంగా మరో రెండు ప్లాంట్లను
నెలకొల్పుతాం: షియామి
ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో ఏర్పాటు
హైదరాబాద్, ఆగస్టు 12: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియామి.. దేశీయంగా మరో రెండు ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. తైవాన్‌కు చెందిన తమ ఉత్పాదక ఒప్పందదారు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ద్వారా ఈ ప్లాంట్లను నెలకొల్పుతామని షియామి ఇండియా చీఫ్ మను జైన్ శుక్రవారం ఇక్కడ తెలిపారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నామని ఆయన చెప్పారు. అయితే ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నారు. నిరుడు ఆగస్టులో ఫాక్స్‌కాన్‌తో కలిసి షియామి సంస్థ.. ఆంధ్రప్రదేశ్‌లోని చితూరు జిల్లా శ్రీసిటీలో మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించినది తెలిసిందే. షియామి సంస్థ ఇటీవలే దేశీయ మార్కెట్‌లోకి రెడ్‌మి 3ఎస్, 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. 3ఎస్ ధర 6,999 రూపాయలు, 3ఎస్ ప్రైమ్ ధర 8,999 రూపాయలు.